హీరో ప్రదీప్ మాచిరాజు ఇంటర్వ్యూ

Thursday,January 28,2021 - 03:16 by Z_CLU

బుల్లితెరపై తన వాక్ చాతుర్యంతో టాప్ యాంకర్ గా దూసుకెళ్తున్న ప్రదీప్ మాచిరాజు రేపే హీరోగా సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నాడు. ప్రదీప్ హీరోగా తెరకెక్కిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రదీప్ మీడియాతో సినిమా గురించి మాట్లాడారు. ఆ విశేషాలు తన మాటల్లోనే !

 

ఫైనల్ గా హీరో 

అందరిలాగే సినిమా పోస్టర్స్ చూస్తూ సినిమాల మీద ఇష్టం పెంచుకున్నాను. తర్వాత చదువు పూర్తి చేసి యాంకర్ గా ప్రయత్నాలు చేశాను.  ఆర్ .జే గా ప్రయాణం మొదలెట్టి తర్వాత వీ.జే గా మారి తర్వాత షో హోస్ట్ , టెలివిజన్ ప్రొడక్షన్స్ బిజీ అయ్యాను. ఫైనల్ గా ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా మారబోతున్నా. నా ప్రయాణం తలుచుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే ఏదో సాధించినట్టు అనిపిస్తుంది.

 

ఇంట్రెస్టింగ్ లైన్ 

మున్నా గారు నాకు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. ఫుల్ నెరేషన్ ఇచ్చాక నేను హీరోగా చేయడానికి ఎదురుచూసిన కథలా అనిపించింది. ఈ కథ నాకే ఎందుకు చెప్పారు అని డైరెక్టర్ ని అడిగా.. ఈ కథలో అబ్బాయి గారుగా మిమ్మల్ని ఊహించుకున్నాను అంటూ ఓ స్కెచ్ వేసుకొచ్చి గెటప్ చూపించారు. తర్వాత ఏం ఆలోచించకుండా సెట్స్ పైకి వెళ్ళిపోయాం.

 

తేడా కనిపించాలనుకున్నా 

యాంకర్ ప్రదీప్ కి బిగ్ స్క్రీన్ పై ప్రదీప్ తేడా కనిపించాలనుకున్నా. సరిగ్గా అలాంటి సినిమానే వచ్చింది. యాంకర్ అంటే అందరి ఇంట్లో ఓ అబ్బాయిగా నాలా ఉంటాను. హీరో అనే సరికి కొంచెం చేంజ్ కనిపించాలనుకున్నా. ఆ తేడా రేపు స్క్రీన్ పై ఆడియన్స్ కి కనిపిస్తుందని అనుకుంటున్నాను.

అది నా అదృష్టం

ఒకే సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తూ వేరియేషన్స్ చూపించే కథ దొరకడం అరుదు. లక్కీ గా మున్నా గారి ద్వారా నా మొదటి సినిమాకే అలాంటి కథ దొరికింది. ఒక రకంగా అది నా అదృష్టం అనుకుంటున్నా.

ఇంటర్వెల్ నుండి టర్న్ 

కథలో కోర్ పాయింట్ ప్రేక్షలను కచ్చితంగా థ్రిల్ చేస్తోంది. ఇంటర్వెల్ నుండి కథ టర్న్ అవుతుంది. అక్కడి నుండి క్లైమాక్స్ వరకు సినిమా ఎమోషనల్ గా సాగుతూ అక్కడక్కడా నవ్విస్తూ వెళ్తుంది. ఓవరాల్ గా సినిమా చూసాక ఒక మంచి సినిమా చూసామనే ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది.

మ్యూజిక్ హైలైట్ 

సినిమాకు అనూప్ గారి మ్యూజిక్ హైలైట్ అవుతుంది. కేవలం సాంగ్స్ మాత్రమే కాకుండా ఆర్ ఆర్ కూడా సినిమాకు ప్రాణం పోసింది. ప్రాజెక్ట్ అనుకోగానే అనూప్ గారిని కలిసి అన్న హీరోగా ఒక సినిమా చేస్తున్నా మంచి సాంగ్స్ కావాలి అని అడిగా. నెక్స్ట్ డే డైరెక్టర్ కథ చెప్పగానే అనూప్ గారు సినిమాను ఛాలెంజింగ్ గా ఫీలయ్యారు. వెంటనే సినిమా చేస్తున్నా అంటూ ఆ వారంలోనే ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ ను కంపోజ్ చేసి వినిపించారు.

అస్సలు ఊహించలేదు 

నీలి నీలి ఆకాశం షూటింగ్ జరుగుతుండగానే వింటున్నాం. సాంగ్ చాలా బాగా వచ్చింది సూపర్ హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఈ రేంజ్ మిలియన్ వ్యూస్ ఇంత క్రేజ్ అందుకుంటుందని అస్సలు ఊహించలేదు. అనూప్ గారి మ్యూజిక్ కి చంద్ర బోస్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. అలాగే సిద్ శ్రీరామ్ , సునీత గారి మేజిక్ వాయిస్ కూడా సాంగ్ కి ప్లస్ అయ్యింది. ఆ సాంగ్ ను అందరికంటే ముందుగా చూసింది సూపర్ స్టార్ మహేష్ గారే. ఆయనకి సాంగ్ బాగా నచ్చింది. అడిగిన వెంటనే చెప్పిన ముహూర్తానికి ఆయన సాంగ్ ను లాంచ్ చేశారు. ఆయన హ్యాండ్ తో సాంగ్ ఎక్కడికో వెళ్ళింది.

 

రెమ్యునరేషన్ తీసుకోలేదు 

సినిమాకు హీరోగా రెమ్యునరేషన్ ఇంకా తీసుకోలేదు. ముందుగా సినిమాకు కావాల్సిన పాపులర్ టెక్నీషియన్స్ కోసం బడ్జెట్ పెట్టమని నిర్మాత గారితో చెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. అయినా నా రెమ్యునరేషన్ తీసుకోలేదు. రిలీజ్ తర్వాత లాభాలు వస్తే ఇవ్వమని చెప్పాను.

షూటింగ్ లో యాక్సిడెంట్ 

ఈ సినిమా షూటింగ్ యాక్షన్ ఎపిసోడ్ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగి నా కాలికి గాయమైంది. లెగ్ కి ఆపరేషన్ అయ్యింది. సో నా మొదటి సినిమాకు సంబంధించి అదో బ్యాడ్ మూమెంట్.

ఆ తేడా గమనించా

స్మాల్ స్క్రీన్ మీద యాంకర్ గా , బిగ్ స్క్రీన్ పై హీరోగా చేయడానికి చాలా తేడ ఉంటుంది. బుల్లితెరపై అలసిన ప్రేక్షకులను నాలా ఉంటూ నవ్వించే ప్రయత్నం చేస్తుంటా. కానీ సినిమా అలా కాదు. నటుడు అంటే అన్ని ఎమోషన్స్ చూపించాలి. అది కొంచెం కష్టమే. నిజ జీవితాన్ని మరిచిపోయి కథలో లీనమై నటించాలి. ఆ తేడా బాగా గమనించా.

ఇంకా ఫైనల్ అవ్వలేదు 

ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా నా ఈ మొదటి సినిమా విడుదల మీదే ఉంది. ఇంకా రెండో సినిమా ప్లాన్ చేసుకోలేదు.