సత్తా చాటుతున్న సీనియర్ సంగీత దర్శకుడు

Thursday,July 13,2017 - 02:30 by Z_CLU

అప్పట్లో మణిశర్మ మ్యూజిక్ ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అన్నట్టుండేది. అలా తన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెస్మరైజ్ చేసి ఎన్నో సినిమాకు హైలైట్ గా నిలిచిన మణి… ఈ మధ్య కాలంలో కాస్త డల్ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన సత్తా చాటుతున్నాడు.


‘జెంటిల్ మన్’ సినిమాతో  తానేంటో నిరూపించుకున్నాడు మణి. ఇందులో ‘అలజడి’ సాంగ్ తో మెస్మరైజ్ చేసి.. మణి ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు మణి అందించిన రీ-రికార్డింగ్ కూడా చాలా హైలెట్ అయింది.


వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫ్యాషన్ డిజైనర్ (సన్నాఫ్ లేడీస్ టైలర్)’ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా మణి మాత్రం తన మార్క్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మణి అందించిన అన్ని పాటలు ఒకెత్తయితే ‘పాపి కొండల్లో’ అంటూ సాగే పాట మరో ఎత్తు.. ఈ సాంగ్ చార్ట్ బస్టర్స్ లో మోస్ట్ పాపులర్ సాంగ్ గా పేరొందింది. ఫ్యాషన్ డిజైనర్ సినిమాకు రిలీజ్ కు ముందే అంత క్రేజ్ రావడానికి మణిశర్మ సంగీతమే కారణం.


చిన్న సినిమానే అయినప్పటికీ ‘అమీ తుమీ’ని తన మ్యూజిక్ తో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది మాత్రం మణిశర్మే.  థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాలో కామెడీతో పాటు మణి అందించిన మ్యూజిక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.


మణి సంగీతం అందించిన మరో సినిమా ‘శమంతకమణి’. ఈ సినిమాలో ‘పద పద పడి పడి పదా’ అనే సాంగ్ బాగా ఆకట్టుకుంది.  ట్రయిలర్ లో కూడా తన మేజిక్  ఆర్.ఆర్ తో హైలైట్ నిలిచాడు మణి.


ఇక రీసెంట్ గా రిలీజైన ‘లై’ టీజర్ లో నితిన్ స్టైలిష్ మేకోవర్ తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంటుంది మణిశర్మ మ్యూజిక్ గురించే. అంతలా తన రీ రికార్డింగ్ తో హైలెట్ అయ్యాడు మణిశర్మ. ఇక టీజర్ కంటే ముందు రిలీజైన ‘బొంబాట్’ అనే ఫోక్ సాంగ్ తో కూడా  మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం ఈ పాట మారుమోగిపోతోంది. ఇలా వరుస హిట్స్ తో మణిశర్మ మరోసారి స్వింగ్ లోకొచ్చాడు.