మార్చి బాక్సాఫీస్ రివ్యూ

Tuesday,April 07,2020 - 02:01 by Z_CLU

ప్రతి నెలా మార్కెట్లోకి సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. చాలా సినిమాలు ఫ్లాప్ అవుతాయి, ఒకటో రెండో సినిమాలు క్లిక్ అవుతాయి. కానీ మార్చి నెల బాక్సాఫీస్ మాత్రం పూర్తిగా భిన్నం. ఈ నెల బాక్సాఫీస్ పూర్తిగా కరోనాకు అంకితమైంది. మొదటి రెండు వారాలు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వగా.. మూడో వారం నుంచి కరోనా కారణంగా థియేటర్లు బంద్ అవ్వడంతో, బాక్సాఫీస్ క్లోజ్ అయింది.

మొదటి వారంలో అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో చెప్పుకోదగ్గ సినిమాలు రెండు మాత్రమే. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా ఓ పిట్టకథ, రక్షిత్ హీరోగా పలాస సినిమా థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఓ పిట్టకథ ఫ్లాప్ అవ్వగా.. పలాస సినిమా స్పెషల్ మూవీ అనిపించుకుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. రియలిస్టిక్ టేకింగ్స్, ఫ్రేమింగ్స్ ఇష్టపడే వాళ్లకు మాత్రమే ఇది నచ్చింది.

ఈ రెండు సినిమాలతో పాటు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, కాలేజ్ కుమార్, కృష్ణమనోహర్, స్క్రీన్ ప్లే అనే సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. ధన్య బాలకృష్ణ, కోమలి, సిద్ధి ఇద్నానీ లాంటి
హీరోయిన్లతో అడల్ట్ కామెడీతో అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి అనే సినిమాను లాగించేయొచ్చని దర్శకుడు బాలు అడుసుమిల్లి భావించాడు. కానీ అతడి లెక్క తప్పింది. అటు విజయ్ మాస్టర్ కొడుకు
రాహుల్ విజయ్ హీరోగా నటించిన కాలేజ్ కుమార్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వక ఫ్లాప్ అయింది.

ఇక రెండో వారంలో కూడా అరడజను సినిమాలొచ్చాయి. అయితే ఇక్కడ చెప్పుకోడానికి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న మధ సినిమా థియేటర్లలో మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో పాటు వచ్చిన ప్రేమపిపాసి, 302, యురేక, బగ్గిడి గోపాల్ లాంటి సినిమాలన్నీ వేటికవే పత్తాలేకుండా పోయాయి.

మార్చిలో ఇలా 2 వారాలు మాత్రమే సినిమాలు రిలీజయ్యాయి. మూడో వారం నుంచి లాక్ డౌన్ మొదలైంది. కరోనా తన ప్రతాపం చూపించింది. బాక్సాఫీస్ చతికిలపడింది. నిజానికి లాక్ డౌన్ లేకపోతే, పైన చెప్పుకున్న సినిమాల్లో కొన్ని మరికొన్ని రోజులు ఆడేవి. అలా సరైన సక్సెస్ లేక మార్చి నెల బాక్సాఫీస్ బోసిపోయింది.