అభిమానుల గుండెల్లో ఖైదీ..

Tuesday,September 20,2016 - 01:23 by Z_CLU

 కొందరికి కొన్ని టైటిల్స్ అలా ఫిక్స్ అయిపోతాయంతే. ఏ ముహూర్తాన సినిమా మొదలుపెడతారో తెలీదు కానీ… మొత్తం కెరీర్ కే అవి బెంచ్ మార్క్ గా నిలిచిపోతాయి. ఖైదీ టైటిల్ కూడా అలాంటిదే. మెగాస్టార్ చిరంజీవి సినీజీవితాన్ని, ఖైదీ అనే టైటిల్ ను విడదీసి చూడలేం. ఈ టైటిల్ తో అభిమానుల గుండెల్లో ఖైదీగా నిలిచిపోయారు అన్నయ్య చిరంజీవి. ఇదే టైటిల్ తో అందరివాడు అనిపించుకున్నారు. చివరికి తన ప్రతిష్టాత్మక 150వ సినిమాకు కూడా ఖైదీ అనే టైటిల్ పెట్టారంటే… అన్నయ్య కెరీర్ తో ఖైదీ అనే టైటిల్ ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థంచేసుకోవచ్చు.

khadi-still-1

1983 నుంచి ఖైదీ ప్రస్థానం ప్రారంభమైంది. అవును… అదే ఏడాది చిరంజీవి ఖైదీగా మారారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరు చేసిన ఖైదీ సినిమా ఓ చిన్న వర్షంలా ప్రారంభమై… తర్వాత సునామీలా బాక్సాఫీస్ మొత్తాన్ని ఆక్రమించేసింది. కేవలం 40 రోజుల్లో పూర్తిచేసిన ఈ సినిమా విడుదలైన 10 ఏళ్ల వరకు ఏదో ఒక రూపంలో వసూళ్ల వర్షం కురిపించిందంటే ఖైదీ సృష్టించిన సంచలనాన్ని అర్థంచేసుకోవచ్చు. విడుదలైన 5 ఏళ్ల తర్వాత కూడా.. 1988లో మరోసారి ఖైదీని థియేటర్లలోకి తీసుకొస్తే… అప్పట్లోనే 20 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. దటీజ్ ఖైదీ.

khaidhi-no-786-still-2

     చిరంజీవికి ఖైదీ ఇచ్చిన ఉత్సాహం, ఊపు సాధారణమైంది కాదు. ఇప్పటికీ తన కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఖైదీని ఒకటిగా చెబుతున్నారంటే… చిరంజీవి మనసులో ఆ సినిమా స్థానం ఏంటో ఊహించుకోవచ్చు. చిరంజీవికి ఈ టైటిల్ ఇంత బలంగా నాటుకుపోవడానికి మరో రీజన్ ఉంది. ఖైదీ విడుదలైన ఐదేళ్ల తర్వాత ఖైదీ నంబర్ 786 పేరుతో మరో సినిమా చేశారు చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో వందో సినిమాగా వచ్చిన ఈ సినిమా.. తెలుగుతెరపై మరో ప్రభంజనం. చిరు స్టార్ ఇమేజ్ ను మరింత పైకి తీసుకెళ్లింది ఖైదీ నంబర్-786

khaidi-no-150-first-lookఓవైపు కెరీర్ టర్నింగ్ పాయింట్ ఖైదీ. మరోవైపు కెరీర్ లో సెంచరీ మూవీ ఖైదీ నంబర్-786. అందుకే తన 150వ సినిమాకు కూడా ఖైదీ అనే పేరు కలిసొచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశారు మెగాస్టార్. వీవీ వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఖైదీ నంబర్-150 అనే పేరుపెట్టారు. గత నెలలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాతో మరోసారి అభిమానుల గుండెల్లో ఖైదీ అయిపోవాలని చిరంజీవి భావిస్తున్నారు. తాజా ఖైదీ మరిన్ని రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అంటున్నారు మెగా ఫ్యాన్స్.