కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూ

Friday,August 09,2019 - 05:54 by Z_CLU

ఇటివలే ‘సీత’గా ప్రేక్షకులను పలకరించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు ‘రణరంగం’తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయింది. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 15 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా బ్యూటిఫుల్ కాజల్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు కాజల్ మాటల్లోనే…

మూడో సారి డాక్టర్ గా

‘రణరంగం’ లో నేను డాక్టర్ గా కనిపిస్తాను. డాక్టర్ క్యారెక్టర్ చేయడం ఇది మూడో సారి. సినిమా సెకండ్ హాఫ్ లో నా క్యారెక్టర్ వస్తుంది.  క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ కథలో కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్ తోనే కథ ముందుకు సాగుతుంది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పార్ట్ అయినందుకు హ్యాపీ

‘రణరంగం’ నా సినిమా కాదు. ఇది కంప్లీట్ గా శర్వా సినిమా. రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో తను మెస్మరైజ్ చేస్తాడు. నా క్యారెక్టర్ మీద ఎలాంటి అంచనాలు పెంచుకోకుండా వస్తే ఆడియన్స్ హ్యాపీ గా ఫీలవుతారు. ఒక మంచి సినిమాలో నేను కూడా పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.


చాలా రోజుల తర్వాత

చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా ఓ ఫాస్ట్ నంబర్ కి డాన్స్ చేసాను. పిక్చర్ పర్ఫెక్ట్ సాంగ్ తో ఈ మధ్య డాన్స్ చేయట్లేదనే బాధ తగ్గిపోయింది. సినిమాలో కచ్చితంగా ఆ సాంగ్ కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

సక్సెస్ నా చేతిలో లేదు

‘సీత’ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. ఆ క్యారెక్టర్ కోసం ఎంతో కృషి చేసాను. సినిమా హిట్టవ్వడం…ఫ్లాపవ్వడం అనేది నా చేతిలో ఉండదు కదా.  సినిమా చేసేసాక మిగతావి పట్టించుకోను. ‘సీత’ గా నా పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. అది హ్యాపీ. బట్ సినిమా హిట్టయితే ఇంకా హ్యాపీ గా ఫీలయ్యే దాన్ని.

సమస్యే లేదు

‘ఇండియన్ 2’ సినిమా నుండి నేను తప్పుకున్నానని వస్తున్న వార్తలో నిజం లేదు. ఆ సినిమా నుండి బయటికొచ్చే సమస్యే లేదు. అది శంకర్ గారి సినిమా అలా ఎలా వదులుకుంటాను. నవంబర్ నుండి షూట్ మొదలవుతుంది. ఆ సినిమా నాకో పెద్ద అవకాశం.

ఏం చెప్పలేను

‘ఇండియన్ 2’ లో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లుక్ , పెర్ఫార్మెన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. నన్ను నమ్మండి ఆ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇంతకంటే ఆ సినిమా గురించి ఇప్పుడేం ఏం చెప్పలేను.

ఇప్పటికీ బిగినర్నే

హీరోయిన్ గా 50 సినిమాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటికీ ఒక బిగినర్ గా ఫీలవుతుంటాను. ప్రతీ సినిమా మొదటి సినిమాగానే భావిస్తాను. అదే నా కెరీర్ సక్సెస్ కి రీజన్ అనుకుంటున్నా. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలన్నది నా ఉద్దేశ్యం. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. ప్రతీ సినిమా నుండి ఏదో విషయం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను.

తమిళ్ లో ప్రాబ్లం

‘పారీస్ పారీస్’ సినిమా రిలీజ్ కి సెన్సార్ ప్రాబ్లం ఉంది. మూడు భాషల్లో లేని అభ్యంతరం తమిళ్ వర్షన్ కి వచ్చింది. ప్రస్తుతం ప్రొడక్షన్ హౌజ్ ఆ విషయంపై మాట్లాడుతున్నారు. త్వరలోనే ఆ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది.

డిస్కర్షన్స్ జరుగుతున్నాయి

ప్రశాంత్ వర్మతో ఓ సినిమాకు సంబంధించి డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను నా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాను. ప్రశాంత్ కూడా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే మా కాంబినేషన్ లో సినిమా ఉంటుంది.

టైం పడుతుంది

నిర్మాతగా చేయబోయే సినిమాకు ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతం నా ఫోకస్ అంతా నటిస్తున్న సినిమాల మీదే. అవన్నీ అయ్యాక మంచి కాన్సెప్ట్ తో నిర్మాతగా మారతాను.

నన్నెవరూ సంప్రదించలేదు

చిరు సార్ సినిమా కోసం నన్ను ఇంకా ఎవరూ సంప్రదించలేదు. ఒక వేళ అడిగితే మాత్రం వెంటనే చేస్తానని చెప్పేస్తా. ఆయనతో నటించే అవకాశం మళ్ళీ వస్తే అస్సలు వదులుకోను.