'కిషోర్ తిరుమల' ఇంటర్వ్యూ

Friday,October 20,2017 - 02:09 by Z_CLU

ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది ఉన్నది ఒక్కటే జిందగీ. సూపర్ హిట్ కాంబినేషన్ రామ్-కిషోర్ తిరుమల కలిసి చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. హై ఎమోషన్స్ బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. లేటెస్ట్ గా ఈ  మూవీ హైలెట్స్ ను మీడియాతో పంచుకున్నాడు.

ప్రతి పాత్ర పాజిటివ్ గా ఉంటుంది

ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో ముఖ్యంగా లవ్, ఫ్రెండ్ షిప్ యాంగిల్స్ ను టచ్ చేశాను. ప్రతి ఒక్కరు ఈ సినిమాను తమ జీవితంలో అన్వయించుకుంటారు. ఎవరికైనా ఒకే లైఫ్ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ గా ఉండాలని చెప్పాను. ఈ సినిమాలో ప్రతి పాత్ర పాజిటివ్ గా ఉంటుంది. కేవలం సిచ్యుయేషన్స్ మాత్రమే నెగెటివ్ గా ఉంటాయి. రియల్ లైఫ్ లో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు ఇందులో కనిపిస్తాయి. ప్రతి ఎమోషన్ ఇందులో ఉంటుంది.

నిజంగానే రాక్ స్టార్ అనిపిస్తాడు

రామ్ పాత్రను ఎంతో ఇష్టపడి డిజైన్ చేశాను. మరీ ముఖ్యంగా దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఆ పాత్రను చూసి నేర్చుకోవాలి. చాలా మెచ్యూర్డ్ అండ్ సింపుల్ పాత్ర. రామ్ ఇందులో రాక్ స్టార్ గా కనిపిస్తాడు.  ఏదో నటించాలి అన్నట్టు కాకుండా.. కాస్త ఫీల్ రావడం కోసం రామ్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. గిటార్ ను ఎలా వాడాలో 2 నెలల పాటు ట్రయినింగ్ తీసుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో రామ్ నిజంగానే రాక్ స్టార్ లా కనిపిస్తాడు. దానికి కారణం ఆ ట్రయినింగ్.

పైకి సింపుల్ గా కనిపిస్తాడు కానీ…

సినిమాలో హీరోకు ఫ్రెండ్ షిప్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అన్ని విషయాల్ని సింపుల్ గా తీసుకున్నట్టు పైకి కనిపిస్తారు. కానీ వాళ్లు తీసుకునే డెసిషన్స్ వెనక చాలా రీజన్స్ ఉంటాయి. అలాంటి పాత్రలో రామ్ కనిపిస్తాడు. పైకి నవ్వుతూ సింపుల్ గా ఉంటాడు, కానీ హీరోలో చాలా డెప్త్ ఉంటుంది. ఈ కథను ఏడాదిన్నర కిందటే అనుకున్నాను.హిందీలో వచ్చిన హృతిక్ సినిమాకు మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం జిందగీ అనే పదం మాత్రం కామన్ గా ఉంది.

శ్రీవిష్ణు సెలక్షన్ వెనక రీజన్..

ఈ సినిమాలో రామ్ కు బెస్ట్ ఫ్రెండ్ శ్రీవిష్ణు. అతడి పాత్రను ఎక్కడా తగ్గించి చూపించలేదు. కీలకమైన పాత్ర కోసం శ్రీవిష్ణును తీసుకోవడానికి ప్రత్యేకమైన రీజన్ ఉంది. సినిమాలో అభిరామ్ ఫ్రెండ్ క్యారెక్టర్ పేరు వాసు. ఈ పాత్ర చాలా సింపుల్ గా, సాఫ్ట్ గా ఉండే వ్యక్తి కావాలి. విష్ణు ఫేస్ లో నాకు ఆ ఛాయలు కనిపించాయి. పైగా విష్ణు నాకు నాలుగేళ్లుగా తెలుసు. అతడైతే సరిగ్గా సరిపోతాడని భావించి తీసుకున్నాను.

కథకు వైజాగ్ కు లింక్ ఉంది

వైజాగ్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి కథకు ఓ సంబంధం ఉంది. చైల్డ్ ఎపిసోడ్ అరకులో నడుస్తుంది. అందుకే వైజాగ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. సముద్రం యాంబియన్స్ నచ్చుతాయి నాకు. అంతే తప్ప నేను శైలజ హిట్ అయిందని మరోసారి వైజాగ్ రాలేదు. కథకు వైజాగ్ కు లింక్ ఉంది కాబట్టే వచ్చాను. రామ్ హైపర్ షూటింగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ వెళ్లి కథ చెప్పాను. అప్పట్నుంచి ఈ సినిమాపై వర్క్ చేస్తూనే ఉన్నాను.

ఈ మూవీకి దేవిశ్రీ చాలా అవసరం

దేవిశ్రీప్రసాద్ తో మరోసారి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను శైలజ సినిమాకు ఆడియో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. నేను శైలజ కంటే మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. అందుకే దేవిశ్రీని మరోసారి తీసుకున్నాం.

వివిధ దశల్లో స్నేహం

సినిమాలో స్నేహితుల మధ్య బంధాన్ని 3 దశల్లో చూపించాం. చిన్నప్పుడు ఎలా ఉండేవారు. కాలేజ్ లైఫ్ లో ఎలా ఎంజాయ్ చేశారు.. కాలేజ్ తర్వాత వాళ్ల ఫ్రెండ్ షిప్ ఎలా ఉంది లాంటి ఎలిమెంట్స్ ను ఇందులో టట్ చేశాం. ఇక హీరోయిన్ల విషయానికొస్తే అనుపమ చేసిన మహ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. బయటకొచ్చిన తర్వాత అందరికీ గుర్తుండేది ఆ పాత్రే. లావణ్యది ఎంటర్ టైనింగ్ పాత్ర. సినిమాలో ఏ పాత్రలో నెగెటివ్ ఛాయలుండవు.

వెంకటేష్ తో సినిమా ఆగిపోలేదు

వెంకీతో చేయాల్సిన కథపై ఇంకొంచెం వర్కవుట్ చేయాల్సి ఉంది. వెంకటేష్ తో సినిమా కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఫోకస్ మొత్తం ఉన్నది ఒక్కటే జందగీ పైనే ఉంది. ఇది రిలీజ్ అయిన తర్వాత ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందనే విషయంపై ఆలోచిస్తాం. అది వెంకటేష్ సినిమానా కాదా అనేది ఇప్పుడే చెప్పలేను. వెంకటేష్ కు గతంలో కథ చెప్పిన మాట వాస్తవం. కానీ నాకే సంతృప్తి కలగలేదు. ఇంకా బాగా డెవలప్ చేయాలనిపించి టైం తీసుకున్నాను.

అప్ కమింగ్ ప్రాజెక్టులు

ప్రస్తుతానికి 3 కథలున్నాయి. అన్నీ ప్రాధమిక దశలోనే ఉన్నాయి. అన్నీ డెవలప్ చేయాలి. ఏది టేకప్ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నాని, వెంకటేష్ కు కథలు అనుకున్నాను. నాని కోసం అనుకున్న కథను ఇంకా పూర్తిస్థాయిలో డెవలప్ చేయలేదు. నితిన్ కూడా ఓ కథకు ఓకే చెప్పాడు. కానీ స్క్రిప్ట్ డెవలప్ కాలేదు. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ విడుదలైన తర్వాత ఏ హీరోతో సినిమా ఉంటుందో చెబుతాను.