హిట్ మూవీస్ 2017

Sunday,December 31,2017 - 03:01 by Z_CLU

బ్లాక్ బస్టర్ అవుతాయని ఊహించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అస్సలు పట్టించుకోని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇలా 2017లో ఎన్నో ఆశ్చర్యకర ఫలితాలు. 175 స్ట్రయిట్ సినిమాలు విడుదలైతే.. వాటిలో లాభాలు కళ్లచూసిన సినిమాలు పాతిక కూడా లేవు. నెలల వారీగా 2017లో సక్సెస్ అయిన సినిమాలేంటో చూద్దాం.

సంక్రాంతిక కానుకగా జనవరిలో వచ్చిన ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పండక్కి వచ్చి ఇలా అన్నీ హిట్ అవ్వడం ఈమధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం. వీటిలో ఖైదీనంబర్ 150 సినిమా చిరంజీవి రీఎంట్రీ మూవీ కాగా.. బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఇక శతమానంభవతి అయితే ఏకంగా నేషనల్ అవార్డు ఎగరేసుకుపోయింది.

ఫిబ్రవరిలో వచ్చిన స్ట్రయిట్ సినిమాల్లో నేను లోకల్, ఘాజి మాత్రం సక్సెస్ అయ్యాయి. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన నేనులోకల్ సినిమా నానికి అదిరిపోయో బోణీకొట్టింది. ఇక ఘాజీ సినిమాతో అటు లాభాలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రానా.

మార్చి నెలలో కిట్టు ఉన్నాడు జాగ్రత్త, నేనో రకం, కాటమరాయుడు, గురు, 16 సినిమాలు సక్సెస్ అయ్యాయి. వీటిలో 16-ఎవ్రీ డీటెయిల్ కౌంట్ అనేది డబ్బింగ్ సినిమా కావడం విశేషం.

ఇక ఏప్రిల్ లో సరికొత్త చరిత్ర కు పునాది పడింది. ఈనెలలోనే బాహుబలి-ది కంక్లూజన్ సినిమా విడుదలైంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో చరిత్ర సృష్టించడమే కాదు, ఇండియన్ సినీహిస్టరీలోనే అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మూవీతో పాటు వచ్చిన శివలింగ కూడా సక్సెస్ అయింది.

మే నెలలో కేశవ, వెంకటాపురం, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ గా కేశవ, వెంకటాపురం సినిమాలొచ్చాయి. ఇక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నాగచైతన్యకు ఓ మంచి హిట్ అందించింది.

జూన్ నెలలో డీజే, మరకతమణి, అమీతుమీ, అంధగాడు సినిమాలు హిట్ అయ్యాయి. వీటిలో డీజే సినిమా బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవగా.. చిన్న బడ్జెట్ తో వచ్చిన అమీతుమీ, అంధగాడు సినిమాలు మంచి విజయాన్నందుకున్నాయి. డబ్బింగ్ మూవీగా వచ్చిన మరకతమణి కూడా సక్సెస్ అయింది.

జులైలో నిన్నుకోరి సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు నాని. ఈ మూవీతో పాటు అదే నెలలో వచ్చిన ఫిదా అయితే బ్లాక్ బస్టర్ అయింది. వీటితో పాటు మల్టీస్టారర్ గా వచ్చిన శమంతకమణి కూడా ఓ మోస్తరు విజయాన్నందుకుంది.

ఆగస్ట్ లో నేనే రాజు నేనే మంత్రి, జయజానకి నాయక, ఆనందో బ్రహ్మ, అర్జున్ రెడ్డి, లై సినిమాలు హిట్ అయ్యాయి. వీటిలో ఆనందో బ్రహ్మ, అర్జున్ రెడ్డి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా 50 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇక 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ సినిమా 30 కోట్ల రూపాయలు ఆర్జించింది.

సెప్టెంబర్ లో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ, శర్వానంద్ మహానుభావుడు, బాలకృష్ణ పైసావసూల్ సినిమాలు హిట్ అయ్యాయి. వీటితో పాటు మహేష్ నటించిన స్పైడర్ సినిమా ఇదే నెలలో విడుదలై, కొన్ని ఏరియాల్లో లాభాలు తీసుకొచ్చింది.

అక్టోబర్ లో రాజుగారి గది-2, ఉన్నది ఒకటే జిందగీ, గరుడవేగ, రాజా ది గ్రేట్, నెక్ట్స్ నువ్వే సినిమాలు లాభాలు ఆర్జించాయి. వీటిలో రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమా ఆ నెలలో హాట్ టాపిక్ గా మారింది.

నవంబర్ నెలలో మెంటల్ మదిలో, లండన్ బాబులు, అదిరింది, డిటెక్టివ్, ఖాకి, గృహం సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈనెలలో ప్రత్యేకత ఏంటంటే.. స్ట్రయిట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా క్లిక్ అయ్యాయి. అదిరింది, డిటెక్టివ్, ఖాకి, గృహం.. ఇవన్నీ డబ్బింగ్ సినిమాలే.

ఇక డిసెంబర్ లో సుమంత్ నటించిన మళ్లీరావా సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇదే నెలలో ఎంసీఏ సినిమాతో నాని హ్యాట్రిక్ అందుకున్నాడు. ఇక అఖిల్ నటించిన హలో సినిమా కూడా ఇదే నెలలో వచ్చి హిట్ అయింది. వీటితో పాటు తాజాగా విడుదలైన ఒక్క క్షణం కూడా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.