ఆ ఆలోచన విరమించుకున్న మోహన్ బాబు !

Monday,June 15,2020 - 04:03 by Z_CLU

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రోజు ఓ సంచలనం సృష్టించిన తెలుగు సినిమాకు సంబంధించి ఓ ఘనమైన వేడుక జరిగుండేది. పాతికేళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు విడుదలై సంచలన విజయం అందుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆ సినిమానే ‘పెదరాయుడు’. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ద్విపాత్రాభినయంతో స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా నేటికి పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. మోహన్ బాబు హీరోగా ,రజినీ కాంత్ స్పెషల్ రోల్ చేసిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం నమోదు చేసుకొని రికార్డులు తిరగరాసింది.

ఈ ఏడాది ఈ సినిమాకు సంబంధించి పాతికేళ్ళ వేడుకను ఘనంగా నిర్వహించి ప్రేక్షకులతో అప్పటి మధురానుభూతులను పంచుకుందామనుకున్నారు మోహన్ బాబు. ఆ వేడుకకు సినిమాలో నటించిన రజిని కాంత్, భానుప్రియలతో పాటు టీం అందరిని ఆహ్వానించి ఇండస్ట్రీలోని పెద్దల సమక్షంలో ఘనంగా చేద్దామని భావించారు.

కానీ కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం వేడుకలు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిన మోహన్ బాబు… సెలబ్రేట్ చేసుకునే ఓ మంచి అకేషన్ ను మిస్సయ్యానని అన్నారు.