క్రాంతి మాధవ్ ఇంటర్వ్యూ

Thursday,September 07,2017 - 06:11 by Z_CLU

‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి ఫీల్ గుడ్ సినిమాలతో దర్శకుడిగా తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న క్రాంతి మాధవ్ ప్రస్తుతం సునీల్ తో ‘ఉంగరాల రాంబాబు’ అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రాంతి మాధవ్ మీడియాతో ముచ్చటించాడు ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.

 

పది సినిమాలు.. పది రకాలు.

రెండు ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీస్ తర్వాత కామెడీ ఎంటర్టైనర్ సెలెక్ట్ చేసుకోవడానికి పెద్దగా రీజన్ ఏం లేదు.. దర్శకుడిగా నేను ఓ పది సినిమాలు చేస్తే ఆ పది సినిమాలు ఒక్కో జోనర్ లో ప్రతీ సినిమాకు ఎంతో కొంత వ్యత్యాసం ఉండాలనుకుంటాను. అందుకే ఓ పల్లెటూరి ఫామిలీ ఎమోషన్ కథతో ‘ఓనమాలు’ తెరకెక్కించి, ఎమోషనల్ లవ్ స్టోరీతో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా రూపొందించాను.. ఇప్పుడు కామెడీ జోనర్ లో ఈ సినిమా చేశా.

 

స్వార్ధపరుడి కథతో…

‘ఉంగరాల రాంబాబు’ సినిమా విషయానికొస్తే ఎంత వచ్చినా ఇంకా కావాలనుకునే ఓ స్వార్ధపరుడి కథతో తెరకెక్కిన సినిమా ఇది. స్వార్ధపరుడి క్యారెక్టర్ లో సునీల్ పరకాయ ప్రవేశం చేసినట్టుగా సినిమా ఆధ్యంతం సరదాగా అందరూ మెచ్చే విధంగా ఉంటుంది.

 

‘ఓనమాలు’తో కష్టం చూశా

ఓనమాలు సినిమాకు దర్శకుడిగా కంటే నిర్మాతగానే ఎక్కువ కష్టపడ్డాను. నిర్మాతగా నష్టపోయినప్పటికీ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించానని సంతృప్తి ఉంది.


నవ్వించడమే లక్ష్యం

నిజానికి తనకున్న సమస్యలతో బాధపడుతూ ఏదో ఎంటర్టైన్ అవ్వాలని థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులను నవ్వించడం చాలా కష్టం. దర్శకుడికి అది పెద్ద సాహసమే. ఈ సినిమా చూసి అందరూ నవ్వుకుంటూ ఎంటర్టైన్ అవ్వాలన్న ఆలోచనతో ఈ కథ రాసుకున్నా. బాధలతో థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడమే ఈ సినిమా లక్ష్యం.

 

ఇష్టమైన జోనర్

దర్శకుడిగా అలాగే ఓ సాధారణ ప్రేక్షకుడిగా నాకు బాగా నచ్చిన జోనర్ హాస్యం. అందుకే ఈ సినిమాతో సునీల్ క్యారెక్టర్ తో వీలైనంత నవ్వించాలనుకున్నాను. సునీల్ క్యారెక్టర్ చాలా కామెడీ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ పడే ఇబ్బందులు తన స్వార్ధంతో చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి.

 

ఇందులో ఓ సందేశం ఉంటుంది

నేను దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లో ఏదో ఓ చిన్న పాటి సందేశం ఉంటుంది. కానీ కచ్చితంగా ఏదో ఓ సందేశం ఇవ్వాలనే ఉద్ధ్యేశ్యంతో సినిమా తీయను. ఇక ఈ సినిమాలో కూడా ఓ చిన్నపాటి సందేశం ఉంటుంది. నేను అనుకోవడం వల్ల కేవలం నువ్వు గానే మిగిలిపోతావ్ అదే మేము అనుకుంటే ఆ ఆనందం వేరేలా ఉంటుంది అనే చిన్న పాయింట్ చుట్టూ ఎంటర్టైన్ మెంట్ తో అల్లిన కథే ఈ సినిమా.

సునీల్ అదరగొట్టేస్తాడు

ఈ కథ రాసుకున్నప్పుడే ఈ క్యారెక్టర్ సునీల్ చేస్తేనే బాగుంటుందని అనుకున్నా.. అనుకున్నట్టే సునీల్ ఉంగరాల రాంబాబు క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించాడు. తన ఆటిట్యూడ్, కామెడీ టైమింగ్ క్యారెక్టర్ ప్లస్ అయ్యాయి. రేపు థియేటర్స్ లో సునీల్ అదరగొట్టేస్తాడనే నమ్మకం ఉంది.

 

‘ఓనమాలు’ నిరాశ పరిచింది.. ‘మళ్ళీ మళ్ళీ’ ఉత్సాహాన్నిచ్చింది

దర్శకుడిగా ఓనమాలు నిరాశ పరిచింది..ఆ సినిమాకు సరైన థియేటర్స్ కూడా లభించలేదు. ఆ సినిమాతో నిర్మతగా చాలా డబ్బు కోల్పోయాను. ఆ నిరాశతో ఉన్న నాలో మళ్ళీ ఉత్సాహం నింపింది ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’.. ఇప్పుడు ‘ఉంగరాల రాంబాబు’ కూడా దర్శకుడిగా నన్ను మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని అనుకుంటున్నా.

 

నాది ముసలి తత్వం..

ఒక్కో జెనెరేషన్ ని ఒక్కో తత్వంతో పోలుస్తుంటారు కదా.. నేను చూడటానికి మిడిల్ ఏజ్ అయినప్పటికీ నాది కొంచెం ముసలి తత్వమే.. నా ఆలోచనలు నా రచన ఆ స్టైల్ లో ఉంటాయి. ఆ తత్వం నా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

 

‘విజయ్ దేవరకొండ’తో నెక్స్ట్ సినిమా

ప్రస్తుతం దర్శకుడిగా నాలుగో సినిమాకు స్క్రిప్ట్ రెడీ అవుతుంది. దేవర కొండ హీరోగా కె.ఎస్.రామారావు నిర్మాణంలో ఆ సినిమా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.