హీరో నాగశౌర్య ఇంటర్వ్యూ

Wednesday,January 31,2018 - 03:45 by Z_CLU

ఈ వీకెండ్ ఛలో సినిమాతో థియేటర్లలోకి వస్తున్నాడు నాగశౌర్య. ట్రయిలర్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో మంచి హుషారుగా ఉన్నాడు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాడు. ఛలో గురించి ఈ యంగ్ హీరో చెబుతున్న మరిన్ని వివరాలు మీకోసం..

బ్యానర్ పేరు వెనక సీక్రెట్
మా సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్. ఈ బ్యానర్ పై నేను చేసిన సినిమా ఛలో. ఈ బ్యానర్ కు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీడియాకు థ్యాంక్స్. నా ఫేవరెట్ దేవుడు వినాయకుడు, ఇష్టమైంది ఏనుగు. అందుకే ఐరా క్రియేషన్స్ అని పేరుపెట్టాం. కూతురు పుడితే ఐరా అనే పేరుపెడదాం అనుకున్నారట. అందుకే ఈ బ్యానర్ కు ఈ పేరు పెట్టారు.

ఆయన లేకపోతే ఈ సినిమా లేదు
ఛలో సినిమా వెనక మా కెమెరామెన్ సాయిశ్రీరామ్ చొరవ చాలా ఉంది. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. నేను జాదుగాడు అనే సినిమా చేస్తున్నప్పుడే వెంకీ నాకు పరిచయం. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేశాడు. అప్పట్నుంచే నాకు క్లోజ్ అయ్యాడు. వెంకీ నన్ను సినిమా గురించి అడగలేకపోయాడు. నేనే ఫోన్ చేసి రమ్మని చెప్పాను. అలా ఛలో సినిమా వచ్చింది. భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతాడు.

ఛలో వెనక కథ
ఫస్ట్ నాకు ఓ లైన్ చెప్పాడు. అది నచ్చలేదని మొహంమీదే చెప్పేశా. తర్వాత క్రైమ్ కామెడీ చెప్పాడు. ఫస్ట్ మూవీకే ఆ లైన్ వద్దని చెప్పేశా. కమర్షియల్ గా ఏదైనా ట్రై చేయమని చెప్పాను. ఆ తర్వాత మరో లైన్ చెప్పినా ఓకే చెప్పలేదు. పైనల్ గా నేను బయట ఎలా ఉంటానో, అలాంటి క్యారెక్టర్ తో ఓ లైన్ చెప్పాడు. అదే ఛలో మూవీ.

ఇకపై నా మార్క్ ఉంటుంది
చాలా సినిమాలకు స్టోరీ డిస్కషన్ లో అస్సలు వేలు పెట్టేవాడ్ని కాదు. కానీ సినిమా ఫ్లాప్ అయితే అది నా మార్కెట్ వాల్యూపై ప్రభావం చూపిస్తోంది. అందుకే అప్పట్నుంచి వేలు మాత్రమే కాదు, అవసరమైతే కాలు కూడా పెట్టాలని ఫిక్స్ అయ్యాను. కెరీర్ పరంగా ఒక మెట్టు పైకెక్కితే, నాలుగు మెట్లు కిందకి వెళ్లాల్సి వచ్చింది. అందుకే నా ప్రమేయం కూడా ఉండాలని ఫిక్స్ అయ్యాను. నా బ్యానర్ మాత్రమే కాదు, ఏ బ్యానర్ అయినా నేను ఇన్ వాల్వ్ అవుతాను. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లోనే కేర్ తీసుకుంటాను. బౌండెడ్ స్క్రిప్ట్ కావాలి నాకు. ఛలో విషయంలో నా చొరవ కాస్త ఎక్కువే ఉంటుంది.

నా రియల్ లైఫ్ క్యారెక్టర్
ఛలో సినిమాలో నన్ను నేను చూసుకున్నాను. రియల్ లైఫ్ లో నేను ఎలా ఉంటానో ఈ సినిమాలో అలానే ఉన్నాను. హీరోయిన్ తో ఉన్నప్పడు తప్ప, మిగతా సినిమా అంతా నా రియల్ లైఫ్ క్యారెక్టర్ చూస్తారు.

సినిమా స్టోరీ సింపుల్ గా..
నేను ఎప్పుడూ అమ్మాయి కోసం ఫైట్ చేయలేదు. ఈ సినిమాలో మాత్రం చేస్తాను. ఇందులో క్లయిమాక్స్ కొత్తగా
ఉంటుంది. తెలుగు, తమిళ బోర్డర్ లో ఉన్న ఓ ఊరు రెండు ముక్కలైపోతుంది. తమిళ్ వైపు తెలుగోడు రాకూడదు. తెలుగు వైపు తమిళ వైపు రాకూడదు. అలా వస్తే సంప్రదాయబద్దంగా చంపేసుకుంటారు. వాళ్ల మధ్య విద్వేషాలు ఎందుకొచ్చాయి. దాన్ని హీరో ఎలా సాల్వ్ చేశాడనేది ఛలో మూవీ. క్లయిమాక్స్ లో క్లాస్ పీకే సన్నివేశాలు ఉండవు. డిఫరెంట్ గా ఉంటుంది. విలన్లను కూడా కొట్టను. మీరే చూసి తెలుసుకోవాలి.

మ్యూజిక్ అదిరింది
నేను, మా మ్యూజిక్ డైరక్టర్ చాలా జర్నీ చేశాం. ఈ సినిమాకు సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జాదూగాడు సినిమా
నుంచి సాగర్ నాకు పరిచయం. సొంత బ్యానర్ లో చేస్తున్నప్పుడు మనసుకు నచ్చిన వాళ్లను తీసుకుంటే ఔట్ పుట్ బాగుంటుందని సాగర్ ను తీసుకున్నాం. సాగర్ మాత్రమే కాదు, ఇందులో టెక్నీషియన్లంతా నాకు చాలా క్లోజ్.

వెంకీని తీసుకున్నది అందుకే
ఇది నా సొంత బ్యానర్ అయినప్పటికీ నేను ప్రొడక్షన్ లో ఇన్ వాల్వ్ అవ్వలేదు. ఆ బాధ్యత మొత్తం అమ్మ తీసుకుంది.
నేను స్టోరీ, ప్రీ-ప్రొడక్షన్ మాత్రం చూసుకున్నాను. నాన్న, అంకుల్ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సొంత బ్యానర్ లో సినిమా చేస్తున్నావ్.. కొత్త దర్శకుడు ఎందుకు, అవసరాల శ్రీనివాస్ లేదా నందినిరెడ్డిని తీసుకోవచ్చు కదా అని చాలామంది అడిగారు. వాళ్లు నాకు క్లోజే. కానీ వెంకీ నన్ను నమ్ముకున్నాడు. గతంలో అవసరాల శ్రీనివాస్, సాయికొర్రపాటి లాంటి వ్యక్తులు నన్ను నమ్మారు. ఇప్పుడు ఈ పొజిషన్ లో నేను వెంకీని నమ్మకపోతే నా జీవితం వేస్ట్. అందుకే కొత్త దర్శకుడే అయినప్పటికీ ఛాన్స్ ఇచ్చాను.

పెళ్లి వార్తల్లో నిజం లేదు
నిహారికతో నాకు పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి. నాకు ఏ సంబంధం లేదు. వేరే ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు. నేనే షాక్ లో ఉన్నాను. ఏం జరుగుతుందో చూడాలి. నాకు హీరోయిన్లు ఎవరితో సంబంధం లేదు. నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. మా అమ్మ బలవంతం చేస్తే మరో 3-4 ఏళ్లలో పెళ్లి చేసుకుంటానేమో. అమ్మ చూసిన ఏ అమ్మాయి అయినా నాకు ఓకే.

ఇకపై అలాంటి తప్పులు చేయను
కథలో రాజకుమారి అనే సినిమాను కేవలం నా ఫ్రెండ్ నారా రోహిత్ కోసమే చేశాను. నేను స్టోరీ వినలేదు. కేవలం నారా
రోహిత్ అడిగాడనే చేశాను. అది ఓ మిస్టేక్. ఇకపై ఇలాంటి తప్పులు చేయను. నన్ను అందరూ లవర్ బాయ్ గా చూస్తారు.
కానీ నేచురల్ గా నేను చాలా మాస్. కాకపోతే లవ్ సబ్జెక్ట్ సినిమాలు క్లిక్ అయ్యాయంతే.

నెక్ట్స్ సినిమా నర్తనశాల
నర్తనశాల టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నాను. శ్రీనివాస్ అనే కుర్రాడు చెప్పిన ఈ కథ నేను ఐదేళ్ల కిందటే విన్నాను.
అప్పట్లోనే చేద్దాం అనుకున్నాను. కానీ నిర్మాతలు దొరకలేదు. ఇప్పుడు సొంత బ్యానర్ ఉంది కాబట్టి, మా బ్యానర్ లోనే ఆ
సినిమా చేస్తాం. మరో 3-4 నెలల్లో అది స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు మా ఛలో కెమెరామెన్ సాయిశ్రీరామ్ ను
దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తాను. ఇదొక లవ్ స్టోరీ. సాయిశ్రీరామ్ సినిమా వేరే ప్రొడక్షన్ లోనే ఉంటుంది.

ఛలో టైటిల్ వెనక కహానీ
ఓసారి షూటింగ్ కు కారులో వెళ్తుంటే బ్రూస్ లీ సినిమా నుంచి లే..ఛలో అనే సాంగ్ వస్తోంది. ఆ టైటిల్ పెడితే ఎలా
ఉంటుందని మా దర్శకుడికి చెప్పా. ఇద్దరూ డిస్కస్ చేసి ఛలో అనే టైటిల్ ఫిక్స్ చేశాం. అలా ఈ సినిమా టైటిల్
పుట్టింది. ఇక బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీ. సినిమాను అన్ని ఏరియాల్లో అమ్మేశాం. నైజాం మాత్రం మేం
ఉంచుకున్నాం. సినిమాపై నమ్మకంతోనే ఈ పని చేశాం.