'పద్మశ్రీ' సిరివెన్నెలను అభినందించిన మెగాస్టార్

Tuesday,January 29,2019 - 12:35 by Z_CLU

తన సాహిత్యంతో తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సీతారామశాస్త్రిని ప్రత్యేకంగా అభినందించారు. చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాశారు సిరివెన్నెల. రుద్రవీణ, స్వయంకృషి, రౌడీ అల్లుడు సినిమాలు వాటిలో కొన్ని మాత్రమే.

టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలకు సూపర్ హిట్ సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సందర్భం ఏదైనా సిరివెన్నెల సాహిత్యం దానికి అతికినట్టు సరిపోయేది. విశ్వనాధ్ తీసిన క్లాసిక్ అయినా, వినాయక్ తీసిన కమర్షియల్ సినిమా అయినా సిరివెన్నెల సాహిత్యం ఉండాల్సిందే. కేవలం పాటకు సాహిత్యం అందించడమే కాకుండా, ఆ సాహిత్యంతో శ్రోతను ఆలోచింపజేయడం సిరివెన్నెల కలానికున్న గొప్పదనం.

కెరీర్ లో 11 నంది అవార్డులు అందుకున్న ఏకైక తెలుగు సినీ రచయిత ఈయన. సిరివెన్నెలతో సినీగీత రచయితగా మారిన ఈ సరస్వతీ పుత్రుడు.. మొదటి సినిమాతోనే అందర్నీ ఆకర్షించారు. ఆ సినిమా నుంచి ఈ క్షణం వరకు ఆయన వెనక్కితిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలా తెలుగు సినీచరిత్రలో అత్యుత్తమ గీతరచయితల్లో ఒకరిగా నిలిచారు. ఇక ఇప్పటితరం రచయితల్లో చూసుకుంటే ఎవరైనా సిరివెన్నెల తర్వాతే.

ఒకప్పుడు సింగిల్ కార్డు రచయితగా పేరుతెచ్చుకున్న సీతారామశాస్త్రి ప్రస్తుతం జోరు తగ్గించారు. కానీ ఇప్పటికీ ఏదైనా మంచి సందర్భం ఉందంటే దర్శకులంతా పరుగెత్తుకెళ్లేది సీతారామశాస్త్రి ఇంటికే. ఇలాంటి అత్యుత్తమ రచయితకు పద్మశ్రీ. పురస్కారం కాస్త ఆలస్యంగా వచ్చింది. కానీ ఆలస్యంగానైనా ఆ గుర్తింపు దక్కినందుకు సంతోషం.