బాలీవుడ్ లెజెండ్ ఇక లేరు

Wednesday,July 07,2021 - 11:04 by Z_CLU

బాలీవుడ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఎవరు? ఇండియన్ సినిమా అంటే అంతా బాలీవుడ్ వైపు చూస్తున్నారంటే దానికి పునాది ఏది? ఇప్పుడంతా గొప్పగా చెప్పుకుంటున్న మెథడ్ యాక్టింగ్ కు ఆద్యుడు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. దిలీప్ కుమార్.

dilip kumar

బాలీవుడ్ కు ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు తీసుకొచ్చిన లెజెండ్స్ లో దిలీప్ కుమార్ ఒకరు. ఎన్నో క్లాసిక్స్ లో నటించారు దిలీప్ కుమార్. ప్రపంచం మెచ్చిన మొఘల్-ఇ-ఆజమ్ సినిమా ఈయనదే. దీంతో పాటు గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, నయా దౌర్, మధుమతి, క్రాంతి, విధాత, శక్తి లాంటి ఎన్నో క్లాసిక్స్ లో నటించారు దిలీప్ సాహెబ్. ఈయన నటించిన ఆజాద్ సినిమా అప్పట్లో వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది.

dilip kumar

1922 డిసెంబర్‌ 11న పాక్‌లోని పెషావర్‌లో జన్మించారు దిలీప్ కుమార్. ఈయన అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు.

dilip kumar

1944లో విడుదలైన ‘జ్వర్‌ భాతా’ చిత్రంతో మొదటిసారి ఆయన నటుడిగా వెండితెరపై మెరిశారు. సుమారు 65 సినిమాల్లో నటించిన దిలీప్‌కుమార్‌ ఉత్తమ నటుడిగా ఎన్నో ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం 1994లో సినీరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డుతో, ఆ తర్వాత పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది.

dilip kumar

దశాబ్దాల పాటు చిత్రరంగాన్ని ఏలిన దిలీప్ కుమార్ ఈరోజు ఉదయం ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics