ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు సినిమా కాకుండా… పవన్ మరో సినిమా కూడా స్టార్ట్ చేశాడు. దసరా పర్వదినం నాడు ఏఎం రత్నం సమర్పణలో నేసన్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై ప్రస్తుతం వాడివేడి చర్చ జరుగుతోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు ముద్దుగుమ్మల పవన్ సరసన ఛాన్స్ కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్ తో ఇప్పటికే ఓసారి నటించిన త్రిష… మరోసారి పవర్ స్టార్ సరసన నటించేందుకు పావులు కదుపుతోందట. ఈ మేరకు తన క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ తో పాటు పవన్ నిర్మాత శరత్ మరార్ తో కూడా త్రిష్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అటు పవన్ తో ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన కాజల్ కూడా కుదిరితే మరోసారి పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఈ మేరకు నేరుగా పవన్ తోనే చర్చించినట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు పవన్ తో కలిసి వర్క్ చేయని రకుల్ ప్రీత్ సింగ్, నయనతార కూడా నేసన్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ సినిమా కోసమే కాల్షీట్లు ఖాళీగా ఉంచేందుకు, తమిళ్ లో వచ్చిన విశాల్ సినిమా ఆఫర్ ను రకుల్ ప్రీత్ సింగ్ రిజెక్ట్ చేసిందనే రూమర్ నడుస్తోంది. మరోవైపు దర్శకుడు నేసన్.. స్వయంగా నయనతారతో సంప్రదింపులు జరిపినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.