హీరో కల్యాణ్ రామ్ ఇంటర్వ్యూ

Wednesday,June 13,2018 - 01:06 by Z_CLU

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది నా నువ్వే సినిమా. కల్యాణ్ రామ్, తమన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. దీనికి కారణం కెరీర్ లో ఫస్ట్ టైం కల్యాణ్ రామ్, లవర్ బాయ్ గా నటించడమే.ఆ గెటప్ తో పాటు మూవీ హైలెట్స్ ను మనతో పంచుకున్నాడు కల్యాణ్ రామ్.

నా కల నెరవేరింది
ఇదొక రొమాంటిక్ మూవీ. ఇలాంటి సినిమా చేయడం నాకు ఫస్ట్ టైం. పీసీ శ్రీరామ్ తో వర్క్ చేయడం నా అదృష్టం. గీతాంజలి టైమ్ నుంచి అనుకునేవాడ్ని పీసీ శ్రీరామ్ తో వర్క్ చేయాలని. మొత్తానికి నా కల నెరవేరింది.

అంతా కొత్తగా ఉంది
కమర్షియల్ సినిమాల్లో మన బాడీలాంగ్వేజ్ స్పీడ్ గా ఉంటుంది. కానీ నా నువ్వే లాంటి రొమాంటిక్ సినిమాలు చేసేటప్పుడు, కొంచెం సటిల్ గా ఉండాలి. కళ్లు పెద్దవి చేయకూడదు. హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉండకూడదు. తల ఎక్కువ ఊపకూడదు. డైలాగ్స్ మధ్య గ్యాప్ ఇవ్వాలి. డైలాగ్ కంటే ఎక్స్ ప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించాయి.

కాస్త కష్టపడ్డాను
నా నువ్వేలో క్యారెక్టర్ తో సింక్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. మొదట లుక్ దగ్గరే చాలా కష్టపడ్డాం. జయేంద్ర అండ్ టీం చాలా కష్టపడింది. లుక్ ఫిక్స్ అయిన తర్వాత సటిల్ యాక్టింగ్ కోసం నేను కష్టపడాల్సి వచ్చింది. అన్నీ డౌన్ చేసి చూపించాలి. కొంచెం కష్టమైంది.

దర్శకుడి సృష్టి
నా క్యారెక్టర్ కోసం ఎవర్నీ ఇన్సిపిరేషన్ గా తీసుకోలేదు. పూర్తిగా డైరక్టర్ జయేంద్ర మైండ్ నుంచి వచ్చిన పాత్ర ఇది. అతడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాను. ఒక్క ఎక్స్ ప్రెషన్ ఎక్కువగా ఇచ్చినా కట్ చెప్పేసేవాడు. సినిమాలో నా పాత్రపై అతడికి అంత క్లారిటీ ఉంది.

కెరీర్ స్టార్టింగ్ లో చేయాల్సిన సినిమా
నిజానికి కెరీర్ స్టార్టింగ్ లో ఇలాంటి సినిమా చేసుంటే బాగుండేది. డైరక్టర్ ను కూడా అదే అడిగాను. అవకాశం ఇప్పుడొచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఈ సినిమాలో నా లుక్ అందరికీ నచ్చింది. నా కొడుకు కూడా నేను చాలా అందంగా ఉన్నానని మెచ్చుకున్నాడు. నాకొచ్చిన పెద్ద కాంప్లిమెంట్ అదే. నేను మీసం తీసేయడం నా భార్యకు కూడా నచ్చింది.

కాస్త స్వార్థం కూడా ఉంది
సినిమాలో నా పూర్తి క్యారెక్టర్ గురించి చెప్పలేను. సినిమా చూసి తెలుసుకోవాలి. నాది, తమన్నాదే కీలక పాత్రలు. అమెరికాలో జాబ్ కోసం వెళ్తున్న ఓ కుర్రాడిగా నేను కనిపిస్తాను. కాస్త స్వార్థం కూడా ఉంటుంది నా పాత్రలో.

తమన్నకు నాకు కామన్ పాయింట్
తమన్నతో వర్క్ చేయడం చాలా బాగుంది. ఆమె చాలా ప్రొఫెషనల్. సెట్స్ లో టైమ్ కు ఉంటుంది. జయేంద్ర స్టయిల్ ఏంటంటే.. టోటల్ సీన్ ను సింగిల్ షాట్ లో తీయడం ఆయనకు అలవాటు. మొత్తం సీన్ అయిపోయిన తర్వాతే కట్ చెబుతారు. అందుకే తమన్న, నేను షూటింగ్ కు ముందు చాలా ప్రాక్టీస్ చేశాం. తమన్నకు నాకు కామన్ గా బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ గా కలిసి అదే తాగేవాళ్లం.

స్టోరీలైన్ ముందే ఫిక్స్ చేస్తా
ఏడాదికి ఎన్ని సినిమాలు చేయాలనే టార్గెట్ నాకు లేదు. అంతా నా మైండ్ సెట్ ప్రకారం వెళ్లిపోతుంటా. ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో కథ నచ్చితే వెంటనే చేసేస్తా. పైగా కాస్త ముందుగానే స్టోరీలైన్ కు ఓకే చెబితే.. నేను ఫ్రీ అయ్యే టైమ్ కు పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే రెడీ అవుతుంది. అలా టైం ఆదా అవుతుంది కదా.

ఒకే ఇమేజ్ ఇష్టముండదు
ప్రస్తుతం కేవీ గుహన్ తో ఓ సినిమా చేస్తున్నాను. అది పూర్తిగా కొత్త కాన్సెప్ట్. అలాంటి క్యారెక్టర్, అలాంటి సినిమా ఇప్పటివరకు నేను చేయలేదు. అంతా నచ్చింది కాబట్టే చేస్తున్నాను. నాను నేను కొత్త పాత్రలు చేయాలి, కొత్తగా కనిపించాలి. భవిష్యత్తులో కూడా రొమాంటిక్ స్టోరీస్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఏదో ఒక ఫ్రేమ్ కు ఫిక్స్ అయిపోవడం నాకిష్టం ఉండదు.

మెయిన్ తేడా అదే
కమర్షియల్ హీరోకు, రొమాంటిక్ హీరోకు చాలా తేడా ఉంటుంది. కమర్షియల్ హీరోకు ఫిజికల్ గా కష్టం ఉంటుంది. ఫైట్స్ చేయాలి, దూకాలి, అరవాలి. అదే రొమాంటిక్ హీరో విషయానికొస్తే అంతా మైండ్ వర్క్ ఉంటుంది. మనసులోనే ఆలోచించుకొని యాక్ట్ చేయాలి. ఎందులో కష్టం అందులో ఉంది. రెండూ రెండే. కాకపోతే హీరోయిన్ తో కెమిస్ట్రీ వర్కవుట్ అయితే రొమాంటిక్ హీరోగా చేయడం ఈజీ.

మిగతా పాత్రలు కూడా ముఖ్యమే
సినిమాలో తమన్నది, నాది మెయిన్ రోల్స్. మాతో పాటు తణికెళ్ల భరణి, పోసాని, వెన్నెల కిషోర్, ప్రవీణ్ కూడా మంచి పాత్రలు పోషించారు. సినిమాలో ఈ పాత్రలన్నీ కీలకమైనవే. కిరణ్, విజయ్, మహేష్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

అప్ కమింగ్ మూవీస్
కేవీ గుహన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా జులై 18 నాటికి సగం టాకీ పూర్తవుతుంది. ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాను. దీనికి సంబంధించి స్టోరీ ఫిక్స్ చేశాం. గున్నం గంగరాజు గారు డైలాగ్స్, స్క్రీన్ ప్లే విభాగాలు చూసుకుంటారు. ఇదొక మల్టీస్టారర్ మూవీ. సో.. నాతో పాటు మరో హీరో ఎవరైతే బాగుంటుందో నలుగురు పేర్లు సూచించమని అడిగాను. ప్రస్తుతానికి నేను హీరోగా చేస్తున్న సినిమాలివే. ఇక నిర్మాతగా వచ్చే ఏడాది ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఓ సినిమా ఉండొచ్చు.