మేజర్ హైలెట్స్ ఇవే

Wednesday,January 04,2017 - 10:50 by Z_CLU

 

చిరంజీవి, బాలకృష్ణ, శర్వానంద్ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడా సినిమాలన్నీ అఫీషియల్ గా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయడంతో అధికారికంగా బాక్సాఫీస్ వార్ షురూ అయింది. కేవలం గంటల వ్యవధిలో ఈ 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వేటికవే ప్రత్యేకమైన సినిమాలు కావడంతో, సంక్రాంతి మూవీస్ పై భారీ అంచనాలున్నాయి.

khaidi-no-150

సంక్రాంతి బరిలో ముందుగా థియేటర్లలోకి వస్తున్నాడు ఖైదీ నంబర్-150. రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. జనవరి 11న, అంటే సరిగ్గా వారం రోజుల్లో ఖైదీ నంబర్-150గా మనముందుకు రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తమిళ్ లో హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. పైగా ఇది చిరంజీవి రీఎంట్రీ మూవీ కావడం, అంతకంటే ముఖ్యంగా 150వ సినిమా కావడం, దేవిశ్రీ అందించిన పాటలు  సూపర్ డూపర్ హిట్ అవ్వడం, టీజర్ కు అద్భుతమైన రెస్పాడం రావడం… ఇలా  అన్నీ కలుపుకొని ఖైదీని హాట్ కేక్ గా మార్చేశాయి.

gautamiputra-satakarni

ఖైదీ నంబర్-150 థియేటర్లలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే బాలయ్య కూడా బాక్సాఫీస్ బరిలో కత్తిదూస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను జనవరి 12న, అంటే గురువారం రోజున థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన శాతకర్ణి మహారాజు జీవితగాధ ఆధారంగా తెరకెక్కడం, పైగా ఇది బాలయ్యకు ప్రతిష్టాత్మక వందో సినిమా కావడం, ట్రయిలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం, చిరంతన్ భట్ అందించిన సంగీతం సూపర్ డూపర్ హిట్ అవ్వడం… ఇలా ఎన్నో ఎలిమెంట్స్ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చేశాయి.

shatamanam-bhavati

ఇక సంక్రాంతి బరిలో ముచ్చటగా మూడో సినిమా శతమానం భవతి. ఖైదీ నంబర్-150, గౌతమీపుత్ర శాతకర్ణితో ఈ మూవీకి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే ఇదొక అచ్చమైన పల్లెటూరి కుటుంబ  కథాచిత్రం. దిల్ రాజు నిర్మాతగా, శర్వానంద్-అనుపమ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా, సరిగ్గా సంక్రాంతి రోజున అంటే, జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. సంక్రాంతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికే వస్తుండడం దీనికి పెద్ద అడ్వాంటేజ్. పైగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ఇమేజ్ దీనికి ఎక్స్ ట్రా ఎట్రాక్షన్. దీనికి తోడు అనుపమ అందాలు, మిక్కీ జే మేయర్ హిట్ సాంగ్స్, ప్రకాష్ రాజ్-జయసుధ పర్ ఫార్మెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణలు. అందుకే శతమానంభవతి కూడా రేసులో నెగ్గుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ 3 సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.