55 ఏళ్ల ప్రస్థానం.. సూపర్ స్టార్ ప్రయాణం

Tuesday,March 31,2020 - 04:18 by Z_CLU

ఓ సూపర్ స్టార్ తెలుగుతెరకు పరిచయమైన రోజు ఈరోజు. అవును.. సరిగ్గా 55 ఏళ్ల కిందట ఇదే రోజు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పరిచయమైన తేనె మనసులు సినిమా థియేటర్లలోకి వచ్చింది.

కృష్ణను హీరోగా పరిచయం చేసిన సినిమా ‘తేనె మనసులు’. నిజానికి ఈ సినిమాలో కృష్ణ కంటే ఇంకో హీరోగా నటించిన రామ్మోహన్‌కే ప్రాధాన్యం ఎక్కువ. అయినప్పటికీ చురుకుదనం, అందంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కృష్ణ ఆ సినిమా పునాదిగా సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగారు.

అప్పటివరకు ఫ్యాన్స్ లో ఆడ-మగ అనే తేడా ఉండేది కాదు. ఎందుకంటే ఎన్టీఆర్-ఏఎన్నార్ జమానా అలాంటిది. కానీ కృష్ణ వచ్చిన తర్వాత ఫిమేల్ ఫ్యానిజం మొదలైంది. ఆ హైట్, ఆ లుక్స్, ఆ స్మైల్ కు
అప్పట్లో అమ్మాయిలు ఫిదా అయ్యారు. కృష్ణను ప్రత్యేకంగా ఆరాధించడం మొదలుపెట్టారు.

అలా ఫిమేల్ ఫాలోయింగ్ తో కెరీర్ మొదలుపెట్టిన కృష్ణ, తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆదరణతో అందరివాడయ్యారు. ఎన్టీఆర్ తర్వాత మాస్‌లో అమితమైన ఫాలోయింగ్ ఉన్న నటునిగా పేరు తెచ్చుకున్నారు.

ఇక తేనెమనసులు విషయానికొస్తే.. ప్రీ-ప్రొడక్షన్ లో ఈ సినిమా స్క్రిప్ట్ చూసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.. ఈ కథకు కొత్తవాళ్లు కరెక్ట్ గా సరిపోతారని నిర్ణయించారు. అలా నెలరోజుల్లో చిట్టిబాబు పాత్రకు రామ్మోహన్, సీత పాత్రకు సంధ్యారాణి, బసవరాజు పాత్రకు కృష్ణ, భానుమతి పాత్రకు సుకన్య లను ఎంపికచేశారు దర్శకుడు.

సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యాక, అప్పుడే కొత్తగా కలర్ వచ్చింది. దాంతో కలర్ లో తీయాలని నిర్ణయించారు. అప్పటివరకు బ్లాక్ అండ్ వైట్లో తీసినదంతా పక్కనపెట్టేశారు. మళ్ళీ మొదటినుంచీ కలర్లో షూటింగ్ చేయడం ప్రారంభించి, చివరకు కలర్ చిత్రంగానే పూర్తిచేశారు. అలా తెలుగులో తొలి కలర్ చిత్రంగా నిలిచింది తేనె మనసులు.

రిలీజైన తర్వాత సినిమా సూపర్ హిట్టయింది. ఈ మూవీ నుంచే టైటిల్ లో మనసులు అనే పదం ఉంటే సినిమా హిట్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. (దీనికంటే ముందు మూగ మనసులు వచ్చింది.) ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో అది నిజమైంది కూడా.