బన్నీతో త్వరలోనే సినిమా చేస్తా

Saturday,April 25,2020 - 04:35 by Z_CLU

ఆమధ్య దర్శకుడు మారుతిపై ఓ పుకారు బయల్దేరింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓ కథ రాస్తున్నాడు మారుతి. దీంతో చాలామంది ఆ కథతో బన్నీ హీరోగా మారుతి సినిమా చేయబోతున్నాడంటూ పుకార్లు అల్లేశారు. దీనిపై ఈ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కథ రాస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, ఏ హీరోను సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు.

“నేను కథ రాస్తున్న మాట నిజమే. మరో 10 రోజుల్లో అది పూర్తయిపోతుంది కూడా. కానీ ఇప్పటివరకు ఏ హీరోను సంప్రదించలేదు. నిజానికి ఏదో ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని కథ రాయను. తీరా రాసిన తర్వాత ఆ హీరో బిజీ అయితే వెయిట్ చేస్తూ కూర్చోవాలి. అందుకే కనీసం ముగ్గురు, నలుగురు హీరోలకు సెట్ అయ్యేలా కథ తయారుచేసుకుంటాను. ఏ హీరోకు కథ వినిపించాల్సి వస్తే ఆ హీరోకు తగ్గట్టు చిన్నచిన్న మార్పులు చేస్తాను. మెయిన్ స్టోరీ మాత్రం అలానే ఉంటుంది.”

ఇలా తనపై వచ్చిన పుకారుకు క్లారిటీ ఇచ్చాడు మారుతి. బన్నీతో ఎలాంటి సినిమా చేయాలనే అంశంపై తనకు ఓ ఐడియా ఉందని, కానీ మంచి స్టోరీ మాత్రం దొరకడం లేదంటున్నారు. అయినప్పటికీ త్వరలోనే బన్నీ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ ఇస్తానని కూడా అంటున్నాడు మారుతి. చూస్తుంటే.. తనపై వచ్చిన పుకార్లను ఈ దర్శకుడు నిజం చేసేలా ఉన్నాడు.