Mosagallaku Mosagadu - సూపర్ స్టార్ సాహసానికి 50 ఏళ్లు

Friday,August 27,2021 - 07:54 by Z_CLU

సూపర్ స్టార్ కృష్ణ దైర్య సాహసాలకు పెట్టింది పేరు. హీరోగా, నిర్మాతగా , దర్శకుడిగా ఆయన చేసిన సాహసాలెన్నో . యాబై ఏళ్ల క్రితం ఆయన దైర్య సాహసాలతో నటించి , నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు సినిమా విడుదలై నేటికి 50 ఏళ్ళయింది. 1971 ఆగస్ట్ 27న విడుదలై హిస్టరీలో గొప్ప సినిమాగా నిలిచిపోయిన ఆ సినిమా గురించి జీ సినిమాలు స్పెషల్ స్టోరీ.

Krishna mosagallaku mosagadu movie
1971 లో పద్మాలయా స్టూడియోస్ బేనర్ స్థాపించారు కృష్ణ. తన బేనర్ లో తెరకెక్కే సినిమాలు విభిన్నంగా ఉండాలని ఎవరూ చేయని దైర్య , సాహసాలతో భారీ సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయ్యారు సూపర్ స్టార్. సోదరులు హనుమంత రావు , ఆదిశేషగిరి రావు సహకారం తో భారీ సినిమాలు నిర్మించాలని ఫిక్స్ అయ్యారు కృష్ణ. తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘అగ్ని పరీక్ష’ ఊహించినంత ఆడలేదు.  బేనర్ లో తెరకెక్కే రెండో సినిమా అదిరిపోవాలి. తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి గర్వపడే స్థాయిలో ఉండాలి అనుకున్నారు కృష్ణ.

Krishna mosagallaku mosagadu movie

ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసే కృష్ణ ‘మెకన్నాస్ గోల్డ్’ , ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి హాలీవుడ్ సినిమాలను ఆదర్శంగా తీసుకొని తెలుగులో ఆ తరహా కౌ బాయ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది ? అనుకున్నారు.  వెంటనే ఆ ఆలోచనని సోదరులతో అలాగే మరికొందరితో పంచుకున్నారు. అందరు మంచి ఆలోచన అన్నారు. వెంటనే క్రైం యాక్షన్  కథలు రాయడంలో దిట్టయిన ఆరుద్ర కి విషయం చెప్పి అదిరిపోయే యాక్షన్ తో  కౌ బాయ్ స్క్రిప్ట్ రెడీ చేయమని ఆ బాధ్యత ను అప్పగించారు నట శేఖర.

Krishna mosagallaku mosagadu movie

బ్రిటిష్ , ఫ్రెంచ్ వారు మన దేశంలో అడుగు పెట్టినప్పుడు ఉన్న సంస్థానాల నేపథ్యంతో శాంతి భద్రతల పరిరక్షణ , పగ , ప్రతీకారం, నిధి అన్వేషణ లాంటి అంశాలు జోడించి కథను సిద్దం చేశారు ఆరుద్ర. పూర్తి కథ విన్నాక ఆరుద్ర గారిని మీరే దర్శకత్వం వహించండి అని అడిగారు కృష్ణ. కాని ఆరుద్ర ఒప్పుకోలేదు. అప్పుడు స్క్రిప్ట్ ని దర్శకుడు కే.ఎస్.ఆర్ దాస్ చేతిలో పెట్టారు. కృష్ణ , కె.ఎస్.ఆర్ దాస్ కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా ఇది. ఆయన దర్శకత్వం వహించిన తొలి రంగుల సినిమా కూడా ఇదే.

Krishna mosagallaku mosagadu movie

ముందుగా ఈ సినిమాకు ‘అదృష్ట రేఖ’ అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత దాన్ని ‘మోసగాళ్ళకు మోసగాడు’ గా మార్చారు. సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన తెలుగు చిత్ర నిర్మాణాన్ని మొదటి సారి అవుట్ డోర్ కి తీసుకెళ్ళింది ఈ సినిమానే. ఇందుకోసం రాజస్థాన్ లో థార్ ఎడారి , డాజ్లింగ్ లాంటి ప్రదేశాలను ఎంచుకున్నారు. అక్కడ షూటింగ్ జరుపుకున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. తెలుగు ప్రేక్షకులు అప్పటి వరకు చూడని లోకేషన్స్ ఈ సినిమా ద్వారా చూపించాలనే ఉద్దేశ్యంతో కృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఉత్తరాదిలోని బికినీర్ కోట,శివబాడి కోట , దేవి కుంట సాగర్ ,సిమ్లా లాంటి ఎన్నో లోకేషన్స్ తో పాటు చెన్నై , పాండిచెర్రి లాంటి ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేశారు.

Krishna mosagallaku mosagadu movie

1971 ఫిబ్రవరి ఉత్తరాదిలో చలి భీభత్సంగా ఉన్న సమయంలో కృష్ణ దైర్య సాహసాలతో తన బృందంతో అక్కడ షూట్ చేసుకొచ్చారు. ఆయన దైర్యానికి ఇదొక నిదర్శనం అనుకున్నారు అప్పట్లో. ఆ మంచు ప్రాంతంలో కృష్ణ , విజయ నిర్మలపై ‘కోరినది నేరవేరినది’ అనే సాంగ్ షూట్ చేశారు. ఆ పాటలో బూట్లు లేకుండా డాన్స్ చేయడంతో విజయ నిర్మల గారి కాళ్ళు మొద్దు బారాయి. రక్త ప్రసరణ జరగకపోవడంతో ఆమె కాళ్ళు నీలి రంగులోకి మారాయి. ఓ వారం పట్టింది మళ్ళీ మునుపటిలా అవ్వడానికి. ఇక థార్ ఎడారిలో వారంపైనే షూటింగ్ చేశారు. ఆ ఎడారిలో నీళ్ళు దొరకని ప్రదేశాల్లో యూనిట్ షూట్ చేసుకొచ్చారు. మనుషులు కనిపించని , ఎలాంటి సౌకర్యం లేని ప్రదేశాల్లో షూట్ చేసుకొని రావడం అంటే మాటలు కాదు. కృష్ణ నమ్మిన కథ కోసం యూనిట్ అంతా ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా మేకప్ మెన్ మాధవరావు తన టెక్నిక్ వాడి సినిమాకు పనిచేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  కృష్ణ ని విలన్లు ఎడారిలో వదిలేసి వెళ్ళాక వచ్చే సన్నివేశంలో ఎండ వేడికి హీరో దేహం మాడిపోయినట్లుగా చూపించాలి.  దానికి తగ్గట్టుగా మాధవ్ రావు మేకప్ చేశారు. కృష్ణ మొఖంపై పొక్కులు వచ్చినట్టుగా చూపించడానికి కొంచెం కష్టపడ్డారు. ఆ ప్రదేశంలో అందుబాటులో ఉన్న బాటనీలను తెప్పించి అసిస్టెంట్ తో తొక్కలు తీయించి  వాటిని కృష్ణ మొఖానికి అంటి పెట్టి మేకప్ చేశారు. దాంతో నిజంగానే కృష్ణ మొఖంపై వేడి పొక్కులు వచ్చినట్టుగా కనిపించాయి. ఆ సమయంలో మాధవ రావు ని అందరు అభినందించారు. ఇక కెమెరామెన్ వి.ఆర్,స్వామీ గారి పాత్ర కూడా సక్సెస్ లో కీలకం అని చెప్పొచ్చు. టెక్నాలజీ అందుబాటులో లేని రోజులో కూడా ఆయన వర్క్ తో హాలీవుడ్ స్థాయిలో సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు బ్యాక్ లైట్ లో షూట్ చేశారు. క్లైమాక్స్ లో హీరో కృష్ణ విలన్ కొడితే అతనికి దిమ్మతిరిగి భూమి ఆకాశం తిరిగే షాట్ ని చాలా టెక్నిక్ తో తీశారు. ఓ లారీ టైర్ లో కెమెరా మెన్ ని కూర్చుబెట్టి దాన్ని గిర్రున తిప్పి ఆ ఎఫెక్ట్ తెప్పించారు. ఇలా ఎన్నో టెక్నిక్స్ వాడి స్వామీ తన పనితనం చూపించారు. అలాగే ఆదినారాయణ రావు అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక
రాఘవులు, మాధవ్ స్టంట్స్ , తోట ఆర్ట్ , కోటగిరి గోపాలరావు ఎడిటింగ్ అన్ని సినిమాకి చక్కగా కుదిరాయి.

సినిమాలో గుర్రపు స్వారీ చేసే సన్నివేశాలు ఉండటంతో కృష్ణ షూటింగ్ కి ముందు చెన్నైలో గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేశారు. సాధారణంగా షూటింగ్ లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే గుర్రాలనే వాడతారు. కానీ ఈ సినిమాలో రాజస్థాన్ పోలీస్ ఫోర్స్ కి చెందిన గుర్రాలను వాడి అక్కడ యాక్షన్ సన్నివేశాలు తీశారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్స్ లో జనాలకి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. అప్పటి వరకు ప్రేమకథలు , రివెంజ్ యాక్షన్ డ్రామా, సెంటిమెంట్ కథలతో సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులకు కౌ బాయ్ కథతో హాలీవుడ్ స్టైల్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓ గొప్ప అనుభూతి కలిగించి మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది. అందుకే రిలీజైన రోజు నుండి థియేటర్స్ కి క్యూ కట్టి కృష్ణ దైర్య , సాహసాలను మెచ్చుకొని కాసుల వర్షం కురిపించారు ప్రేక్షకులు.

భారీ తారాగణంతో కేవలం 28 రోజుల్లో రూపొందిన ఈ సినిమాను ముందుగా కొందరు సినీ ప్రముఖులకు చూపించారు కృష్ణ. అందరూ ఈ కొత్త ప్రయత్నం చూసి పెదవి విరిచారు. మన ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు అన్నారు. కానీ ఒక్క ఎన్టీఆర్ మాత్రమే సినిమా విజయం సాధిస్తుంది భయపడకండి అంటూ కృష్ణ కి దైర్యం చెప్పారు. ఎన్నో సందేహాల నడుమ తొలి కౌ బాయ్ సినిమాగా విడుదలైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ విజయం కాదు ఘన విజయం సాధించి సెభాష్ సూపర్ స్టార్ అనిపించేలా చేసింది. ఈ సినిమా ‘ట్రెజర్ హంట్’ టైటిల్ తో ఇంగ్లీష్ లోకి అనువదించబడి హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించింది. అప్పట్లో ఇది ఓ గొప్ప రికార్డు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఓ తెలుగు సినిమా మళ్ళీ అక్కడ డబ్బింగ్ సినిమాగా విడుదలై మంచి వసూళ్ళు అందుకోవడం గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటికి ఈ సినిమా గురించి తలుచుకుంటే ఆ రికార్డునే గర్వంగా చెప్పుకుంటారు కృష్ణ ఫ్యాన్స్.  నిజానికి మోసగాళ్ళకు మోసగాడు కేవలం కొన్ని సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా మాత్రమే దేనికి రీమేక్ కాదు. అందుకే ఈ కథ పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించి ఆకట్టుకుంది. దాదాపు అరవై దేశాల్లో విడుదలై ప్రకంపనలు సృష్టించింది. అన్ని భాషల్లో డబ్బింగ్ కాబడి అందరినీ అలరించిన ఈ సినిమా తెలుగులో చాలా సార్లు రీ రిలీజ్ చేశారు. అలా విడుదల చేసిన ప్రతీ సారి ఊహించని విధంగా మళ్ళీ కలెక్షన్లు తెచ్చి పెట్టాడు ‘మోసగాళ్ళకు మోసగాడు’.

Krishna mosagallaku mosagadu movie

ఈ సినిమాకు సంబంధించి శతదినోత్సవ వేడుకను చెన్నైలోని అశోకా హోటల్ లో నిర్వహించారు. ఆ వేడుకకు శోభన్ బాబు , కృష్ణం రాజు , జగ్గయ్య , అంజలీ దేవి, సావిత్రి , జమున ,కాంచన , గీతాంజలిలతో పాటు మరి కొందరు దర్శక నిర్మాతలు హాజరై కృష్ణ ని ప్రత్యేకంగా అభినందించారు.  సినిమాలో నటించిన నటీ నటులకు , సాంకేతిక నిపుణులకు , డిస్ట్రిబ్యూటర్స్ కి , ఎగ్జిబ్యూటర్స్ కి షీల్డులు, ఉంగరాలు బహుకరించారు.

-రాజేష్ మన్నె

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics