జీ స్పెషల్ : నిర్మాణంలో కలిసికట్టుగా

Sunday,April 28,2019 - 01:50 by Z_CLU

ఒక సినిమాను ఇద్దరు నిర్మాతలు కలిసి నిర్మించడం చాలా అరుదు. అప్పుడపుడు మాత్రమే అలా ఇద్దరు నిర్మాతలు ఓ సినిమా కోసం కలుస్తుంటారు. అయితే ప్రస్తుతం కొన్ని సినిమాల పోస్టర్స్ పై ఇద్దరు, ముగ్గురు నిర్మాతల పేర్లు కనిపిస్తున్నాయి. అలా నిర్మాణంలో కలిసి కట్టుగా పనిచేస్తున్న నిర్మాతలపై జీ సినిమాలు స్పెషల్ స్టొరీ.

మహేష్ బాబు 25 వ సినిమా ‘మహర్షి’ కోసం ముగ్గురు బడా నిర్మాతలు ఒకటయ్యారు. ఇప్పటి వరకూ సోలోగా సినిమాలు నిర్మించిన దిల్ రాజు , అశ్వని దత్ , పీవిపీ ఫస్ట్ టైం ఈ సినిమాను కంబైన్ గా నిర్మించారు.  ముగ్గురం కలిసి ఈ సినిమాతో ఓ గ్రాండ్ హిట్ కొట్టబోతున్నామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో సినిమా కోసం బడా నిర్మాతలు అల్లు అరవింద్ , చిన బాబు ఏకమయ్యారు. అల్లు అర్జున్ 19 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ , హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై  ఈ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. నిజానికి ఇది ఎవరూ ఊహించని కాంబో… ఈ రెండు బ్యానర్లు కలిసి నిర్మించడంతో సినిమాపై ఆరంభంలోనే భారీ హైప్ క్రియేట్ అయింది. వరుసగా చినబాబు నిర్మాణంలోనే సినిమాలు చేస్తూ వస్తున్న త్రివిక్రమ్ జల్సా తర్వాత గీతా ఆర్ట్స్ లో చేస్తున్న సినిమా ఇదే.


ప్రభాస్ 20వ సినిమా కోసం యూ.వి క్రియేషన్స్ తో కలిసింది గోపి కృష్ణ సంస్థ. ఈ సంస్థ మరెవరిదో కాదు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజుది. బిల్లా తర్వాత ప్రభాస్ తో మళ్ళీ సినిమా చేయాలని చూస్తున్న కృష్ణం రాజు ఎట్టకేలకు ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీర్చుకుంటున్నారు. నిజానికి ఈ రెండు సంస్థలు ప్రభాస్ వే అని చెప్పొచ్చు. ఒకటి పెదనాన్న బ్యానర్ అయితే మరొకటి కజిన్ బ్యానర్. మరి ఈ రెండు నిర్మాణ సంస్థలు కలిసి ప్రభాస్ సినిమాతో ఎలాంటి హిట్ సాదిస్తాయో చూడాలి.


అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ నెక్ట్స్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను అనిల్ సుంకరతో కలిసి నిర్మించబోతున్నాడు దిల్ రాజు. యాక్షన్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ & ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించనున్నారు. F2 తర్వాత దిల్ రాజు బ్యానర్ కి మరో సినిమా సైన్ చేసాడు అనిల్ రావిపూడి. ఇక మహేష్ కూడా నిర్మాత అనిల్ సుంకర దగ్గర ఓ సినిమా కోసం అడ్వాన్స్ తీసుకున్నాడు. అందుకే ఇద్దరూ అడ్జస్ట్ అయ్యి ఈ సినిమాను కలిసి నిర్మించబోతున్నారు.


ప్రస్తుతం నాగార్జున ‘మన్మధుడు2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను నిర్మాత కిరణ్ తో కలిసి తన సొంత బ్యానర్ మనం ఎంటర్ ప్రైజెస్ లో నిర్మిస్తున్నాడు నాగార్జున. మొన్నటి వరకూ ఈ సినిమాను నాగ్ సోలోగానే నిర్మిస్తాడని అనుకున్నారు కానీ అనుకోకుండా కిరణ్ మరో నిర్మాతగా యాడ్ అయ్యాడు. మరి మన్మధుడు 2 తో  నాగ్-కిరణ్ లు ఏ రేంజ్ హిట్ కొడతారో…చూడాలి.


వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా కోసం మైత్రి మూవీ మూవీ మేకర్స్ తో నిర్మాతగా చేతులు కలిపాడు సుకుమార్. బుచ్చి బాబు డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రూపొందనుంది. కథ బాగా నచ్చడం, సుకుమార్ శిష్యుడి మీదున్న నమ్మకంతో ఈ సినిమాను సుకుమార్ తో కలిసి నిర్మిస్తున్నారు నవీన్ , రవి , మోహన్. ఈ ప్రాజెక్ట్ ఈ రెండు బ్యానర్లకు మంచి పేరు తెచ్చిపెడితే సుకుమార్ , మైత్రి నిర్మాతలు మళ్ళీ వీరు మరో సినిమా కోసం నిర్మాతలుగా కలుస్తారనడంలో సందేహం లేదు.


సుకుమార్ రైటింగ్స్ లో శిష్యుడు కాశి డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మించబోతున్నాడు సుకుమార్. ఈ సినిమా కోసం నిర్మాత శరత్ మరార్ తో చేతులు కలిపాడు సుక్కు. ప్రస్తుతానికి  హీరో హీరోయిన్స్ ని ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నారు.  ప్రస్తుతం ప్రీ    ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సుకుమార్ రైటింగ్స్ & నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై తెరకెక్కనుంది.