నాగబాబు ఇంటర్వ్యూ

Wednesday,May 02,2018 - 12:09 by Z_CLU

మే 4 న గ్రాండ్ గా రిలీజవుతుంది అల్లు అర్జున్ నా పేరు సూర్య. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో మెగా పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా సినిమా ప్రెజెంటర్ నాగబాబు, ఈ సినిమా సేస్ట్ పైకి రాకముందు నుండి రిలీజ్ వరకు తన ఎక్స్ పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు.

అల్లు వారి ప్రేరణ పని చేసింది…

ఒక మూడేళ్ళ క్రితం అల్లు అరవింద్ నా దగ్గరకి వచ్చి “నువ్ మళ్ళీ నిర్మాతగా సినిమా తీయాలి” అని చెప్పారు. మళ్ళీ కొన్నాళ్ళకు అల్లు అర్జున్ నా దగ్గరకి వచ్చి “ఈ సినిమా మీరు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది” అని చెప్పాడు. అప్పుడే నాకు మళ్ళీ నిర్మాతగా మారే ఆలోచన వచ్చింది. అప్పుడు లగడపాటి శ్రీధర్ ని పార్టనర్ గా చేసుకొని “నా పేరు సూర్య” నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. అయితే.. కథ, దర్శకుడు అన్నీ అల్లు అర్జున్ అప్పటికే సెట్ చేసుకొని ఉండడంతో మాకు పెద్దగా పని లేకుండా పోయింది. అయితే.. ఈ సినిమా నిర్మాణ సమయంలో వీళ్ళిచ్చిన ఉత్సాహంతో భవిష్యత్ లో మళ్ళీ సినిమాలు రూపొందించాలన్న ఆలోచన మాత్రం వచ్చింది.

 

అంతా బన్నీ వాసు చూసుకున్నాడు.. 

నిజానికి నిర్మాతలంటే రోజూ సెట్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అందునా పెద్ద హీరోల సినిమాలంటే అన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతుంటాయి. నేను అప్పుడప్పుడూ సెట్ కి వెళ్లానే తప్ప ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అంతా మా బన్నీ వాసు దగ్గరుండి చూసుకున్నాడు. సినిమాలో ఎలాంటి ఆర్టిస్ట్ కావాలి అనే దగ్గరనుంచి అన్నీ తానే చూసుకున్నాడు.

ఫ్యూచర్ లో వరుణ్ తేజ్ తో సినిమా…

నా ఇంట్లోనే ఒక సక్సెస్ ఫుల్ హీరో ఉన్నాడు కాబట్టి అతనితో ఒక సినిమా తీయొచ్చు కదా అని అందరూ చెబుతున్నారు. అయితే.. వరుణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. వాడు హీరోగా కొత్త కథలను ఎక్స్ ప్లోర్ చేస్తున్నాడు. వాడు బయట నిర్మాతలకు అందుబాటులో ఉండాలనే కోరుకొంటాను కానీ.. నేను క్యాష్ చేసుకోవాలన్న ఆశ ఎప్పుడూ లేదు. భవిష్యత్ లో ఏదైనా సినిమా ప్లాన్ చేయొచ్చేమో కానీ.. ఇప్పుడైతే అలాంటి ఆలోచనేమీ లేదు. అలాగే.. వాడితో కలిసి నటించే విషయంలోనూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫ్యూచర్ లో ఏదైనా మంచి సబ్జెక్ట్ వచ్చే చేస్తానేమో.

 

వక్కంతం వంశీ నెక్స్ట్ సినిమా…

చాలామందికి వంశీ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడని తెలియదు. కానీ.. నాకు అతను హీరోగా దాసరి గారి దర్శకత్వంలో చేసినప్పట్నుంచి తెలుసు. అతను అద్భుతమైన రచయిత. ఎలాంటి కథలోనైనా ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేయగల సమర్ధుడు. “నా పేరు సూర్య” సినిమాతో దర్శకుడిగా అందర్నీ ఆకట్టుకోవడమే కాదు ఆశ్చర్యపరచడం కూడా ఖాయం. వంశీ నెక్స్ట్ ఫిలిమ్ కూడా మా కాంపౌండ్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.

బన్నీ క్యారెక్టరైజేషన్ హైలైట్ గా నిలుస్తుంది.. 

సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. “క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే, చావురాకముందు చచ్చిపోవడమే” అనే డైలాగ్ ఉంటుంది. బన్నీ క్యారెక్టర్ నిబద్ధతతో ఉంటుంది. అలాగని సినిమా మొత్తం సీరియస్ గా ఉంటుందని అనుకోకండి, బన్నీ సీరియస్ నెస్ వల్లే కామెడీ కూడా క్రియేట్ అవుతుంది.

ప్రపంచస్థాయి సినిమాలకు పోటీగా ఉండాలి.. 

ప్రెజంట్ జనరేషన్ ఆడియన్స్ కి వరల్డ్ సినిమా అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఆ స్టాండర్డ్స్ ని మన తెలుగు లేదా ప్రాంతీయ సినిమాల్లోనూ ఆ క్వాలిటీ ఉండాలని కోరుకొంటున్నాడు. అందులో తప్పేమీ లేదు, అందుకే మేం కూడా సినిమాల విషయంలో ఖర్చుకి వెనుకాడడం లేదు. ప్రేక్షకులకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఇవ్వాలన్నదే మా తపన.

 

 

భవిష్యత్ లో పదికోట్ల లోపు బడ్జెట్ సినిమాలుండవు.. 

ఇప్పుడు ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్, డిజిటల్ మీడియా కారణంగా ఆడియన్స్ కి బోలెడు ఆప్షన్స్ అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల క్వాలిటీ ఉన్న కంటెంట్ ను మాత్రమే ఆదరిస్తున్నారు. భవిష్యత్ లో.. పదికోట్ల లోపు బడ్జెట్ లో తీసే సినిమాలకు థియేటర్ రిలీజ్ ఉండకపోవచ్చు.. ఆన్ లైన్ లోనే పే పర్ వ్యూ కాన్సెప్ట్ తో రిలీజ్ చేస్తారేమో.

హీరోలు కలిసుంటేనే.. పరిశ్రమ బలంగా ఉంటుంది. 

ఈమధ్య ఎన్టీయార్, మహేష్ బాబు, రామ్ చరణ్ లు కలిసి పార్టీస్ కి వెళ్ళడం ఫోటోలు దిగడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వాళ్ళందరూ కలిసుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అందువల్ల ఈ పరిణామం పరిశ్రమకి మంచిదనే చెప్పాలి.

ఎన్టీయార్-త్రివిక్రమ్ సినిమాలో చిన్న క్యారెక్టర్.. 

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఒక స్పేషల్ రోల్ ప్లే చేస్తున్నాను. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాది సినిమా ప్రారంభంలో వచ్చే పాత్ర. అలాగే.. విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్ ఫిలిమ్ లోనూ నటిస్తున్నాను.