మోస్ట్ ఎమోషనల్.. జెర్సీ ట్రయిలర్ రివ్యూ

Friday,April 12,2019 - 09:33 by Z_CLU

ప్రియుడు-ప్రేయసి.. భార్య-భర్త.. తండ్రి-కొడుకు.. గురువు-శిష్యుడు.. ఇలా ఎన్నో ఎమోషన్స్ ను సింగిల్ ట్రయిలర్ లో చూపించింది జెర్సీ. నిజమే.. నాని చెప్పినట్టు ఇది కేవలం క్రికెట్ బేస్డ్ మూవీ మాత్రమే కాదు. అంతకుమించి ఎన్నో భావోద్వేగాలు.

కొద్దిసేపటి కిందట విడుదలైన జెర్సీ ట్రయిలర్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ట్రయిలర్ లోనే ఇంతలా ఉందంటే సినిమా కచ్చితంగా ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటుంది. నాని ఈ ప్రాజెక్టును సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసి, వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోయాడు. అతడు ఎందుకంతలా కనెక్ట్ అయ్యాడో ట్రయిలర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ ఒక్క ట్రయిలర్ తో జెర్సీపై అంచనాలు ట్రిపుల్ టైమ్స్ పెరిగిపోయాయి.

ట్రయిలర్ లో ఏమీ దాచలేదు. సినిమా ఏంటి.. దాని కథ, గమనం ఏంటనే విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు. అర్జున్ అనే వ్యక్తి జీవితానికి సంబంధించిన ఎమోషనల్ జర్నీ ఇది. క్రికెట్ వదిలేసిన పదేళ్లకు మళ్లీ అదే క్రికెట్ లో క్లిక్ అయిన వ్యక్తి లైఫ్ ఇది. నేచురల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కు మరోసారి జస్టిఫికేషన్ ఇచ్చేలా ఉంది అర్జున్ పాత్ర.

ట్రయిలర్ లో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. సాను జాన్ సినిమాటోగ్రఫీ, లైటింగ్ అదిరిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై రంజీ ప్లేయర్ అర్జున్, లైఫ్ జర్నీ ఈనెల 19 నుంచి ప్రారంభం.