'కిర్రాక్ పార్టీ' డైరెక్టర్ 'శరణ్' ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Thursday,March 08,2018 - 05:30 by Z_CLU

ఈ ఏడాది మొదటి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న దర్శకుల లెక్క చాలానే ఉంది. అందులో శరణ్ కొప్పిశెట్టి ఒకరు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘కిర్రాక్ పార్టీ’ తో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. శరణ్ కొప్పిశెట్టితో జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

 

వాళ్ళతో పరిచయం

మాది యానాం.. పుట్టి పెరిగింది అక్కడే. కాలేజ్ లో ఉన్నప్పట్నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది. ఇంజినీరింగ్ పూర్తి చేసి పరిశ్రమలో అడుగుపెట్టాను. అలా హైదరాబాద్ వచ్చి మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. అక్కడ కొంతమంది పరిచయమయ్యారు. అలా ఓ వ్యక్తి ద్వారా నిఖిల్ ‘వీడు తేడా’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరాను. అక్కడే సుధీర్ వర్మ పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత ‘స్వామి రారా’ సినిమాకు సుధీర్ వర్మ దగ్గర పనిచేశాను. ఆ తర్వాత చందు మొండేటి దగ్గర కార్తీకేయ సినిమాకు పనిచేశాను. ఆ సినిమాతో చందూతో సాన్నిహిత్యం కుదిరింది. తర్వాత ‘ప్రేమమ్’ సినిమాకు రచయితగా చీఫ్ అసోసియేట్ గా పనిచేశాను. మా ఇద్దరిదీ ఒకే విధమైన ఆలోచన కావడంతో మరింత క్లోజ్ అయ్యాం.

అనుకోకుండా దర్శకుడినయ్యా…

‘ప్రేమమ్’ సినిమా తర్వాత దర్శకుడిగా పరిచయం అవ్వడానికి కొన్ని కథలు సిద్దం చేసుకున్నాను. నిర్మాతలతో పాటు కొందరు హీరోలకి కూడా స్టోరీలు వినిపించాను. కాని ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కాస్త టైం పట్టడంతో అప్పుడే నిఖిల్ కిరాక్ పార్టీ  చేస్తున్నాం’ అని చెప్పాడు… సినిమాకు రచయితగా పనిచేయమని అడిగాడు. అలా రచయితగా వెళ్లి అనుకోకుండా దర్శకుడినయిపోయాను. నిఖిల్ అలాగే నిర్మాత అనిల్ గారు నన్ను నమ్మి ఈ సినిమా అప్పగించారు.

సెట్లో అందరూ జడ్జులే

కిరిక్ పార్టీ కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా.. నిజానికి రీమేక్ అనేది కత్తి మీద సాములాంటి పని. దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏం చేసినా రిస్కే.. ఒరిజినల్ తో పోలిస్తే ఏవైనా మార్పులు చేసినా… మెయిన్ సోల్ మిస్ చేసినా ప్రేక్షకులు తిట్టుకుంటారు. పైగా రీమేక్ అంటే సెట్లో ప్రతీ ఒక్కరూ జడ్జ్ చేసే వాళ్ళే. అక్కడ అలా ఉంటే ఇక్కడ ఇలా తీస్తున్నారా…? వర్కౌట్ అవుద్దా..అనుకుంటుంటారు. అవన్నీ దాటి డైరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓ రీమేక్ సినిమా స్టార్ట్ అవుతుందని తెలియగానే ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. అందుకే ఒరిజినల్ సినిమాలోని ఫ్లేవర్ పోకుండా చాలా జాగ్రత్త గా సినిమాను తెరకెక్కించాం.


వాళ్ళిద్దరి సపోర్ట్ తోనే

నిజానికి పరిశ్రమలో నేనీ స్థాయికి రావడానికి ముఖ్య కారణం సుధీర్ వర్మ, చందు మొండేటి. వాళ్ళ సపోర్ట్ తోనే దర్శకుడిగా మారాను. వారిద్దరి ప్రోత్సాహం ఎప్పటికీ మరవలేను. ఇప్పటివరకూ ఏ దర్శకులు చేయనిది కేవలం నాకోసం చేశారు. వాళ్ళు అనుకుంటే ఈ సినిమాను డైరెక్ట్ చేయడం చాలా ఈజీ. కాని నన్ను దర్శకుడిగా చూడాలన్న ఉద్దేశ్యంతోనే సినిమాకు కేవలం రచయితలుగా పనిచేశారు. సుధీర్ స్క్రీన్ ప్లే – చందూ మాటలు సినిమాకు మెయిన్ హైలైట్స్ గా నిలుస్తాయి.

నిఖిల్ తో అప్పటి నుంచే

నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన మొదటి సినిమా ‘వీడు తేడా’ అప్పటి నుంచే నిఖిల్ తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆ సినిమా తర్వాత కంటిన్యూ గా నిఖిల్ తో ట్రావెల్ అయ్యాను. ఆ మధ్య స్టోరీ రెడీ చేసుకో సినిమా చేద్దాం అన్నాడు. కానీ అనుకోకుండా ఇద్దరం కలిసి ఈ సినిమా చేశాం. దర్శకుడిగా ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం నిఖిలే. నా మొదటి సినిమాను నిఖిల్ తో చేయడం హ్యాపీ. చాలా కంఫర్టబుల్ హీరో.. డైరెక్టర్ కి ఏం కావాలో అది చేసే హీరోలు తక్కువగా ఉంటారు అందులో నిఖిల్ ఒకడు.

అందరూ కొత్త వాళ్ళే

ఈ సినిమాలో ఓ నలుగురు తప్ప అందరూ కొత్త వాళ్ళే.. తన ఫ్రెండ్స్ గా నటించిన కొత్తవారితో నిఖిల్ సినిమాకి ముందు చాలా క్లోజ్ అయ్యాడు. సినిమా స్టార్ట్ చేయకముందే వాళ్ళ మధ్య మంచి స్నేహం కుదిరింది. అందుకే సినిమాలో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

శివ సినిమా స్పూర్తితో …

నిజానికి కాలేజ్ గొడవలు అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా శివ.. అదొక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా చేసే ముందు శివ సినిమాతో కొంత స్పూర్తి పొంది కొన్ని షాట్స్ తెరకెక్కించాను. టీజర్ లో ఉన్నషట్టర్ లేపే షాట్…లాంటివి కొన్ని వర్మ గారి నుంచి స్పూర్తి పొంది తీసినవే.

సుకుమార్ గారే ఆదర్శం

పరిశ్రమకి రావడానికి డైరెక్షన్ సైడ్ వెళ్ళడానికి సుకుమార్ గారే నాకు ఆదర్శం.. నేను కాలేజ్ చదువుతుండగా ఆర్య సినిమా వచ్చింది. నిజానికి ఆర్య సినిమాతో లవ్ స్టోరీస్ ఇలా కూడా తీయొచ్చని ట్రెండ్ సెట్ చేశారు సుకుమార్. ఆ మధ్య ఓ సందర్భంలో రంగస్థలం షూటింగ్ కెళ్ళి ఆయన్ని కలిశాను. ఆయనే నాకు స్ఫూర్తి.

 

వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు

సినిమాల్లోకి రాకముందు మా బ్రదర్ నన్ను బాగా సపోర్ట్ చేసేవాడు. అలాగే గణేష్ అనే నా శ్రేయోభిలాషి కచ్చితంగా నువ్వు ఒక మంచి దర్శకుడు అవుతావు అంటూ ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తుండే వాడు. ఈ సందర్భంగా మా అమ్మనాన్నకు నా థాంక్స్. వాళ్ళందరి సపోర్ట్ తోనే ఈరోజు దర్శకుడినయ్యాను.

రష్మిక… అనుకున్నాం కాని

సినిమాలో సిమ్రాన్ చేసిన రోల్ కి ముందుగా ఒరిజినల్ సినిమాలో నటించిన రష్మికనే సంప్రదించాం. కాని అప్పటికే తెలుగులో సినిమాలు కమిట్ అవ్వడం..పైగా తనకి రీమేక్ సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే ఆ క్యారెక్టర్ కి సిమ్రాన్ ను ఫైనల్ చేసాం. నిజానికి ఆ క్యారెక్టర్ ఇప్పటివరకూ పరిచయం లేని అమ్మాయి అయితేనే బాగుంటుందని ఫీలయ్యాం. సిమ్రాన్ ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది.

మైండ్ లో ఆ అమ్మాయే

ఇక సంయుక్త క్యారెక్టర్ కూడా ఎవరైనా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నాం. కాని ఆ క్యారెక్టర్ సంయుక్త తప్ప ఇంకెవరూ చేసిన వర్కౌట్ అవ్వదని మళ్ళీ సంయుక్త నే తీసుకున్నాం. ఆ క్యారెక్టర్ సంబంధించి మైండ్ లో అందరికీ ఆ అమ్మాయే ఉండేది.


ఆ అనుభవం కలిసొచ్చింది

నిజానికి కొన్ని సార్లు మనకి తెలియకుండానే మనం చేసిన కొన్ని పనులు బాగా కలిసొస్తాయి. అలా ఈ సినిమాకు ‘ప్రేమమ్’ సినిమాకు పనిచేసిన ఎక్స్ పీరియన్స్ బాగా కలిసొచ్చింది. ఆ అనుభవంతోనే ఈ రీమేక్ సినిమాను బాగా డీల్ చేశానని అనుకుంటున్నా.

మార్పులు చేశాం

ఒరిజినల్ సినిమా దాదాపు మూడు గంటల నిడివి ఉంటుంది… ఈ సినిమాకొచ్చే సరికి అందులో కాస్త బోర్ అనిపించే సీన్స్ ను తొలగించి మన తెలుగుకి తగ్గుట్టుగా కాస్త మార్చాం. మొత్తానికి ఓ 20 నిముషాలు ట్రిమ్ చేశాం. ఆ మార్పుల వల్ల తెలుగులో బాగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉంది.

అన్నీ కలిసొచ్చాయి

ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక థియేటర్స్ లో సినిమాలు బంద్ అని విన్నాం.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాం కదా అప్పటి వరకూ ఫినిష్ అవుతుందా..? లేదా అనుకున్నాం. కాని అది క్లియర్ అవ్వడమే కాదు. దగ్గరలో మరో సినిమా లేకపోవడం పైగా సమ్మర్ సీజన్ ఈ సినిమాతోనే స్టార్ట్ అవ్వడం స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ కూడా అయిపోవడం అన్నీ అలా కలిసొచ్చాయి.

కాన్ఫిడెంట్ గా ఉన్నాం

కన్నడలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. మన తెలుగులో కూడా అంతటి హిట్ సాదిస్తుందని నమ్ముతున్నాం. ఫైనల్ అవుట్ పుట్ చూసి అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా స్టూడెంట్స్ మళ్ళీ మళ్ళీ చూసేలా ఈ సినిమా ఉంటుంది.