Interview : 'నవీన్ పోలిశెట్టి' (జాతి రత్నాలు)

Wednesday,March 10,2021 - 01:56 by Z_CLU

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ పోలిశెట్టి రేపే ‘జాతి రత్నాలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అనుదీప్ దర్శకుడిగా నాగ్ అశ్విన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడాడు నవీన్. ఆ విశేషాలు తన మాటల్లోనే …

అంచనాలు అందుకోవాలి 

నేను చేసిన ‘చిచోరే’ , ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలు నటుడిగా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. మూడో సినిమా ఆ అంచనాలు అందుకునేలా ఉండాలని అనుకున్నా. సరిగ్గా అలాంటి కథే ‘జాతి రత్నాలు’గా దొరికింది.

ఇప్పటికి కుదిరింది 

నాగ్ అశ్విన్ నేను మిత్రులం. మేమిద్దరం ఎప్పటి నుండో సినిమా చేయాలనుకున్నాం. ఫైనల్ గా ఈ సినిమాతో మా కాంబో హీరో -ప్రొడ్యుసర్ గా కుదిరింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్ ఎండింగ్ లో ఉండగా నాగీ ఆ కథ వినమని చెప్పాడు. అనుదీప్ వచ్చి చెప్పగానే సినిమా చేస్తున్నా అని చెప్పాను. కథలో హిలేరియస్ ఫన్ ఉంటుంది. నెరేట్ చేసేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో రేపు సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్  కూడా అంతే ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది.

జోగి పేట్ శ్రీకాంత్ ఎంటర్టైన్ చేస్తాడు

జాతిరత్నాలు లో జోగిపేట్ శ్రీకాంత్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ నాకు దొరకడం అదృష్టం. కామెడీకి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇది. నాతో పాటు దర్శి , రాహుల్ రామకృష్ణ కూడా నవ్విస్తారు.

ఆడియన్స్ కి రిలీఫ్ 

కరోన ఎఫెక్ట్ లాక్ డౌన్ వీటన్నిటి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆడియన్స్ కి ‘జాతి రత్నాలు’ సినిమా హిలేరియస్ గా నవ్వించి ఒక రిలీఫ్ ఇస్తుంది. సినిమా చూసాక ఆడియన్స్ ఒక నవ్వుతో బయటికొస్తారు. ఆ నవ్వే సినిమాకొచ్చే అతిపెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను.

అందరి ఇన్ పుట్స్ 

ఈ సినిమా  స్క్రిప్ట్ జరిగేటప్పుడు , సెట్స్ లో షూట్ జరుగుతున్నప్పుడు అందరి ఇన్పుట్స్ ఉన్నాయి. నేను కూడా నాకు అనిపించినవి డైరెక్టర్ కి చెప్పాను. ఇది మా టీం అందరు కలిసి చేసిన ఒక మంచి ఎంటర్టైనర్ సినిమా. అనుదీప్ స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి సినిమాను బాగా తీసాడు.

ముందే ప్రిపేర్ అవుతా 

రేపు షూట్ చేసే సీన్ పేపర్ ఈరోజే చూస్తూ ప్రిపేర్ అవుతుంటా. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అనుదీప్ నెక్స్ట్ డే సీన్ ముందు రోజు నైట్ పంపించేవాడు. అప్పటి వరకు పడుకోకుండా వెయిట్ చేసేవాడ్ని. షూట్ నా ఆలస్యం అవ్వకూడదనేది నా ఉద్దేశ్యం. ముందే ప్రీపెర్ అయితే సీన్ మనం అనుకున్న దానికంటే ఇంకా బెటర్ గా రావొచ్చు.

కథలో పాత్రలం 

మా పాత్రలతో కథ నడిచే సినిమా కాదు. నడిచే కథలో మేము పాత్రలం అనిపించేలా ఉంటుంది.  మూడు క్యారెక్టర్స్ అమాయకంగా ఉంటూ దుర్మార్గులుగా అనిపిస్తాయి. అదెలా అనేది స్క్రీన్ పై చూడాల్సిందే.

Jathi-Ratnalu-march-11-release-naveen-polisetty

క్యూట్ లవ్ స్టోరీ 

సినిమాలో ఫన్ తో పాటు క్యూట్ లవ్ ట్రాక్ ఉంటుంది. చిట్టి క్యారెక్టర్ లో ఫరియా బాగా చేసింది. మా ఇద్దరి కెమిస్ట్రీ సినిమాలో బాగుంటుంది. చిట్టి సాంగ్  కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.

వాళ్ళే మా జాతిరత్నాలు 

ఈ సినిమా విషయానికొస్తే నాగి , స్వప్న , ప్రియాంక నే మా జాతి రత్నాలు. వాళ్ళు ఈ స్క్రిప్ట్ నమ్మి సినిమా చేయకపోతే జాతిరత్నాలు ఇంత వరకు వచ్చేది కాదు. వాళ్లకి ఈ సందర్భంగా నా స్పెషల్ థాంక్స్.

ప్రతీ ఇంట్లో ఓ నవీన్ ఉంటాడు 

టాలెంట్ ని గుర్తించి అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం. నా విషయంలో అదే జరిగింది. ఎప్పటికప్పుడు నా టాలెంట్ చూసి దర్శకులు ఆఫర్స్ ఇస్తూ వస్తున్నారు. నిజానికి ప్రతీ ఇంట్లో ఓ నవీన్ ఉంటాడు. వారి ఆసక్తిని బట్టి తనలో ఓ టాలెంట్ ఉంటుంది. అది గుర్తించే వాళ్ళు ఉంటే ఎవ్వరైనా నవీన్ అవ్వొచ్చు.

తనే మొదటి ఆడియన్ 

ఈ సినిమాను దాదాపు పది సార్లు చూడలనుకున్న ఓ అభిమానికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతను సినిమా చూడలేకపోతున్నానని ఫీలయ్యాడు. అందుకే నిన్న అందరి కంటే ముందే అతనికి సినిమా చూపించడం జరిగింది. తనతో నేను వీడియో కాల్ ద్వారా మాట్లాడాను. తను సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. అతనే మా సినిమాకు మొదటి ఆడియన్.

కొత్తదనం ఉండాలి 

నేను చేయబోయే సినిమా కొత్తదనంతో ఉండాలని కోరుకుంటాను. అలాంటి కథలకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇంతకు ముందే వచ్చిన కథలు టచ్ చేయకూడదనుకుంటా. అందుకే పూర్తి కథ వినే ముందే పాయింట్ అడిగా తెలుసుకుంటాను. నా సినిమాకు మనీ పెట్టి వచ్చే ఆడియన్స్ కి ఏదో కొత్తదనం చూపించాలని ఫీలవుతుంటాను.

నెక్స్ట్ ఫిలిమ్స్ అవే 

తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకున్నాను. త్వరలోనే అవి ఎనౌన్స్ చేస్తాను. అలాగే హిందీలో ఒక సినిమా చేయబోతున్నా. ఇండియా బయటికెళ్ళి షూట్ చేయాల్సిన కథ అది. అందుకే ఆలస్యం అవుతుంది.