టాలీవుడ్: జూన్ బాక్సాఫీస్ రివ్యూ

Monday,July 02,2018 - 01:14 by Z_CLU

జూన్ లో టాలీవుడ్ మిక్స్ డ్ రిజల్ట్ చూసింది. ఓవైపు సమ్మర్ హాలిడేస్ పూర్తవ్వడం, మరోవైపు స్కూల్స్ స్టార్ట్ అవ్వడంతో పెద్ద సినిమాలేవీ రాలేదు. దీంతో బాక్సాఫీస్ బోసిపోయింది. జూన్ లో మొత్తంగా 15 స్ట్రయిట్ సినిమాలు రిలీజ్ అయితే.. వాటిలో ఒక్కటే హిట్ అయింది. మరో 2 సినిమాలు ఫర్వాలేదనిపించుకున్నాయి.

జూన్ 1న అభిమన్యుడు, ఆఫీసర్, రాజుగాడు, బెస్ట్ లవర్స్ లాంటి సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఆఫీసర్, రాజుగాడు సినిమాలు డిసప్పాయింట్ చేయగా.. డబ్బింగ్ మూవీగా వచ్చిన అభిమన్యుడు మాత్రం ఆకట్టుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ పై మరోసారి తన పట్టు నిలుపుకున్నాడు విశాల్.

ఇక ఫస్ట్ వీక్ లో ఒక్క స్ట్రయిట్ మూవీ కూడా రిలీజ్ కాలేదు. అంతా కాలాకు దారిచ్చారు. అలా సోలోగా వచ్చిన రజనీకాంత్ ఆకట్టుకోలేకపోయాడు.

జూన్ రెండో వారంలో నా నువ్వే, సమ్మోహనం, దేశముదుర్స్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కల్యాణ్ రామ్ నటించిన నా నువ్వే సినిమా ఫ్లాప్ అవ్వగా, సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సూపర్ హిట్ అయింది. ఈ రెండు మూవీస్ తో పాటు వచ్చిన దేశముదుర్స్ ఫ్లాప్ అయింది.

ఇక జూన్ మూడో వారంలో జంబలకిడిపంబ, దమ్ముంటే సొమ్మేరా, టిక్ టిక్ టిక్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో దమ్ముంటే సొమ్మేరా, టిక్ టిక్ టిక్ డబ్బింగ్ సినిమాలు. స్ట్రయిట్ రిలీజ్ గా వచ్చిన జంబలకిడిపంబ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా, అలనాటి సూపర్ హిట్ మూవీ జంబలకిడిపంబను మరోసారి గుర్తుకుతెచ్చింది.

ఇక జూన్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ, లాస్ట్ వీక్ లో ఏకంగా 10 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది సినిమా మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అల్లు శిరీష్ నటించిన యుద్ధభూమి, షకలక శంకర్ హీరోగా చేసిన శంభోశంకర సినిమాలతో పాటు మిగతావన్నీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయలేకపోయాయి.