రూ.1000 కోట్లతో మహాభారతం

Monday,April 17,2017 - 08:21 by Z_CLU

మహాభారతం ప్రాజెక్టు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు రాాజమౌళి. జక్కన్న ఈ ప్రాజెక్టును డీల్ చేస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఇప్పట్లో అది సాధ్యంకాదని ఈమధ్యే రాజమౌళి ప్రకటించాడు. ఇప్పుడీ ప్రాజెక్టు మరోసారి తెరపైకొచ్చింది. భారతీయ సినీచరిత్రలోనే అతిపెద్ద భారీ బడ్జెట్ చిత్రంగా, దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో మహాభారతం వెండితెరపైకి రాాబోతోంది.

ప్రస్తుతం ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 2.0 మాత్రమే. ఈ సినిమా రికార్డుల్ని కొల్లగొట్టడానికి “ది మహాభారత” ప్రాజెక్టు రెడీ అవుతోంది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత MT వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. సుమారు రూ. 1000 కోట్లతో నిర్మించనున్న ఈ సినిమాకు ‘ది మహాభారత’ అనే పేరును ఫిక్స్ చేశారు.

ప్రముఖ వ్యాపారవేత్త బి. ఆర్.షెట్టి ఈ సినిమాను నిర్మించనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన కోటీశ్వరుడు ఈయన. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నారు. మోహన్ లాల్ ను భీష్ముడి పాత్ర కోసం అనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా మోహన్ లాల్ స్వయంగా వెల్లడించారు.

దర్శకుడు శ్రీకుమార్ మీనన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి, 2020లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు ఇలా ఫైనలైజ్ అయింది.