వెంకీమామ.. ఇది మల్టీస్టారర్ కాదు

Wednesday,December 11,2019 - 03:36 by Z_CLU

అటు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేయాలనే కోరిక,
ఇటు వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక..
ఇలా ఒకేసారి తన రెండు కోరికలు తీరిపోయాయని అంటున్నాడు నాగచైతన్య. వెంకీమామ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చైతూ, సినిమా సంగతులతో పాటు తన అప్ కమింగ్ మూవీ డీటెయిల్స్ ను పంచుకున్నాడు.

ఫస్ట్ టైమ్ కోపం చూశాను
సురేష్ బాబు నుంచి చాలా నేర్చుకున్నాను. సెట్స్ లో అతడ్ని గమనిస్తే చాలు, చాలా నేర్చుకోవచ్చు. ఇక వెంకీ మామ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. ఆయన్ని చూసి పాజిటివిటీ నేర్చుకోవాలి. ఆయనతో నటిస్తే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఎంటర్ టైన్ మెంట్. ఆయన టైమింగ్ సూపర్. వీటితో పాటు ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ ఇలా చాలా నేర్చుకోవచ్చు. నేను కొంచెం నేర్చుకున్నాను. ఫస్ట్ టైమ్ సురేష్ మామ, వెంకీమామ కోపం కూడా చూశాను.

వెంకీ మామతో నటించడం కష్టమైంది
రియల్ లైఫ్ లో నేను, వెంకీమామ చాలా రిజర్వ్. ఎక్కువ మాట్లాడుకోం. మా సైలెన్స్ లోనే ఓ బాండింగ్ ఉంటుంది. కానీ సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి. నాకు వెంకీ మామతో నటించడానికి 10 రోజులు పట్టింది. ఇంట్లో ఒక రకంగా, సెట్స్ పై మరో రకంగా ఉండాల్సి వచ్చింది. సెట్స్ పై మామ ముందు తప్పు చేయకూడదనే టెన్షన్ ఉంది. వెంకీ మామతో నాకు చిన్నప్పట్నుంచి ఓ బాండింగ్ ఉంది. సెట్స్ పై ఆ బాండింగ్ బోనస్ అయింది

ఈ క్యారెక్టర్ చాలా కొత్త
సినిమాలో ఆర్మీ ఎపిసోడ్ నాకు చాలా కొత్త. ఆ ఎపిసోడ్ లో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిజం ఉన్నాయి. ఓ మిలట్రీ ఆఫీసర్ గా నేను చేసిన ఎపిసోడ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇక గోదావరి బ్యాక్ డ్రాప్ లో తీసిన సన్నివేశాల్లో ఎక్కువగా వెంకటేష్ గారి సీన్స్ ఉంటాయి. పాత్ర పరంగా నేను సిటీలో పుట్టి, పండగకు వెంకీమామ ఇంటికి వెళ్తాను.

2 కోరికలు – ఒక సినిమా
సురేష్ ప్రొడక్షన్స్ లో చేయాలని, వెంకీమామతో నటించాలని కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉంది. ఆ రెండు కోరికలు ఇలా ఒకేసారి, ఒకే సినిమాతో నెరవేరడం చాలా హ్యాపీగా ఉంది. ప్లాన్ చేయకుండానే ఇది జరిగింది. మామూలుగా సురేష్ మామకు, నాకు మధ్య 20 స్క్రిప్టులు చర్చకు వచ్చి ఉంటాయి. కానీ ఏదీ ఇప్పటివరకు వర్కవుట్ కాలేదు. ఎందుకో ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి.

నా దృష్టిలో ఇది మల్టీస్టారర్ కాదు
చిన్నవాడినైనా అన్నింటిలో నేనే ముందున్నానని రానా అంటున్నాడు. నిజంగా పెళ్లి, వెంకీమామ లాంటివి నేను ఫిక్స్ చేయలేదు. టైమ్ అలా నడుస్తోందంతే. వెంకీమామ సినిమాను మల్టీస్టారర్ గా నేను చెప్పను. వెంకటేష్ పక్కన నేనొక పాత్ర మాత్రమే చేస్తాను. దీన్ని మల్టీస్టారర్ అని నేను ఎందుకు చెప్పనంటే.. చిన్నప్పట్నుంచి వెంకీమామ సినిమాలు చూసి పెరిగాను. అతడి పక్కన నన్ను నేను మరో స్టార్ గా ఊహించుకోలేను. సో.. నా దృష్టిలో ఇది మల్టీస్టారర్ కాదు. ఇది పూర్తిగా వెంకటేష్ గారి సినిమా. నేను ఓ పాత్ర పోషించానంతే.

సినిమాలో హైలైట్ అదే
ఈ సినిమాలో మామ-అల్లుడు మధ్య చిన్న త్యాగం లాంటి ఎలిమెంట్ ఉంటుంది. సినిమాకు అదే హైలెట్. సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఉన్నప్పటికీ ఎమోషనల్ ఎలిమెంట్ మాత్రమే హైలెట్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ ఇలాంటి ఎమోషన్ ఏ సినిమాలో రాలేదు. నేను బాగా కనెక్ట్ అయి చేశాను. సినిమాలో మా రెండు పాత్రలు ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తారు.

విలన్ కనిపించడు
ఈ సినిమాలో విలన్ అనేది ఓ వ్యక్తి కాదు. జాతకం అనేది విలన్ గా పనిచేస్తుంది. సినిమాలో అదంతా బాగా వచ్చింది. సినిమాలో జాతకాలు నిజం, అబద్ధం అనే విషయాన్ని చర్చించలేదు. ఇవేవీ ట్రయిలర్ లో చూపించలేదు. సినిమా నేను చూశాను. చాలా బాగా వచ్చింది.

కథల ఎంపిక ఇలా…
ఫెయిల్యూర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. వాటి ఆధారంగానే కొత్త సినిమా కథల్ని ఎంచుకుంటాను. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కామెంట్స్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించి, మనకు అవసరమైనవి తీసుకుంటున్నాను. నెగెటివిటీ అనేది ప్రతి చోటా ఉంటుంది, దాన్ని పక్కనపెట్టి జెన్యూస్ కామెంట్స్ ను తీసుకుంటాను.

కొత్త దర్శకులతో ఇప్పట్లో సినిమా చేయను
డెబ్యూ డైరక్టర్స్ మీద నాకు ఎలాంటి అనుమానాల్లేవు. గతంలో కొంతమంది కొత్త దర్శకులతో వర్క్ చేశాను కానీ అవి వర్కవుట్ కాలేదు. అలా అని భవిష్యత్తులో కొత్త దర్శకులతో సినిమాలు చేయనని కాదు. నా సమస్య ఏంటంటే… నేను దర్శకుల హీరోను. నా నుంచి ఏం కావాలి, ఎంత కావాలి అనేది దర్శకుడు తీసుకోవాలి. అందుకే కెరీర్ లో ఇంకాస్త సెట్ అయ్యేంతవరకు ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకులతోనే పనిచేయాలని అనుకుంటున్నాను. కాస్త సెటిల్ అయ్యాక అప్పుడు మళ్లీ కొత్త దర్శకులతో చేస్తాను. ఇది నా సమస్య. నా వీక్ నెస్. డెబ్యూ డైరక్టర్లపై అనుమానాలు కావు.

శేఖర్ కమ్ముల ది బెస్ట్
నటుడిగా రియలిస్టిక్ గా ఉండే కథలు నాకిష్టం. కానీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని కథలు సెలక్ట్ చేసుకోవాలి. సినిమాల్లో అక్కడక్కడ రియలిస్టిక్ గా యాక్ట్ చేస్తుంటాను. శేఖర్ కమ్ముల సినిమాలో అయితే చాలా రియలిస్టిక్ గా కనిపిస్తాను. అది నా మనసుకు నచ్చిన పాత్ర. కమ్ముల ఎన్ని టేక్స్ చెప్పినా నాకు ఇబ్బంది అనిపించడం లేదు. కమ్ముల సినిమా షూటింగ్ 40శాతం అయిపోయింది. లవ్ స్టోరీ అనే టైటిల్ ను ఇంకా ఫైనల్ చేయలేదు.

సమంత స్ట్రయిట్ ఫార్వడ్
సమంత సినిమా చూసింది. తన అభిప్రాయాన్ని చాలా స్ట్రయిట్ గా చెప్పేస్తుంది. ఈ సినిమా సమంతకు చాలా బాగా నచ్చింది. సెకండాఫ్ లో ఎప్పుడైతే మిలట్రీ, జాతకం ఎలిమెంట్స్ వచ్చాయో అప్పట్నుంచి సమంత బాగా ఎంజాయ్ చేసింది. బాగుందని చెప్పింది. నాగార్జునకు ఈ సినిమాకు అస్సలు సంబంధం లేదు. సినిమా చూడలేదు, కథ కూడా తెలియదు.

అప్ కమింగ్ మూవీస్
నాన్నగారితో బంగార్రాజు ప్రాజెక్టు చేస్తాను. కానీ ఆ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఏదో ఒక టైమ్ లో ఆ సినిమా చేస్తాను. దిల్ రాజు నిర్మాణంలో శశి దర్శకత్వంలో సినిమా ఇంకా ఫైనల్ అవ్వలేదు. దిల్ రాజు ఇంకా కథపై కాన్ఫిడెంట్ గా లేరు. మేర్లపాక గాంధీ సినిమా కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఇలా చాలా సినిమాలున్నాయి కానీ పేపర్ పై ఇంకా ఏదీ సైన్ చేయలేదు.