నా పెళ్లి అక్కడే....!
Tuesday,November 08,2016 - 03:00 by Z_CLU
రీసెంట్ గా ‘ప్రేమమ్’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న అక్కినేని యువ హీరో నాగ చైతన్య మరో సినిమాతో తో రెడీ అవుతున్నాడు. తనకు కథానాయకుడిగా తొలి హిట్ అందించిన దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం లో చైతూ నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం ఈ నెల 11 న విడుదలకి సిద్ధమైంది. ఈ సందర్బంగా చైతూ మీడియా తో మాట్లాడాడు.
నిరుత్సాహపడ్డ విషయం వాస్తవమే…
సాహసం శ్వాసగా సాగిపో సినిమా విడుదల ఆలస్యం అవ్వడంతో కాస్త నిరుత్సాహపడ్డాను. అయితే గౌతమ్ మీనన్ గారి చేతుల్లో ఏముంది ఈ సినిమా ఆలస్యానికి తమిళ్ వెర్షన్ లేట్ అవ్వడమే కారణం. సో… ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి నిరుత్సాహం తగ్గి ఉత్సాహం పెరిగింది. ఈ సినిమాతో మరోసారి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
అదృష్టం గా భావిస్తున్నా…
ఏ.ఆర్.రెహ్మాన్ గారితో రెండో సినిమా చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటికీ ‘ఏ మాయ చేసావే’ నా ఫెవరెట్ ఆల్బమ్. నాకే కాదు అందరికి ఆ ఆల్బమ్ ఫెవరెట్ అనే చెప్పాలి. మళ్ళీ ఆ రేంజ్ ఆల్బమ్ ఈ సినిమాలో అందించారు. రెహ్మాన్ గారి పాటలే సినిమాకు హైప్ తీసుకొచ్చాయని భావిస్తున్నాను. సినిమాకు గౌతమ్ మీనన్ గారి టేకింగ్ ఒకెత్తయితే, రెహ్మాన్ మ్యూజిక్ మరో ఎత్తని చెప్పొచ్చు.

అలాంటివి చేయలేదు..
సాహసం శ్వాసగా సాగిపో సినిమా… తమిళ్, తెలుగు వెర్షన్లలో తేడా ఉండదు. రెండు భాషల్లోనూ ఒకేలా ఉంటుంది. తెలుగు వెర్షన్ కోసం ఎలాంటి మార్పులు చేయలేదు. రెండు భాషల ఆడియన్స్ కు ఇది తప్పకుండా కనెక్ట్ అవుతుంది.
వచ్చే ఏడాది అదే టార్గెట్..
తమిళ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఉంది. సాహసం శ్వాసగా తమిళ్ వెర్షన్ లో కూడా నటిస్తా అని చెప్పే లోపే గౌతమ్ మీనన్ గారు అక్కడ కొంత సినిమా తీసేశారు. కానీ నెక్స్ట్ ఇయర్ నేను చేసే సినిమాలతో అయినా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. మన చేసే సినిమాలు యూనివర్సల్ సబ్జెక్ట్స్ కాబట్టి అక్కడ కూడా మంచి రెస్పాన్సే వస్తుందని భావిస్తున్నా.
ఈ సినిమాలో అలా ఉండదు..
వరుసగా మా ఫ్యామిలీ సినిమాల్లో ఎవరో ఒకరు గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాం. కేవలం అభిమానులను, ప్రేక్షకులను అలరించాలని ఏదో సరదాగా చేసాం. ఈ సినిమాలో మాత్రం ఎవరు గెస్ట్ రోల్ చెయ్యలేదు.
పెళ్లి అక్కడే…
నాకంటే ముందే అఖిల్ పెళ్లి జరగనుంది. ఇటలీ లోని రోమ్ సిటీలో అఖిల్ పెళ్లి చాలా ఘనంగా జరగబోతోంది. ఎంగేజ్మెంట్ మాత్రం ఇక్కడే ఉంటుంది. మొన్నటి వరకూ అందరి ఫోకస్ నా పెళ్లి మీదే ఉంది. కానీ ప్రెజెంట్ అందరి ఫోకస్ అఖిల్ పెళ్లి పై డైవర్ట్ అయ్యింది. ఇక నా పెళ్లి గురించి ఇప్పటికిప్పుడు చెప్పడానికేం లేదు. వాడి పెళ్లయ్యాక కాస్త టైం తీసుకొని నేను పెళ్లి చేసుకుంటా. ఏమాయచేశావే సినిమాలోలా… చెన్నైలోనో.. ఏ చర్చిలోనో పెళ్లి చేసుకుంటానేమో… (నవ్వుతూ)

కొత్త సినిమాలు…
ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నటించబోయే సినిమా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదు. కళ్యాణ్ కృష్ణ ఓన్ స్టోరీ. కానీ కాస్త నిన్నే పెళ్లాడతా ఫ్లేవర్ ఉంటుంది. ఈ సినిమా అవ్వగానే సురేష్ ప్రొడక్షన్ లో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తా..
అది చెప్పలేను..
ప్రస్తుతం సమంత నేను కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. మంచి కథ దొరికితే తప్పకుండా మళ్ళీ కలిసి నటిస్తాం. కానీ పెళ్ళికి ముందా, తరువాత అనేది చెప్పలేను.