అదిరిపోయే కామెడీకి 33 ఏళ్లు

Wednesday,December 04,2019 - 03:21 by Z_CLU

ఈరోజు మన జమ జచ్చ 33వ పుట్టిన రోజు. ఈ లేడీస్ టైలర్ వల్లే స్రవంతి మూవీస్ లాంటి గొప్ప సంస్థ పుట్టింది. వంశీ కి, రాజేంద్ర ప్రసాద్ కి, తనికెళ్ళ భరణి కి గొప్ప బ్రేక్ వచ్చింది. ఇళయరాజా మ్యూజిక్ అదరగొట్టింది. 29 రోజుల షూటింగ్ ..26 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఎప్పటికీ సుందరం.. సుమధురం.

ఇప్పుడీ సినిమాను అంతా క్లాసిక్ అంటున్నారు. కానీ విడుదలైన కొత్తలో, 80’ల్లో ఈ సినిమాను అడల్ట్ మూవీగా చూసిన వాళ్లున్నారు. అప్పటికే పరిశ్రమలో పెద్దలుగా పేరున్న కొందరు ఈ సినిమాను విమర్శించారు కూడా. అలా ఎన్నో విమర్శల మధ్య వచ్చిన ఈ సినిమా అప్పట్లో కామెడీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

వంశీ తీసిన మొదటి సినిమాలో (మంచుపల్లకి) రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఈ సినిమాలో కూడా రాజేంద్రప్రసాద్ ఉన్నారు. కోరి రాజేంద్రప్రసాద్ ను తీసుకోవడానికి వంశీ దగ్గర ఓ మంచి కారణం ఉంది. అమాయకంగా కనిపిస్తూనే కామెడీ పండిస్తారట రాజేంద్రప్రసాద్. అందుకే ఈ సినిమా ఆఫర్ రాజేంద్రుడ్ని వరించింది.

ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో సాంగ్స్ అన్నీ ఎవర్ గ్రీన్. ఇళయరాజా కంపోజ్ చేసిన ఈ పాటలు 33 ఏళ్లయినా ఇప్పటికీ ఏదోమూల వినిపిస్తూనే ఉంటాయి. అన్నట్టు ఈ సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిసిస్ట్. అప్పటికే సిరివెన్నెలతో చాలా గౌరవం, గుర్తింపు తెచ్చుకున్న సీతారామశాస్త్రి.. కమర్షియల్ పాటలు రాయలేడనే రిమార్క్ ను ఈ సినిమాతోనే చెరిపేసుకున్నారు.