గాయాలపాలవుతున్న హీరోలు

Thursday,April 04,2019 - 10:02 by Z_CLU

కొందరు హీరోలు వరుసగా గాయాలకు గురవుతూ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నారు.  ఒకరి తర్వాత మరొకరు షూటింగ్ లో గాయపడుతుండడం టెన్షన్ పెడుతోంది. లేటెస్ట్ గా షూటింగ్ లో  గాయపడిన హీరోలెవరో చూద్దాం.


రామ్ చరణ్ ఇటివలే జిమ్ లో వర్కవుట్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో మోస్ట్ ఎవైటింగ్ మల్టీస్టారర్ ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ ఆగిపోయింది. రామ్ చరణ్ గాయపడడంతో ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. చరణ్ రికవరీ కావడానికి మూడు వారాలు పడుతుంది ఆ తర్వాతే ‘ఆర్-ఆర్-ఆర్’ పూణె షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.


మొన్నీ మధ్యే హీరో విశాల్ షూటింగ్ లో గాయపడి హాస్పిటల్ లో చేరాడు. సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విశాల్. టర్కీలో జరిగిన ఈ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. అక్కడి రోడ్లపై భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా విశాల్‌ బైక్‌ అదుపుతప్పి పడిపోయాడు. దాంతో ఎడమ చేతికి, ఎడమ కాలికి గాయమైంది. వెంటనే షూటింగ్ క్యాన్సల్ చేసిన యూనిట్ విశాల్ ని హాస్పిటల్ లో చేర్చి షెడ్యుల్ ని నెల పాటు వాయిదా వేసుకున్నారు.


‘జెర్సీ’ షూటింగ్ లో చాలా సార్లు గాయాలపాలయ్యాడు నాని . క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో క్రికెట్ ఆడే సన్నివేశాల షూటింగ్ సమయంలో నాని ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో తగిలిన గాయాలను మర్చిపోతూ సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చాడు నాని.


గోపీచంద్ కూడా లేటెస్ట్ గా షూటింగ్ లో గాయపడ్డాడు. తిరు అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న గోపీచంద్ రాజ‌స్థాన్ లోని జై స‌ల్మేర్ లో జరిగిన షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. యాక్ష‌న్ ఎపిసోడ్ షూట్ చేస్తుండగా గోపీచంద్ కింద‌ప‌డ్డాడు. దాంతో కాలి భాగంలో తీవ్ర గాయమైంది. అప్పటికప్పుడు స‌మీపంలోని హాస్ప‌ిట‌ల్ కు చికిత్స కోసం త‌ర‌లించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో తన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్నాడు.


‘సాహో’ షూటింగ్ సమయంలో ప్రభాస్ కూడా గాయపడ్డాడు. గతేడాది డిసెంబర్ లో ఓ యాక్షన్ పార్ట్ షూట్ చేస్తుండగా గాయపడ్డాడు ప్రభాస్. వెంటనే హాస్పిటల్ లో చేరి ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసాడు.


విజయ్ దేవరకొండ కూడా ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ లో గాయలపాలయ్యాడు. కాకినాడ రైల్వే  స్టేషన్ లో  పరుగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కే సన్నివేశాన్ని  విజయ్ దేవరకొండ పై షూట్ చేసారు. ఆ సమయంలో కాలు స్లిప్ కావడంతో కిందపడ్డాడు. పక్కనే ఉన్న షూటింగ్ యూనిట్ విజయ్ ని వెంటనే పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇలా వరుసపెట్టి హీరోలు షూటింగ్ లో గాయపడుతుండడం ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.