పాన్ ఇండియా చిత్రంగా క‌ర‌ణం మల్లేశ్వరి బ‌యోపిక్‌

Monday,June 01,2020 - 12:56 by Z_CLU

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌లు స‌హా ప‌లు రంగాల్లో అత్యున్న‌త సేవ‌లు అందించిన ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు వెండితెర‌పై ఆవిష్కత‌మ‌వుతున్నాయి. మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 2000లో జ‌రిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించ‌డ‌మే కాకుండా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్క‌రించ‌నున్నారు.

ఎంతో మంది మ‌హిళ‌ల‌కు స్ఫూర్తినిచ్చిన క‌ర‌ణం మల్లేశ్వరి బ‌యోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్‌.సి బ్యాన‌ర్స్‌పై ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన‌వెంక‌ట్ నిర్మిస్తున్న ఈ బ‌యోపిక్‌ను సంజ‌నా రెడ్డి డైరక్ట్ చేయనున్నారు. కోన‌వెంక‌ట్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్రకటిస్తారు.