మంచు విష్ణు హీరోగా కన్నప్ప

Saturday,February 22,2020 - 12:44 by Z_CLU

దాదాపు 45 ఏళ్ల కిందటొచ్చిన భక్త కన్నప్ప సినిమా తెలుగు సినీచరిత్రలో ఓ ఆణిముత్యం. ఇప్పటికీ టాప్-10 భక్తిరస చిత్రాల్లో ఆ సినిమా ఒకటిగా నిలుస్తుంది. కృష్ణంరాజు నటించిన ఈ సినిమాను మరోసారి సిల్వర్ స్క్రీన్ పై రీ-క్రియేట్ చేయాలని చాలామంది ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు మరోసారి భక్త కన్నప్పపై ప్రకటన వచ్చేసింది.

శివరాత్రి సందర్భంగా భక్త కన్నప్ప ప్రస్తావన తీసుకొచ్చారు సీనియర్ నటుడు మోహన్ బాబు. తన తనయుడు మంచు విష్ణు, కన్నప్ప పేరుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని ప్రకటించారు. దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోందని, 4 ఏళ్ల నుంచి ఈ సినిమా కోసం వర్క్ జరుగుతోందని అంటున్నారు మోహన్ బాబు.

అప్పటి ఎపిక్ మూవీ భక్త కన్నప్ప కు మంచు విష్ణు నటించి-నిర్మించనున్న కన్నప్ప ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం ఉండదని ఎనౌన్స్ చేశారు మోహన్ బాబు. ఇప్పటి జనరేషన్ కు కూడా కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఈ సినిమా రాబోతోందన్నారు. ప్రస్తుతం మంచు విష్ణు లుక్ టెస్ట్ పనిలో ఉన్న విషయాన్ని కూడా బయటపెట్టారు.

భక్త కన్నప్ప ప్రాజెక్ట్ ను మరోసారి తెరపైకి తీసుకురావడానికి కృష్ణంరాజు చాలా ప్రయత్నించారు. ఒక దశలో ప్రభాస్ హీరోగా ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు కూడా. కానీ అది సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు మోహన్ బాబు ఆ కాన్సెప్ట్ ను ప్రకటించారు.