బాక్సాఫీస్ వార్: నాగచైతన్య Vs నాగశౌర్య

Wednesday,August 01,2018 - 01:25 by Z_CLU

ఈ కాలం సోలో రిలీజ్ దొరకడం చాలా కష్టమైపోతోంది. ఎప్పుడు ఏ సినిమా వచ్చి పోటీగా నిలబడుతుందో అర్థంకాని పరిస్థితి. నాగచైతన్య సినిమాకు కూడా ఇప్పుడిలానే ఓ పోటీ ఎదురైంది. అది నాగశౌర్య రూపంలో వచ్చింది.

నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా శైలజారెడ్డి అల్లుడు. జస్ట్ 2 రోజుల కిందటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఎలాంటి పోటీ లేదని భావించి ఈనెల 31న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. డేటెడ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడీ సినిమాకు ఒక రోజు ముందు వస్తోంది నాగశౌర్య సినిమా.

ఛలో తర్వాత మరోసారి తన హోం బ్యానర్ లో నాగశౌర్య చేస్తున్న సినిమా నర్తనశాల. ఈ సినిమాను ఆగస్ట్ 30న (శైలజారెడ్డి అల్లుడు కంటే ఒకరోజు ముందు) విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో నాగచైతన్య వెర్సెస్ నాగశౌర్య అన్నట్టు మారింది.

ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడిపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన లుక్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. అటు నర్తనశాలను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఛలో లాంటి బిగ్ హిట్ తర్వాత ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య చేసిన సినిమా ఇది. ఈ మూవీపై కూడా అంచనాలున్నాయి.