నాంది టీజర్ : అల్లరోడిలో మరో కోణం

Tuesday,June 30,2020 - 01:48 by Z_CLU

 

ఇప్పటికే నటుడిగా తనేంటో నిరుపించుకున్న అల్లరి నరేష్ త్వరలో ఓ క్రైం థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘నాంది’ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్ లో అల్లరినరేష్ లో మరో కోణం కనిపించింది.

దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో 2005 నాటికి 1401 జైళ్ళు ఉంటే 3,66,781 మంది రకరకాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో దాదాపుగా 2,50,000 మంది తప్పు చేసామో చేయలేదో తెలియకుండానే అండర్ ట్రయిల్ ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్నారు… అంటూ మొదలైన టీజర్ లో జైలు వ్యవస్థ, అక్కడ నేరస్తులపై కఠినంగా అమలు చేసే శిక్షల తాలూకు సన్నివేశాలతో సినిమాపై అంచనాలు పెంచేలా కట్ చేశారు.

ఇక టీజర్ లో నరేష్ నటన అతనిపై అమలు చేసే శిక్షలు చూస్తుంటే  క్రైం థ్రిల్లర్ జోనర్ లో మంచి సినిమా అవుతుందనే నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా టీజర్ ఎండింగ్ లో ఒక మనిషి పుట్టడానికి 9 నెలలే పడుతుంది నాకు న్యాయం చేయడానికేంటి సార్ ఇన్నేళ్ళు పడుతుంది అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీ కలిగిస్తుంది.

ఎడిటర్ ఛోటా కే ప్రసాద్ టీజర్ లో పర్ఫెక్ట్ షాట్స్ వాడి ఇంప్రెస్ చేశాడు. సతీష్ వేగేశ్న నిర్మాణంలో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో రాబోతున్న ‘నాంది’ టీజర్ తో ప్రమోషన్స్ కి నాంది పలికి సోషల్ మీడియాలో అందరినీ మెప్పిస్తుంది. టీజర్ చూసాక నటుడిగా నరేష్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కుతాడని అనిపిస్తుంది.