సంపూర్నేష్ బాబు ఇంటర్వ్యూ

Wednesday,August 07,2019 - 04:34 by Z_CLU

సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ‘కొబ్బరి మట్ట’ సినిమా ఆగస్ట్ 10 న థియేటర్స్ లోకి రాబోతుంది. మరో రెండు రోజుల్లో మూడు పాత్రలతో నవ్వుల పువ్వులు పూయించడానికి రెడీ అవుతున్నాడు సంపూర్నేష్.  ఈ సందర్భంగా సంపూ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..

 

ఛాలెంజింగ్

నటుడిగా ఈ సినిమా నాకో ఛాలెంజ్. సినిమాలో పెదరాయుడు, పాపారాయుడు, ఆన్ద్రాయిడ్ అనే మూడు పాత్రలు చేసాను. ఒకే రోజు మూడు పాత్రలతో సన్నివేశాలు షూట్ చేసాం. అది చాలా కష్టమనిపించింది. పొద్దున్న పెదరాయుడు సన్నివేశాలు , మధ్యాహ్నం పాపారాయుడు సన్నివేశాలు సాయంత్రం ఆన్ద్రాయిడ్ సన్నివేశాలు ఉండేవి. ఒకే రోజు మూడు వేరియేషన్స్ చూపిస్తూ నటించడం చాలా కష్టం. అది ఈ సినిమాతో నాకు అర్థం అయింది.

 

ఆలస్యానికి చాలా కారణాలు

హృదయ కాలేయం సినిమా రిలీజ్ కి ఓ పోస్టర్ వదిలాం. అప్పుడు మేం చాలా చిన్న బడ్జెట్ అనుకోని స్టార్ట్ చేశాం. కాని మొదలు పెట్టాక బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా అవుట్ డోర్ లో చాలా మంది ఆర్టిస్టులతో షూట్ చేసాం. మేము ముప్పై రోజులు అనుకున్న షెడ్యుల్ నలబై ఐదు రోజులు జరగేది. ఆ తర్వాత నేను బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా ‘సింగం 123’, వైరస్ సినిమాలు చేయాల్సి వచ్చింది. ఇలా సినిమా ఆలస్యానికి చాలా కారణాలున్నాయి.

 

అదే గొప్ప రోజు

ఈ సినిమాకు సంబంధించి నాకు గొప్ప రోజు అంటే అది నేను మూడున్నర నిమిషాల డైలాగ్ చెప్పిన రోజు. సాయి రాజేష్ గారు ఆ డైలాగ్ పేపర్ ఇవ్వగానే నాకు టైం కావాలని చెప్పాను. ఆయన ఒకే అన్నాక రెండు మూడు రోజులు బట్టి పట్టాను. కానీ షూట్ టైంలో సింగిల్ టేక్ లోనే చెప్పేసాను. ఇప్పుడు ఆ డైలాగ్ కి ఇంత క్రేజ్ రావడం సినిమాపై హైప్ పెరగడానికి కారణమయినందుకు హ్యాపీ గా ఉంది.

 

మోహన్ బాబు గారు మాట్లాడారు

మూడున్నర నిమిషాల డైలాగ్ రిలీజ్ చేసిన ఐదు గంటల్లో మోహన్ బాబు గారి నుండి ఫోన్ వచ్చింది. చాలా బాగా చెప్పావ్ అని అభినందించారు. నన్ను మా టీం ని బ్లెస్ చేసారు. ఆయన ప్రత్యేకంగా మెచ్చుకోవడం చాలా  ఆనందమేసింది.


నన్ను నిలబెట్టడానికే

‘హృదయ కాలేయం’ తర్వాత మళ్ళీ నన్ను నిలబెట్టడం కోసమే స్టీవెన్ శంకర్ ఈ సినిమాకు నిర్మాతగా మారాడు. తన ఆలోచనలతో ప్రమోషన్స్ తో ఈ సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. తను నమ్మిన కథకు దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ పూర్తి న్యాయం చేసాడు.

 

నా పరిస్థితి వేరు

నిజానికి నాకొచ్చిన క్రేజ్ ని నేను క్యాష్ చేసుకున్నానా ? లేదా అన్నది పక్కన పెడితే అసలు నా పరిస్థితి వేరు. ఎక్కడో సిద్దిపేట లోని మిట్టపల్లి నుండి ఇక్కడి వరకూ రావడం నేను హీరోగా చేయడం గొప్ప విషయమే. అందుకే  నా క్రేజ్ గురించి పట్టించుకోకుండా నేను కేవలం నరసింహ చారి అని గుర్తుపెట్టుకుంటాను. సాయి రాజేష్ కూడా నాకు ఎప్పుడూ ఈ క్రేజ్ గురించి పట్టించుకోకుండా నీ పని చేసుకుంటూ వెళ్ళిపోమని చెప్తుంటాడు. ప్రస్తుతం అదే చేస్తున్నాను.

 

ఏడాదికో సారి

ఏడాదికో సారి నరసింహ చారిగా వరంగల్ కి వెళ్లి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటాను. ఇప్పుడు సంపూగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్ళాను. అక్కడ జనాల రెస్పాన్స్ బాగుంది.

పూరి గారి సినిమా అందుకే చేయలేకపోయా

‘కొబ్బరి మట్ట’ చేస్తున్నప్పుడే పూరి జగన్నాథ్ గారు ఆయన సినిమాలో ఓ కామెడీ క్యారెక్టర్ చేయమని అడిగారు. కానీ మా సినిమా షూటింగ్ ఆ సినిమా షూటింగ్ ఒకే టైంలో ఉండటం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. ఆయన ఇంక మాట్లాడరేమో అనుకున్నాను. కానీ ‘కొబ్బరి మట్ట’ లో ఓ సాంగ్ లాంచ్ చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇప్పటికీ ఆయనతో కాంటాక్ట్ లో ఉన్నాను.

 

చాలా హ్యాపీ

‘హృదయకాలేయం’ ఐమ్యాక్స్ లో ఒక షో వేయాలని ప్రయత్నించాం. వారిని అడిగితే కొత్త వాళ్ళు కదా అని అన్నారు. ఇప్పుడు అదే మాల్ లో ‘కొబ్బరి మట్ట’ కి స్క్రీన్ మొత్తం ఫుల్ అవ్వడం, మళ్ళీ రెండో స్క్రీన్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.