ఈ సారైనా వర్కవుట్ అవుతుందా...?

Friday,May 26,2017 - 01:28 by Z_CLU

మెగాస్టార్ 151 వ వెంచర్ ‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి’ ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.  ఇప్పటికే మెగాస్టార్ గెటప్ కోసం కొంతమంది ఆర్టిస్టుల చేత స్కెచ్చులు వేయించే పనిలో ఉంది సినిమా యూనిట్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఉయ్యాల వాడ టీమ్, సినిమాని భారీ హంగులతో  తెరకెక్కించే విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదు.

మరోవైపు ఈ సినిమాకి సంబంధించి తక్కిన కాస్ట్ సెలెక్షన్స్ పై కూడా దృష్టి పెట్టిన సినిమా యూనిట్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ డేట్స్ కోసం కూడా ట్రై చేస్తున్నారన్న టాక్ టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది. మెగాస్టార్ 150 వ సినిమా టైమ్ లోనే ‘బిగ్ బి’ ని సంప్రదించిన సినిమా యూనిట్, డేట్స్ కుదరకపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

 

ఇక ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ ని అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా డిజైన్ చేసుకుంటున్న సినిమా యూనిట్, ఈ సినిమా కోసం ఎలాగైనా ‘బిగ్ బి’ డేట్స్ సంపాదించే ట్రయల్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. చిరు సినిమాల్లో రీ ఎంట్రీ ని ఎక్స్ పెక్ట్ చేసిన వారిలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు చిరు సినిమాలు చేయాల్సిందేనని సభా ముఖంగా అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి బిగ్ బి కూడా చిరు సినిమాలో క్యారెక్టర్ అంటే నో చెప్పే సవాల్ లేదు కానీ… డేట్స్ ఎంతవరకు కుదురుతాయి అన్నదే ఇక్కడ మెగా క్వశ్చన్స్. దీనికి ఆన్సర్ దొరకాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.