Simhasanam కృష్ణ ధైర్య సాహసాలకు ఓ నిదర్శనం
Tuesday,November 15,2022 - 02:00 by Z_CLU
సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ డాషింగ్ కి పెట్టింది పేరు. హీరోగా , నిర్మాత గా, దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలు, సాహసాలు ఎన్నో. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన పరిచయం చేసినవి చాలానే ఉన్నాయి. వాటిలో ఆయన తొలిసారి డైరెక్ట్ చేసి సంచలన విజయం అందుకున్న ‘సింహాసనం’ గురించి తెలుసుకుందాం…

టెక్నాలజీ అంతగా లేని రోజుల్లో కొన్నేళ్ల క్రితం ఏక కాలంలో తెలుగు ,హిందీ రెండు భాషల్లో ఓ భారీ బడ్జెట్ తో జానపద సినిమా తీసి సూపర్ స్టార్ కృష్ణ సంచలనం సృష్టించారు . కృష్ణ చేసిన ఆ సంచలనమైన సినిమానే ‘సింహాసనం’. నటనతో పాటు తొలి సారి దర్శకుడిగా మారి మెగా ఫోన్ పట్టి సూపర్ స్టార్ చేసిన ఈ డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా గురించి అందరూ తెలుసుకోవాల్సిన ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి.

1985 లో హీరోగా ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న కృష్ణ తన మనసులో ఉన్న దర్శకత్వ ఆలోచనను తన సోదరులతో పంచుకున్నారు. కృష్ణ దర్శకత్వం చేయాలనుందని చెప్పగానే సోదరులు హనుమంత రావు, ఆదిశేషగిరి రావు ఇద్దరూ సంతోష పడ్డారు. అయితే కృష్ణ డైరెక్ట్ చేసే తొలి సినిమా మాములుగా ఉండకూడదని ఓ సంచలనం అవ్వాలనుకున్నారు. ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అంటూ చర్చల్లోకి దిగారు. చివరికి అందరూ జానపదంకే ఓటేశారు. అప్పటికే జానపదం నేపథ్యంలో సినిమాలు చేసినప్పటికీ ఈసారి వాటికి మించి ఓ గొప్ప కథతో సినిమా చేయాలనుకున్నారు కృష్ణ.

రచయిత త్రిపురనేని మహారథితో కలిసి కృష్ణ, హనుమంతరావు, ఆదిశేష గిరి రావు చర్చలు జరుపుతున్నారు. చివరికి ఓ కథ కుదిరింది. కాకతీయ సామ్రాజ్యంలోని కొన్ని ఘట్టాలను స్పూర్తిగా తీసుకొని అలకనందాదేవి , విక్రమ సింహా సేనాపతి పాత్రలతో మంచి కథ అల్లారు. ఆ కథకి ‘సింహాసనం’ అనే టైటిల్ ను సూచించారు కృష్ణ సోదరుడు హనుమంత రావు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. సినిమాను భారీ బడ్జెట్ తో ప్రేక్షకులు నివ్వురపోయేలా నిర్మించాలని కృష్ణ డిసైడ్ అయ్యారు. దానికి సోదరులిద్దరూ తగ్గేదే లేదన్నారు. దీన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రెండు భాషల్లో ఒకేసారి చిత్రీకరించేందుకు ప్లాన్ రెడీ చేశారు. హిందీలో జితేంద్రని హీరోగా పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యారు కృష్ణ. అలాగే సినిమా ఆధునిక హంగులతో తెరకెక్కించాలనుకున్నారు. అందుకే 70 ఎం ఎం , స్టీరియో ఫోనిక్ సౌండ్ లాంటివి ప్లాన్ చేశారు. దాంతో దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలోనే మొదటి 70 mm సినిమా, మొదటి స్టీరియో ఫోనిక్ సౌండ్ సినిమాగా ‘సింహాసనం’ హిస్టరీ క్రియేట్ చేసింది.
కృష్ణ ఆదిత్య వర్ధనుడు, విక్రమ సేనాపతిగా ద్విపాత్రాభినయం చేయడానికి ఫిక్స్ అయ్యారు. హీరోయిన్ గా జయప్రద , రాధా లను తీసుకున్నారు. మరో పాత్రకు బాలీవుడ్ నటి మందాకినిను ఫైనల్ చేసుకున్నారు. కాంతారావు , ప్రభాకర్ రెడ్డి ,ఎం బాలయ్య, కైకాల సత్యనారాయణ , గుమ్మడి లతో పాటు మిగతా కాస్టింగ్ ఫైనల్ చేశారు.

సంగీత దర్శకుడిగా బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న బప్పీ లహరి ని ఫిక్స్ చేసుకున్నారు. ఆయనకి తెలుగులో వచ్చిన మొదటి అవకాశం కావడంతో అదిరిపోయే ఎనర్జిటిక్ ట్యూన్స్ రెడీ చేసిచ్చారు. పద్మాలయా స్టూడియోస్ లో యాబై లక్షల వ్యయంతో భారీ సెట్ వేశారు. అంత ఖర్చుతో సెట్ వేసి కృష్ణ గారు చాలా డేర్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు. పద్మాలయాలో సినిమాను ప్రారంభించారు. ప్రారంభం రోజు మొదటి షాట్ కి అక్కినేని నాగేశ్వరావు గారు క్లాప్ ఇచ్చారు. అక్కడి నుండి చక చకా షూటింగ్ జరిగింది. ఇటు తెలుగు అటు హిందీ వర్షన్ రెండు వర్షన్స్ ని 65 రోజుల్లోనే పూర్తి చేశారు.

సినిమా మేకింగ్ మొత్తానికి దాదాపు మూడున్నర కోట్ల వరకూ ఖర్చు తేలింది. అప్పటి వరకూ కృష్ణ గారు నటించిన సినిమాల్లోనే ఇదే భారీ బడ్జెట్. ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయడం కృష్ణ వల్లే సాధ్యమైంది ఏదేమైనా కృష్ణ డేరింగ్, డాషింగ్ హీరో అంటూ ఇండస్ట్రీలో అందరూ గొప్పగా చెప్పుకున్నారు.

రిలీజ్ ముందు విడుదలైన పాటలు మోత మోగించి సూపర్ డూపర్ ఆల్బమ్ అనిపించుకుంది. ముఖ్యంగా ఆకాశంలో ఒక తార సెన్సేషనల్ హిట్టయింది. ఆ సాంగ్ లో మ్యూజిక్ తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతి కలిగించింది. సినిమా ప్రమోషన్ ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు కృష్ణ. అంతకు ముందు వరకు పోస్టర్ కి వాడిన 4, 6, 9 షీట్లు కాకుండా ఏకంగా 24 షీట్ తో పోస్టర్స్ ప్రింట్ చేయించారు. అప్పటి నుండి తెలుగు సినిమాలకు 24 షీట్ పోస్టర్ కామన్ అయిపొయింది. సినిమాపై వచ్చిన క్రేజ్ తో భారీ రేట్లకు సినిమాను అమ్మేశారు. అప్పట్లో ఆ రేట్లకు సినిమాను అమ్మడం ఓ సంచలనం. 21 మార్చ్ 1986 లో భారీ అంచనాలతో 85 ప్రింట్లతో 150 థియేటర్స్ లో విడుదలైన ‘సింహాసనం’ ప్రేక్షకులచే కేకలు పెట్టించి కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దర్శక , నిర్మాత గా కృష్ణ చేసిన ఈ సాహసానికి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ఈ సినిమా మొదటి వారమే కోటి 51 లక్షల 65 వేలు వసూలు చేసి ఆల్ టైం స్టేట్ రికార్డు సృష్టించింది. తొలి సారిగా వైజాగ్ లోని చిత్రాలయ ధియేటర్ లో 100 రోజులు , హైదరాబాద్ లోని దేవి ధియేటర్ లో రోజుకి నాలుగు ఆటలతో 105 రోజులు ప్రదర్శించబడింది. 41 కేంద్రాల్లో వంద రోజులాడింది. రాయలసీమలో 6 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఘనత తొలి సరిగా ఈ సినిమాకే దక్కింది.

1986 జులై 12 న సినిమాకు సంబంధించి శత దినోత్సవ వేడుకను చెన్నైలోని V G R గార్డెన్స్ లో జరిగింది.ఆ వేడుకకు నలుమూలల నుండి దాదాపు కొన్ని వేల మంది కృష్ణ అభిమానులు చెన్నై తరలి వచ్చారు. వేల మంది అభిమానుల మధ్య చిక్కుకుపోయి హీరోయిన్ జయ ప్రద స్టేజిపైకి ఎక్కలేకపోయింది. తర్వాత ఆమెను స్టేజి ఎక్కించేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు నిర్వాహకులు. ఆ భారీ వేడుకకు హిందీ వర్షన్లో హీరోగా నటించిన బాలీవుడ్ నటుడు జితేంద్ర , సూపర్ స్టార్ రజినీ కాంత్ , దర్శకరత్న దాసరి నారాయణ రావు ముఖ్య అతిథులుగా హాజరై యూనిట్ ని అభినందించి షీల్డులు అందజేశారు.

సింహాసనం పద్మాలయ సంస్థలో నిర్మించబడిన 12వ సినిమా.
కృష్ణ ద్విపాత్రాభినయం చేస్తూ కథ, చిత్రానువాదం ,కూర్పు ,నిర్మాణంతో పాటు దర్శకత్వ భాద్యత కూడా తీసుకోవడం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం. నటుడిగా ఉంటూ ఇన్ని బాధ్యతలు చేపట్టి శెభాష్ అనిపించుకున్నారు సూపర్ స్టార్. అందుకే ఇన్నేళ్ళయినా ఆయన అందరికీ ఓ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
కృష్ణ (Ghattamaneni Krisha) దర్శకత్వం వహించిన ‘సింహాసనం’ (Simhasanam) ఇప్పటికీ జానపద చిత్రాలకు ఓ రోల్ మోడల్ గా నిలుస్తుంది. సూపర్ స్టార్ ధైర్య సాహసాలతో ఎక్కడా వెనకడుగు వేయకుండా భారీ వ్యయంతో నిర్మించి తెరకెక్కించిన ‘సింహాసనం’ ఓ సంచలనం సృష్టించి ఓ అద్భుతమైన జానపద సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది.
– రాజేష్ మన్నె
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics