Mahesh POKIRI - రికార్డుల 'పోకిరి'కి 15 ఏళ్ళు

Wednesday,April 28,2021 - 09:25 by Z_CLU

‘ఒక్కడు’ తర్వాత మహేష్ కి వరుసగా క్లాస్ సినిమాలే పడ్డాయి. పైగా అందులో ఒక్కటీ సరిగ్గా ఆడలేదు. ‘అతడు’ కూడా థియేటర్స్ లో అంతంతమాత్రంగానే ఆడింది. సరిగ్గా ఆ టైంలో అభిమానుల మనసులో బాధను పూరి పసిగట్టాడేమో… మహేష్ కోసం ఓ మాస్ కథను రెడీ చేసి సూపర్ స్టార్ ను ‘పోకిరి’గా మార్చాడు. ఇంకేముంది చేతికి కర్చీఫు కట్టుకొని షర్టు మీద షర్టేసి థియేటర్స్ లో దండయాత్ర చేసి బాక్సాఫీస్ ను షేక్ చేసి పడేశాడు పండుగాడు.

2006 ఏప్రిల్ 28…. అప్పటి వరకు ఒక లెక్క అక్కడి నుండి మరో లెక్క. అవును ఇండస్ట్రీకి ఔరా అనిపించేలా 45 కోట్ల షేర్ తో కొత్త లెక్కలు చూపించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘పోకిరి’. మహేష్- పూరి కాంబినేషన్, క్యాచీ మాస్ టైటిల్, మణిశర్మ సాంగ్స్ సినిమాపై రిలీజ్ కి ముందే భారీ అంచనాలు నెలకొల్పాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.


మహేష్ మేకోవర్

అప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఒకే లుక్ మెయింటైన్ చేసాడు ప్రిన్స్. లైట్ హెయిర్, క్లీన్ షేవ్ తో కనిపించేవాడు. కానీ ‘పోకిరి’ కోసం కొత్త లుక్ తో మాస్ గెటప్ ట్రై చేసాడు. హెయిర్ స్టైల్ మారింది. లైట్ గా మీసం, గెడ్డం పెంచాడు. డ్రెస్సింగ్ స్టైల్ లో మార్పొచ్చింది. ఓ జీన్స్ ప్యాంటు, షర్ట్ మీద షర్ట్.. పండు క్యారెక్టర్ కోసం మహేష్ ని కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ లోకి తీసుకొచ్చాడు పూరి.


పూరి జ’గన్’ నుండి వచ్చిన బుల్లెట్ లాంటి డైలాగ్స్

“ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండు గాడు” ఈ డైలాగ్ ఇప్పటికీ చిన్న పిల్లలు చెప్తుంటే ముచ్చటేస్తుంది.. అవును పిల్లలకి సైతం పోకిరి డైలాగుల్ని నరనరాలకి ఎక్కించేశాడు పూరి.

‘ఒక్కసారి కమిటయితే నా మాట నేనే వినను’ ,”ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా”, “సినిమాలు చూట్లేదేంటి..?” ఇలా మహేష్ చెప్పిన డైలాగ్స్ అన్ని థియేటర్స్ లో బాగా పేలాయి.

పూరి స్టైల్ ఆఫ్ మేకింగ్ తో పాటు మణిశర్మ మ్యూజిక్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. మణి అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం సన్నివేశాలను ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ సినిమా కోసం కృష్ణ సినిమాలోని అలనాటి ‘గలగల పారుతున్న గోదారిలా’ పాటను రీమిక్స్ చేశారు. ఆ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. అలాగే “ఇప్పటికింకా నా వయసు నిండా 16” ఐటమ్ సాంగ్ కొన్నేళ్ల పాటు మోత మోగిపోయింది. మిగతా పాటలూ ఆకట్టుకున్నాయి. శ్యామ్ కే.నాయుడు విజువల్స్ కూడా సినిమాను మరో మెట్టిక్కించింది. ‘జగడమే’ పాటకు మాత్రం గుహన్ కెమెరామెన్ గా పనిచేసారు.


‘పోకిరి’ హైలైట్స్

మహేష్ నటన తర్వాత ఇలియానా గ్లామర్ కూడా సినిమాకు ఎడ్వాంటేజ్. ముఖ్యంగా సాంగ్స్ లో రెచ్చిపోయి కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తూ మెస్మరైజ్ చేసింది ఇల్లి బేబీ. ఇక ప్రకాష్ రాజ్ విలనిజం , సాయాజీ షిండే, ఆశీష్ విద్యార్ధి క్యారెక్టర్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఇక బ్రహ్మీ-అలీ కామెడీ ట్రాక్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది.


లిఫ్ట్ సీన్ : ఓ సందర్భంలో మహేష్, ఇలియానా లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం ఆ సందర్భంలో వారిద్దరి మధ్య వచ్చే కన్వర్జేషన్, వారిని ఎలాగైనా బయటకి తీసుకురావాలని చూసే బ్రహ్మీ కామెడీ భలే క్లిక్ అయింది. అందుకే ఈ సీన్ కి పేరడీలు కూడా వచ్చాయి.

ఖైరతాబాద్ హీరో : ఓ సందర్భంలో లోకల్ ట్రైన్ లో వచ్చే ఫైట్ కి ముందు …మహేష్ ను చూస్తూ ఇలియానాతో ఈడేనా..ఖైరతాబాద్ హీరో అంటారు రౌడీ గ్యాంగ్ లో ఒకడు. అక్కడ మణిశర్మ నేపథ్య సంగీతం విజయన్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ పోకిరి హైలైట్స్ లో ఒకటి.

ఇంటర్వెల్ బ్లాక్ : గోల్కొండలో ఫైట్.. అటు మహేష్ పరిగెడుతూ ఒక్కొక్కడ్ని కొడుతుంటే ఇలియానా వెనకే వెళ్తూ భయంతో మహేష్ ను చూస్తుంటుంది. ఇంటర్వెల్ కి ముందొచ్చే ఆ ఫైట్ తో పాటు మహేష్ -ఇలియానా మధ్య సంభాషణ, ఆ తర్వాత ‘బట్ ఐ లవ్ యూ’ అంటూ పడే ఇంటర్వెల్ బ్లాక్ కూడా సినిమాకి హైలైట్.

దిమ్మతిరిగే ట్విస్టు : సిటీలో మర్డర్లు, రౌడీ గ్యాంగుల్ని పట్టుకోవాలని చూసే పోలీసులు, హీరో కూడా రౌడీ గ్యాంగ్ లో చేరి రౌడీ అనిపించుకోవడం.. అసలేంటిది..? పూరి ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు..? అనుకున్న ప్రేక్షకులకు క్లైమాక్స్ కి ముందు మహేష్ ను కృష్ణ మనోహర్ IPS అంటూ నాజర్ పాత్రతో చెప్పిస్తూ దిమ్మతిరిగే ట్విస్టు తో మైండ్ బ్లాక్ చేసాడు పూరి. అవును పూరి రాసుకున్న ఈ ట్విస్టుతో ‘పోకిరి’ ప్రేక్షకులకి విపరీతంగా కనెక్ట్ అయిపోయాడు. హీరో పోకిరి కాదు పోలీస్ అంటూ పూరి సిల్వర్ స్క్రీన్ మీద చెప్పిన విధానానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో బెస్ట్ ట్విస్టుల గురించి మాట్లాడుకుంటే అందులో ‘పోకిరి’ క్రిష్ణమనోహర్ IPS ట్విస్టు గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే.


మేన్ బిహైండ్ ‘పోకిరి’

పోకిరి విజయం వెనుక పూరి ఎన్నో రాత్రులు కష్టముంది. అవును ‘బద్రి’ కంటే ముందే రాసుకున్న కథ కావడంతో స్క్రిప్ట్ కి కొత్త హంగులు దిద్దటంలో పూరి రాత్రి పగలు తేడా లేకుండా వర్క్ చేసాడు. ముఖ్యంగా మాస్ కి నచ్చేలా తన మార్క్ సన్నివేశాలు, డైలాగ్స్ కోసం బాగా శ్రద్ధ పెట్టాడు.


రికార్డులు :

‘ఒక్కడు’తో మహేష్ స్టామినా చూసిన డిస్ట్రిబ్యూటర్లు , అనుభవమున్న బడా నిర్మాతలు ‘పోకిరి’ కూడా బాగానే ఆడుతుందనుకున్నారు. కానీ రికార్డులన్నీ తుడిచిపెట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అవుతుందని మాత్రం ఊహించలేకపోయారు.

75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ‘పోకిరి’ ది ఓ అరుదైన రికార్డు. చేతికి కర్చీఫు కట్టి పండుగాడు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తే రికార్డులు ముక్కలు, ముక్కలుగా ఎగిరిపడ్డాయి. ఓ మూడేళ్లు పట్టింది ఆ రికార్డుల్ని టచ్ చేయడానికి. 299 సెంటర్స్ లో 50 రోజులాడిన ఈ సినిమా, 200 సెంటర్స్ లో 100 డేస్ దాటింది. అప్పటి వరకు ఐమ్యాక్స్ లో రోజుకు 4 ఆటలతో 100 రోజులాడిన సినిమా లేదు. ఆ ఘనత ‘పోకిరి’కే దక్కింది. 63 కేంద్రాల్లో 175 రోజులు పూర్తిచేసుకుంది. కర్నూల్ లో 500 రోజులు ప్రదర్శించబడింది.

‘పోకిరి’ రికార్డులే కాదు అవార్డులు కూడా దక్కించుకుంది. సినిమాకు నాలుగు నంది అవార్డులతో పాటు రెండు ఫిలిం ఫేర్ అవార్డులొచ్చాయి.

ఇందిరా ప్రొడక్షన్స్, వైష్ణో అకాడమీ బ్యానర్స్ పై 10 కోట్ల బడ్జెట్ తో పూరి, మంజుల కలిసి నిర్మించిన ‘పోకిరి’ 45 కోట్ల షేర్ సాధించి 70 కోట్ల గ్రాస్ తో రికార్డులు తిరగరాసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది. అందుకే ట్రెండ్ సెట్టర్, గేమ్ చేంజర్ లాంటి పదాలు ‘పోకిరి’ టైటిల్ ముందుచేరాయి.

‘పోకిరి’ను తమిళంలో విజయ్‌ హీరోగా ‘పోక్కిరి’ టైటిల్ తో ప్రభుదేవా రీమేక్ చేశాడు. అదే ప్రభుదేవా హిందీలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘వాంటెడ్’ అనే టైటిల్ రీమేక్ చేసాడు. కన్నడంలో దర్శన్ ‘పొర్కి 2010’, బెంగాలీలో షకిబ్ ఖాన్ ‘రాజోట్టో- 2014’ చేశారు. రీమేక్ అయిన అన్ని భాషల్లో పోకిరి దిమ్మతిరిగే వసూళ్లు రాబట్టి సూపర్ డూపర్ హిట్ అనిపించుకుంది.


మహేష్ కంటే ముందు….

ఈ సినిమాను ముందుగా రవితేజతో ‘ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ’ అనే టైటిల్ తో తీద్దామనుకున్నాడు పూరి. కానీ చివరికి కథ మహేష్ దగ్గరికి చేరింది. మహేష్ సీనులోకి ఎంటరయ్యాక కథలో కొన్ని మార్పులతో టైటిల్ ‘పోకిరి’గా మారింది.

-రాజేష్ మన్నె

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics