జ్యోతిలక్ష్మి ఇకలేరు...

Tuesday,August 09,2016 - 11:09 by Z_CLU

 

1970-80ల్లో కుర్రకారును ఓ ఊపుఊపిన జ్యోతిలక్ష్మి ఇక లేరు. అనారోగ్యంతో చెన్నైలో ఆమె నివాసంలో ఈరోజు ఉదయం జ్యోతిలక్ష్మి కన్నుమూశారు. 5 భాషల్లో 3వందలకు పైగా చిత్రాల్లో నటించిన జ్యోతిలక్ష్మి… హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా… ఐటెం డాన్సర్ గా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. కానీ తెరపై ఎన్ని పాత్రలు పోషించినా ది బెస్ట్ డాన్సర్ గానే జ్యోతిలక్ష్మి అందరికీ గుర్తు.

అప్పటికే అక్క జయమాలిని పరిశ్రమలో తిరుగులేని డాన్సర్ గా పేరుతెచ్చుకుంది. ఆమె అడుగుజాడల్లో 1960ల్లో సినిమాల్లోకి ఎంటరయ్యారు జ్యోతిలక్ష్మి. అతితక్కువ కాలంలోనే జయమాలినిని మరిపించారు. ఎంత కష్టమైన డాన్స్ మూమెంట్ అయినా సింగిల్ టేక్ లో ఓకే చేసేయడం జ్యోతిలక్ష్మి స్పెషాలిటీ. ఒక దశలో జ్యోతిలక్ష్మితో డాన్స్ చేయడానికి అలనాటి హీరోలంతా భయపడ్డారంటే ఆమె డాన్సింగ్ టాలెంట్ ను అర్థం చేసుకోవచ్చు.

పెద్దక్కయ్య అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు జ్యోతిలక్ష్మి. 1973లో శోభన్ బాబు నటించిన ఇదా లోకం సినిమా.. జ్యోతిలక్ష్మి కెరీర్ లో టర్నింగ్ పాయింట్. అందులో గుడి ఎనక నాసామి పాట జ్యోతిలక్ష్మిని ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. 90ల్లో జ్యోతిలక్ష్మి పేరిట చాలా పాటలు తెరకెక్కాయి. జ్యోతిలక్ష్మి చీరకట్టింది అనే పాట ఇందులో ఒకటి. ఇటీవల చార్మి-పూరి కాంబినేషన్ లో జ్యోతిలక్ష్మి అనే సినిమా కూడా తెరకెక్కింది. తెలుగులో కుబేరులు ఆమె ఆఖరి చిత్రం.