జనవరి బాక్సాఫీస్ రివ్యూ

Tuesday,February 04,2020 - 12:02 by Z_CLU

కొత్త ఏడాది మరింత జోష్ తో బిగిన్ అయింది టాలీవుడ్ బాక్సాఫీస్. నంబర్ పరంగానే కాకుండా, బాక్సాఫీస్ వసూళ్ల పరంగా కూడా జనవరి మంత్ చాలా గ్రాండ్ గా ఉంది. జనవరి లో రిలీజైన సినిమాలని 3 దశలుగా ప్రీ పొంగల్, పొంగల్, పోస్ట్ పొంగల్ గా డివైడ్ చేసుకుంటే రిలీజైన సినిమాల బాక్సాఫీస్ రివ్యూ ఇది.

జనవరి ఫస్ట్ వీక్ ఏకంగా డజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే 2020కి సరైన ఓపెనింగ్ మాత్రం ఏ ఒక్క సినిమా ఇవ్వలేకపోయింది. రాజా నరసింహా, బూమరాంగ్ లాంటి సినిమాలు కంటెంట్ తో ఆకట్టుకున్నప్పటికీ.. సరైన పబ్లిసిటీ లేకపోవడంతో బాక్సాఫీస్ బరిలో నిలబడలేకపోయాయి.

వర్మ తీసిన బ్యూటిఫుల్, పాన్-ఇండియా సినిమాగా వచ్చిన అతడే శ్రీమన్నారాయణ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. వీటితో పాటు వచ్చిన రథేరా, ఉల్లాల ఉల్లాల, హల్ చల్, సమరం, ఉత్తర లాంటి సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి.

సెకెండ్ వీక్ లో సంక్రాంతి సినిమాల సందడి ప్రారంభమైంది. జనవరి 9న దర్బార్ తో సంక్రాంతి ఫీవర్ మొదలైంది. గత సినిమాల్లా కాకుండా ఈసారి రజనీకాంత్ ఆకట్టుకున్నాడు. మంచి కంటెంట్ కు తోడు రజనీ లుక్స్, మేనరిజమ్స్ కూడా సింక్ అవ్వడంతో దర్బార్ కు మంచి వసూళ్లు వచ్చాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు రజనీకాంత్ గత సినిమాలతో పోలిస్తే, దర్బార్ కు మంచి వసూళ్లు వచ్చాయి.

ఇక అసలైన సంక్రాంతి సందడి జనవరి 11 నుంచి మొదలైంది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ప్రస్తుతం మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ వచ్చిన 24 గంటల గ్యాప్ లో బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా వచ్చింది. ఈ సినిమా బన్నీ-త్రివిక్రమ్ కెరీర్స్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవడమే కాకుండా.. టాలీవుడ్ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఓవర్సీస్ లో నాన్-బాహుబలి రికార్డు కూడా క్రియేట్ చేసింది.

ఇదే ఊపులో సంక్రాంతికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ కల్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా విడుదలైంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. వసూళ్ల పరంగా కాస్త డిసప్పాయింట్ చేసినప్పటికీ.. కంటెంట్ పరంగా ఓ మంచి సినిమా తీశారనే కాంప్లిమెంట్స్ ను అందుకుంది. ఇక జనవరి మూడో వారంలో డిస్కోరాజా థియేటర్లలోకి వచ్చాడు. వీఐఆనంద్-రవితేజ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ చుట్టూతిప్పి మళ్లీ రొటీన్ రివెంజ్ ఫార్మాట్ లోకి కథను తీసుకురావడంతో సమస్య వచ్చింది.

ఇక జనవరి ఆఖరి వారంలో డబ్ స్మాష్, చూసీచూడంగానే, అశ్వథ్థామ సినిమాలు వచ్చాయి. వీటిలో డబ్ స్మాష్ ఫ్లాప్ అయింది. రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా పరిచయమైన చూసీచూడంగానే సినిమా యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక అన్నీ తానై నాగశౌర్య తీసిన అశ్వథ్థామ సినిమా ఎమోషనల్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది.