''ముందడుగు'' వేసి 36 ఏళ్లయింది

Monday,February 25,2019 - 04:17 by Z_CLU

మల్టీస్టారర్స్ గురించి ఇప్పుడు కూడా మనం గొప్పగా చెప్పుకుంటాం. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే టాలీవుడ్ లో అదో గొప్ప. అలాంటిది 36 ఏళ్ల కిందటే మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు మల్టీస్టారర్ తీశారు. అదే ముందడుగు. అప్పటికే మంచి స్వింగ్ లో ఉన్న శోభన్ బాబు, కృష్ణను హీరోలుగా పెట్టి రామానాయుడు తీసిన ముందడుగు సినిమా విడుదలైన ఇవాళ్టికి (ఫిబ్రవరి 25) సరిగ్గా 36 ఏళ్లయింది.

దేవత సినిమాతో మంచి లాభాలు ఆర్జించారు రామానాయుడు. ఆ వెంటనే ఈ మల్టీస్టారర్ మూవీ ప్రకటించారు. దీంతో అంతా రామానాయుడిపై కామెంట్స్ చేశారు. సంపాదించినదంతా పోగొట్టుకోవడానికే ఇలా మల్టీస్టారర్ తీస్తున్నారని విమర్శించారు. కానీ రామానాయుడు వెనక్కితగ్గలేదు. హిట్ కొట్టి చూపించారు. ఆయన తెగువకు మరో బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది ముందడుగు.

ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కు సురేష్ ప్రొడక్షన్స్ లో బ్యానర్ లో తొలి సినిమా ఇదే. ఆ సినిమాకు కథ రాయడంతో పాటు సంభాషణలు కూడా అందించారు. ఇద్దరు హీరోలకు ఎక్కడా ప్రాధాన్యం తగ్గకుండా రాసిన మాటలు, సన్నివేశాలు.. పరుచూరి బ్రదర్స్ కు మంచి పేరుతీసుకొచ్చింది.

బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అఖండ విజయం అందుకుంది. చెన్నైలోని తాజ్ కోరమండల్ హోటల్ లో ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్ని నిర్వహించారు. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాల్ని సీనియారిటీ ప్రకారం తన సిబ్బందికి పంచారు రామానాయుడు. లాభాల్ని ఇలా స్టాఫ్ కు ఇచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టించారు రామానాయుడు