నాగ చైతన్య ఇంటర్వ్యూ

Thursday,May 25,2017 - 06:18 by Z_CLU

మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకాబోతోంది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వేడుక చూసిన ఫీలింగ్ కలుగుతుందంటున్నాడు హీరో నాగచైతన్య. సినిమా హైలెట్స్ తో పాటు…  తన కెరీర్ కు ఈ సినిమా ఎందుకంత స్పెషలో వివరిస్తున్నాడు..

సరికొత్త బాడీ లాంగ్వేజ్

గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫుల్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ నాది. నా క్యారెక్టర్ లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఇంత ఎంటర్ టైన్ మెంట్ పాత్ర ఎప్పుడూ చేయలేదు.

సినిమాలో హైలెట్ అదే

నాకు, జగపతిబాబుకు మధ్య వచ్చే సన్నివేశాలు, నాకు-రకుల్ కు మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి.

ఆ డైలాగ్ ఇబ్బంది పెట్టదు

“అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం” అనే డైలాగ్ బాగా హైలెట్ అయిపోయింది. అయితే అది మీకు ట్రయిలర్ లో అలా అనిపిస్తుంది కానీ మూవీలో మాత్రం అది ఫ్లోలో వెళ్లిపోతుంది. సన్నివేశం ప్రకారం ఆ క్యారెక్టర్ అలా చెబుతుంది తప్ప కావాలని పెట్టింది కాదు. సినిమాలోంచి ఆ డైలాగ్ తీసేయలేదు. సినిమాలో ఆ డైలాగ్ ఎవర్నీ ఇబ్బందిపెట్టదు. అలా వచ్చి వెళ్లిపోతుందంతే.

“నిన్నే పెళ్లాడతా” గుర్తొస్తుంది

ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిన్నే పెళ్లాడతా లాంటి సినిమా చేయాలనుకున్నాం. నాన్నతో డిస్కస్ చేస్తున్నప్పుడే నిన్నే పెళ్లాడతా టైపు స్టోరీ చేయాలంటూ చర్చలు జరిపాం. కుటుంబాల మధ్య బంధాలు ఎలా ఉంటాయి. ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు వస్తే ఏం జరుగుతుంది.. ఇలా చర్చిస్తూ ఆ మూడ్ నుంచి వచ్చిందే రారండోయ్ వేడుక చూద్దాం. మూవీలో ఎమోషన్స్ చూస్తే నిన్నే పెళ్లాడతా గుర్తొస్తుంది. కానీ ఆ సినిమాకు రారండోయ్ తో ఎలాంటి సంబంధం లేదు.

ఆ టైటిల్ పెట్టాలని అనుకోలేదు

రారండోయ్ సినిమాకు నిన్నే పెళ్లాడతా టైటిల్ నే పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. స్టార్టింగ్ లో ఆ మూడ్ లో అంతా ఉన్నాం కాబట్టి అలా అనిపించి ఉండొచ్చు. అంత తప్ప ఆ టైటిల్ పెట్టాలని, ఆ సినిమానే రీమేక్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు.

టైటిల్ అలా పుట్టుకొచ్చింది

ఎన్నో టైటిల్స్ అనుకున్నాం కానీ ఏది ఫిక్స్ అవ్వలేదు. అయితే ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు రారండోయ్ వేడుక చూద్దాం అనే లిరిక్స్ నాతో పాటు అందరికీ బాగా నచ్చాయి. అందుకే ఆ లిరిక్ నే టైటిల్ గా పెట్టేశాం.

నన్ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాడు

నటుడిగా నా రేంజ్, స్కోప్ ను ఇంకాస్త పెంచుకోవాలని అనుకున్నాను. అందుకే కల్యాణ్ కృష్ణతో ఆ యాంగిల్ లోనే చర్చలు జరిపాను. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా టైం నుంచి కల్యాణ్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నాను. మాస్ పల్స్ కల్యాణ్ కు బాగా తెలుసు. సేమ్ టైం కల్యాణ్ కృష్ణ ప్రజెంటేషన్ కొత్తగా ఉంటుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా చూసిన తర్వాత, కల్యాణ్ కృష్ణ నన్ను నటుడిగా నన్ను నెక్ట్స్ లెవెల్ ను తీసుకెళ్తాడని అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా నేను డెవలప్ అయ్యానని నమ్ముతారు.

జగపతిబాబు సూపర్

జగపతిబాబుతో చేయడం చాలా గొప్ప అనుభూతి. అంత సీనియర్ నటుడితో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. జగపతిబాబు ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యారు. ఒక నటుడిగా నేను కూడా జగపతిబాబు నుంచి చాలా నేర్చుకున్నాను. అంతా సీనియర్ అని ఎందుకంటారో జగపతిబాబుతో పనిచేసిన తర్వాత అర్థమైంది.

సినిమా అంతా వేడుక

సినిమా అంతా ఫెస్టివ్ మూడ్ లో ఉంటుంది. అందుకే కాస్ట్యూమ్స్ కూడా అదే థీమ్ లో ప్లాన్ చేశాం. ఎక్కువ సంప్రదాయబద్దంగా కనిపిస్తాయి. థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకొచ్చిన ప్రేక్షకులు ఓ మంచి వేడుక చూశాం అనే ఫీలింగ్ తో ఇంటికి వెళ్తారు.

భ్రమరాంబ గురించి..

రకుల్ చాలా కొత్తగా కనిపిస్తుంది. అందరూ ఆమె క్యారెక్టర్ చూసి ఇష్టపడతారు. సొగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ ఎంత హైలెట్ అయిందో.. ఈ సినిమాలో భ్రమరాంబ క్యారెక్టర్ అంత హైలెట్ అవుతుంది. రకుల్ చాలా బాగా చేసింది.

నేను ఫుల్ హ్యాపీ

ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నానని నాగార్జున అన్నారట. సమంత నా లైఫ్ లోకి వచ్చినందు వల్లే నేను హ్యాపీగా ఉన్నానని నాన్న అన్నారు. బహుశా అదే రీజన్ అవ్వొచ్చు. ఇంట్లో మనం హ్యాపీగా ఉంటే, ఆ ఆనందం సెట్స్ పై కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం వ్యక్తిగతంగా నేను ఫుల్ హ్యాపీ. నేను వెళ్తున్న దారి నాకు బాగా నచ్చింది.

సొంత బ్యానర్ చాలా ఇచ్చింది

సొంత బ్యానర్ లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా నా కోసం నాన్న ఇంత సెటప్ రెడీ చేయడం చాలా నచ్చింది. ఇంత పెద్ద సినిమా నాకు రావడం హ్యాపీగా ఉంది. సక్సెస్ ఫుల్ దర్శకుడు, పెద్ద బడ్జెట్, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, దేవిశ్రీ, రకుల్.. ఇలా చాలామందిని ఇచ్చారు. మరీ ముఖ్యంగా నాన్న ఇంత కేర్ తీసుకొని ఈ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది.

పెళ్లి ఎక్కడో అప్పుడే చెప్పలేం

పెళ్లి అక్టోబర్ లో ప్లాన్ చేస్తున్నాను. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో మా పెళ్లి జరుగుతుంది. పెళ్లి ఇండియాలోనే జరుగుతుంది. విదేశాలకు వెళ్లే ఆలోచన లేదు. హైదరాబాద్ లేదా ఇంకో మంచి ప్లేస్ లో పెళ్లి ఉంటుంది.

నెక్ట్స్ చందు మొండేటితోనే..

చందు మొండేటి సినిమాకు సంబంధించి స్టోరీలైన్ అనుకున్నాం. ప్రస్తుతం దాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఒక నెల రోజులు గ్యాప్ తీసుకొని, స్టోరీ బాగా వచ్చిందనుకున్న తర్వాత అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తాం. ఇంద్రగంటి మోహనకృష్ణతో కూడా ఓ సినిమా అనుకున్నాం కానీ స్టోరీలైన్ సెట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆయన అమీతుమీ సినిమా చేస్తున్నారు. ఆ మూవీ తర్వాత బహుశా ఉంటే ఉండొచ్చు. నెక్ట్స్ సినిమా మాత్రం చందు మొండేటితోనే..

నో తమిళ్ ఎంట్రీ

ప్రస్తుతానికి తమిళ సినిమాలేవీ అనుకోలేదు. తెలుగు-తమిళ భాషల్లో ఎలాంటి ప్రాజెక్టు ఫైనల్ చేయలేదు. కొన్ని నెలలుగా చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ ఏదీ ఫైనల్ అవ్వలేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత కోలీవుడ్ గురించి ఆలోచిస్తా.