మహేష్-దేవిశ్రీ.. సూపర్ హిట్ కాంబినేషన్

Tuesday,August 15,2017 - 12:10 by Z_CLU

పోకిరి, అర్జున్, మురారి, అతడు, ఖలేజా… మహేష్-మణిశర్మ కాంబినేషన్ చెబితే ఇలా చాలా సినిమాలు గుర్తొస్తాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమాలో పాటలు సూపర్ హిట్. మహేష్ కెరీర్ లో అత్యథిక సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరక్టర్ గా మణిశర్మ రికార్డు సృష్టించాడు. అంతేకాదు, మహేష్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కూడా మణిశర్మే.

ఇప్పుడా స్థానాన్ని దేవిశ్రీ దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అవును.. ఈమధ్య కాలంలో రాక్ స్టార్ కే ఎక్కువగా అవకాశాలిస్తున్నాడు మహేష్. ‘1 నేనొక్కడినే’ సినిమాతో మొదలైన ఈ కాంబినేషన్ ఆ తర్వాత శ్రీమంతుడుతో మరోసారి రిపీటైంది. ఈ రెండు సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన DSPకి లేటెస్ట్ గా మరో రెండు సినిమాలతో ఛాన్స్ ఇచ్చాడు సూపర్ స్టార్.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘భరత్ అనే నేను’ సినిమాకు దేవిశ్రీనే సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీతో పాటు తాజాగా ప్రారంభమైన వంశీ పైడిపల్లి-మహేష్ సినిమాకు కూడా బాణీలు అందించబోతున్నాడు. సో.. ఇప్పటికే తన ఖాతాలో మహేష్ కు సంబంధించి 4 సినిమాలు దక్కించుకున్నాడు దేవి. ఇదే ఊపులో త్వరలోనే మణిశర్మను క్రాస్ చేస్తాడేమో.