హీరో 'నవీన్ విజయ్ కృష్ణ' ఇంటర్వ్యూ

Friday,October 04,2019 - 03:33 by Z_CLU

సీనియర్ నటుడు నరేష్ తనయుడిగా ‘నందిని నర్సింగ్ హోం’ తో హీరోగా పరిచయమైన నవీన్ విజయ్ కృష్ణ.. ‘ఊరంతా అనుకుంటున్నారు’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అన్ని కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపే థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా నవీన్ ఈ సినిమా గురించి తన కెరీర్ గురించి మీడియాతో మాట్లాడారు.

సినిమా ఆగింది.. కారణం అదే

‘నందిని నర్సింగ్ హోం’ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమాతో పాటు ‘విఠలాచార్య’ అనే సినిమా అనుకున్నాను. కానీ ‘ఊరంతా అనుకుంటున్నారు’ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణం చేత కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ‘విఠలాచార్య’ సినిమా ఆగిపోయింది. సమంత ‘ఓ బేబీ’ సినిమా, మా సినిమా కథాపరంగా ఒకేలా ఉంటాయి. అందుకే ఓ ఐదు రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆ సినిమాను పక్కన పెట్టాం. కానీ అది చాలా మంచి కథ. కచ్చితంగా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే కొన్ని మార్పులు చేసి మళ్ళీ సినిమాను షూట్ చేసే ఆలోచనలో ఉన్నాం”

ఆయన సలహాలు తీసుకున్నాను

ఏ సినిమాకి నాన్నగారి సలహాలు తీసుకోలేదు. కానీ ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమా వరకూ ఆయన సజిషన్స్ తీసుకున్నాను. ఆయన ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి ఆయనకి స్టోరీ చెప్పడం జరిగింది. ఆయన కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చారు.

ఊరంతా అనుకోవాలి

ఇప్పుడు చూడలేకపోతున్న పల్లెటూరిని అలాగే అప్పటి వాతావరణాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం చేసాం. కంప్లీట్ ఫ్యామిలీ అందరూ చూసేలా తీర్చిదిద్దాం. సినిమా బాగుందని ఊరంతా అనుకోవాలని ఆశిస్తున్నాను.

నా జీవితం ఓ సినిమా కథ

నిజానికి నా జీవితం ఓ సినిమా కథ లాంటిది. ఏం చెయ్యాలో తెలియని వయసులో హీరో రానా కంపెనీలో రోజుకి 500 తీసుకొని వర్క్ స్టార్ట్ చేశా. నా తొలి చెక్ 1000 రూపాయలు. ఆ చెక్ నాన్నమ్మకు ఇచ్చి చీర కొనుక్కోమని చెప్పాను. నిజానికి నానమ్మ , నాన్న ఎప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడాలని కోరుకునే వారు. అందుకే నా ప్రయాణంలో వారి సపోర్ట్ ఎక్కువగా తీసుకోలేదు. ఎడిటర్ గా కొంత పేరుతెచ్చుకున్న తర్వాత కృష్ణవంశీ ‘డేంజర్’ సినిమాకు ఎడిటర్ గా అవకాశం ఇచ్చారు. అక్కడి నుండి చాలా సినిమాలకు ఎడిటర్ గా పనిచేసాను. ట్రైలర్స్ కూడా కట్ చేసే వాణ్ని.

‘నర్సింగ్ హోం’ కి మాత్రమే

సాయి ధరమ్ తేజ్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. తను సినిమా ట్రైలర్స్ ఒక్కో సారి అందరి కంటే ముందు నేనే చూస్తుంటాను. ఎడిటింగ్ లో ఏదైనా మైనస్ అనిపిస్తే చెప్పేవాణ్ణి. నా సినిమాలకు నేనెప్పుడు ఎడిటింగ్ చేయలేదు. ఒక్క నందిని నర్సింగ్ హోం కి మాత్రమే మా ఎడిటర్ అందుబాటులో లేని సమయంలో ఎడిటింగ్ చేసుకున్నాను.

రీమార్క్ తొలగించుకోవాలి

చేసిన 4 సినిమాల్లో రెండు సినిమాలు ఆగిపోవడం నా కెరీర్ లో పెద్ద రిమార్క్. ఎంత కాదనుకున్నా ఆ హీరోతో సినిమానా ? రెండు సినిమాలు రిలీజ్ కూడా అవ్వలేదు అనుకుంటారు కదా. సో ప్రస్తుతం ఆ రిమార్క్ ను తీసేసి మంచి సినిమాలతో హీరోగా ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాను. నెక్స్ట్ ఒక సినిమా అనుకుంటున్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుంది. కానీ లాంచ్ మాత్రం ఉండదు (నవ్వుతూ).

డైరెక్షన్ చేస్తే నటించను

టెక్నికల్ గా అనుభవం ఉంది కాబట్టి డైరెక్షన్ చేయాలనుంది. ఎడిటింగ్ టేబుల్ మీద డైరెక్టర్ విజన్ తెలుసుకున్నాను కనుక ఆ ఆలోచనయితే ఉంది. ఇక డైరెక్షన్ చేస్తే అందులో నేను మాత్రం నటించను. రెండు పనులు చేయడం నా వల్ల కాదు.   ప్రొడ్యూస్ చేసే ప్లాన్ కూడా ఉంది. త్వరలోనే ఆ దిశగా ఆలోచిస్తాను.

మహేష్ అన్న అందుకే రాలేకపోయారు

నా మొదటి సినిమా నుండి మహేష్ అన్న సపోర్ట్ చేస్తూ వచ్చారు. ‘నందిని నర్సింగ్ హోం’ సినిమాకు ఆయన వచ్చి బ్లెస్ చేసారు. ఆ తర్వాత నా సినిమా లాంచ్ కి కూడా వచ్చారు. ఈ సినిమా ఫంక్షన్ కి కూడా పిలిచాను. కానీ వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోయారు. అందుకే ట్వీట్ చేసారు.