సంక్రాంతి బరిలో మరో సినిమా

Monday,August 19,2019 - 05:04 by Z_CLU

ఈసారి సంక్రాంతికి బాలయ్య సినిమా లేని లోటును అబ్బాయ్ కల్యాణ్ రామ్ తీరుస్తున్నాడు. అవును.. సంక్రాంతికి కల్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా రిలీజ్ అవుతోంది. అలా నందమూరి సంక్రాంతి సంప్రదాయాన్ని ఈసారి కల్యాణ్ రామ్ కొనసాగిస్తున్నాడన్నమాట.

సతీష్ వేగేశ్న ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఇతడికి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఈ దర్శకుడు తీసిన శతమానంభవతి సంక్రాంతి బరిలో సూపర్ హిట్ అయింది. అందుకే ఎంతమంచివాడవురా సినిమాను కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. 118 లాంటి సక్సెస్ తర్వాత కల్యాణ్ రామ్ చేస్తున్న మూవీ కావడంతో మూవీపై అంచనాలున్నాయి.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈనెల 26 నుంచి తణుకు, రాజమండ్రిలో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ లో హైదరాబాద్ లో ఓ షెడ్యూల్, నవంబర్ లో చిక్ మంగళూరులో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంక్రాంతికి ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురంలో సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ఇప్పుడు కల్యాణ్ రామ్ కూడా ఈ రేసులోకి చేరాడన్నమాట.