Avika Gor - నిర్మాతగా చిన్నారి పెళ్లికూతురు

Tuesday,February 16,2021 - 04:23 by Z_CLU

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో బుల్లితెర వీక్షకులను… ‘ఉయ్యాలా జంపాలా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన సినిమాల్లో కథానాయిక నటించిన అవికా గోర్ తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నారు.

ఆచార్య క్రియేషన్స్‌, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్. సాయి రోనక్ హీరో. ఈ చిత్రానికి ఎం.ఎస్. చలపతి రాజు సహ నిర్మాత. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహించనున్నారు.

ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ “నా చిన్నతనం నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇక్కడ ప్రతి అంశాన్ని నిశితంగా గమనించా. అందుకని, ప్రొడక్షన్ లోకి రావాలని అనుకుంటున్నాను. ఆచార్య క్రియేషన్స్ కోసం రాసిన కథను మురళీ నాగ శ్రీనివాస్ గంధం నాకు చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నిర్మాతగా నా తొలి సినిమాకు ఇదే సరైన కథ అనుకున్నాను. దాంతో నేనూ ప్రొడక్షన్ లో పార్ట్ అవుతానని చెప్పా. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.