K Viswanath - కళాతపస్వి కన్నుమూత

Friday,February 03,2023 - 07:36 by Z_CLU

తెలుగుతెరకు ఎన్నో అపురూప చిత్రాల్ని అందించిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ కన్నుమూశారు. వయసురీత్యా వచ్చిన సమస్యలతో నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. విశ్వనాధ్ వయసు 92 సంవత్సరాలు.

5 దశాబ్దాల పాటు తెలుగుచిత్ర సీమలో కొనసాగిన విశ్వనాధ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగుచలన చిత్ర రంగంలో ఇప్పటివరకు వేలకొద్దీ సినిమాలొచ్చాయి. కానీ వాటిలో టాప్-10 సినిమాలు తీస్తే ఇప్పటికీ, ఎప్పటికీ అందులో నిలిచేవి కె.విశ్వనాధ్ చిత్రాలే.

శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణకమలం, స్వాతికిరణం, శుభసంకల్పం.. ఇలా ఆణిముత్యాల్లాంటి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు విశ్వనాధ్. మాస్-కమర్షియల్ దారిలో పరుగులుపెడుతున్న తెలుగు సినిమాను, సంప్రదాయాలు, సంస్కృతివైపు లాక్కొచ్చి ఆయన తీసిన చిత్రాలు చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. కమర్షియల్ హంగులకు దూరంగా కథలు సెలక్ట్ చేసుకోవడమే కాకుండా.. వాటితో కూడా హిట్స్ కొట్టిన కె.విశ్వనాధ్ గొప్పదనం గురించి చెప్పడానికి మాటలు చాలవు. పేజీలు సరిపోవు.

కాశీనాథుని విశ్వనాథ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద పులివర్రు గ్రామం. ఆయన 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ప్లస్ టూ చదువుకున్నారు. ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు.

తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్‌లో పని చేసేవారు. విశ్వనాథ్ కూడా డిగ్రీ పూర్తయ్యాక అదే స్టూడియోలో ఉద్యోగంలో చేరారు. ఆ స్టూడియోలో తొలుత సౌండ్ రికార్డిస్ట్‌గా విశ్వనాథ్ సినిమా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా చేరారు.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఆత్మ గౌరవం’ సినిమాతో విశ్వనాథ్ దర్శకుడయ్యారు. 1965లో విడుదలైన ఆ సినిమాకు ఉత్తమ సినిమా విభాగంలో నంది బహుమతి లభించింది.

కమల్ హాసన్ ది బెస్ట్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆయనకు సాగరసంగమం, స్వాతిముత్యం సినిమాలే ఇష్టం. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టినప్పటికీ ఆయనకు స్వయంకృషి, ఆపద్భాంధవుడు సినిమాలంటే ఇష్టం. వెంకటేష్ ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకున్నప్పటికీ ఆయనకు స్వర్ణకమలం అంటే ప్రాణం. ఇవన్నీ విశ్వనాధ్ సినిమాలే.

దర్శకులందరిదీ ఒక దారి, విశ్వనాధ్ ఒక్కరిది ఒక దారి. ఆయన సినిమాల్లో కళాత్మకత, తెలుగుదనం, సంస్కృతి-సంప్రదాయాలు కనిపిస్తాయి. ప్రజలకు వాటి గొప్పదనం చెప్పలేనప్పుడు సినిమాలు తీయడం ఎందుకని ప్రశ్నిస్తారాయన. కెరీర్ చివరి చిత్రం వరకు దానికే కట్టుబడి సినిమాలు తీశారు. అందుకే  కళాతపస్వి అయ్యారు.

k viswanath

టాలీవుడ్ లోకి ఎంతోమంది దర్శకులు వస్తుంటారు. కానీ కె.విశ్వనాధ్ లాంటి దర్శకుడు మళ్లీ దొరకరు. బహుశా, అలాంటి దర్శకుడు ఇక పుట్టడేమో. కళాతపస్వికి జీ సినిమాలు ఘన నివాళులు.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, gossip, Actress Photos and Special topics