మాధవన్ కోసమే నిర్మాతగా మారాను

Thursday,April 02,2020 - 11:44 by Z_CLU

గతంలో ఓసారి మాధవన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించాడు కోన వెంకట్. ఆ సినిమాతోనే అతడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా ఒకటుందనే విషయం, దాని పేరేంటనే విషయం కూడా చాలామందికి తెలీదు. ఎందుకంటే అది ఆగిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు నిశ్శబ్దం సినిమా కోసం మాధవన్ తో పనిపడింది కోన వెంకట్ కు.

గతంలో సినిమా ఆగిపోవడంతో ఈసారి మాధవన్ కు నమ్మకం కుదరలేదు. ఈ సినిమాకు కూడా నిర్మాత పారిపోతాడేమో అని అనుమానం వ్యక్తంచేశాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో, మాధవన్ కు నమ్మకం కలిగించేందుకు తను కూడా నిర్మాతగా మారాల్సి వచ్చిందని స్పష్టంచేశాడు కోన వెంకట్. పీపుల్ మీడియా బ్యానర్ తో కలిసి తను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశానని చెప్పుకొచ్చాడు.

నిశ్శబ్దం సినిమాకు అన్నీ తానై వ్యవహరించానంటున్నాడు కోన. ఆ సినిమా కథ హేమంత్ దే అయినప్పటికీ.. దానికి అతడే దర్శకుడు అయినప్పటికీ… తన ప్రమేయం చాలా ఎక్కువంటున్నాడు. ప్రాజెక్టులోకి అనుష్క, మాధవన్ రావడానికి తనే కారణమని.. ఇక అంజలి, షాలిని ని కూడా తనే సంప్రదించానన్నాడు.

మరోవైపు శ్రీనువైట్లతో వివాదంపై కూడా స్పందించాడు. తామిద్దరి మధ్య పగలు-ప్రతీకారాలు లేవని.. కేవలం తన పనిని శ్రీనువైట్ల గుర్తించకపోవడం వల్లనే బయటకు వచ్చేశానని, అన్నీ అనుకూలిస్తే మళ్లీ అతడితో కలిసి వర్క్ చేస్తానని అంటున్నాడు కోన.