హీరో గోపీచంద్ ఆవిష్కరించిన "మెంటల్" ఆడియో

Monday,August 22,2016 - 10:15 by Z_CLU

 

శ్రీకాంత్, అక్ష  హీరోహీరోయిన్ లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లలో సంయుక్త నిర్మాణంలో కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘మెంటల్’. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లో హీరో గోపీచంద్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.  

ఈ సందర్బంగా హీరో గోపి చంద్ మాట్లాడుతూ “శ్రీకాంత్ అన్న కమిట్మెంట్ ఉన్న హీరో కాబట్టి వంద సినిమాలు పూర్తి చేసాడు. అది మాకు సాధ్యం కాదు. ఈ ట్రైలర్స్ చూస్తుంటే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. సంగీత దర్శకుడు సాయి కార్తిక్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అతను ఈ చిత్రానికి కూడా మంచి సంగీతాన్ని అందించి ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్ సభ్యులందరికీ మంచి పేరు తీసుకురావాలి” అని అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “దర్శకుడు తీస్తున్న విధానం చూసి కొద్దిగా కంగారు పడ్డాను. ఈ సినిమా మరో ‘ఆపరేషన్ దుర్యోధన’ అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిమా అవుట్ పుట్ చూస్తే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అలాగే సాయి కార్తిక్ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నా నా మాట కాదనలేక ఈ సినిమా చేసాడు. మంచి సంగీతాన్ని అందించాడు. దర్శక నిర్మాతలందరూ ఈ సినిమా కోసం చాల కష్టపడ్డారు. వారందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. 

ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ కార్యక్రమంలో తొలుత సినిమా టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ, ఇన్ కం ట్యాక్స్ కమీషనర్ మరియు దర్శకురాలైన వాణి ఎం కొసరాజులు ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు దాసరి ప్రసాద్ (ఏలూరు), అనగాని ప్రసాద్, శివాజీ రాజా, ప్రతాని రామకృష్ణ గౌడ్, మల్కాపురం శివకుమార్, శ్రీమిత్ర చౌదరి, జి.వి.లతో బాటు తెలంగాణా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు గోపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సినిమాలో సుహాసిని, నిఖిత, రచన మౌర్య, ముమైత్ ఖాన్, పోసాని, కోట, బ్రహ్మానందం మొదలైన వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం : సాయి కార్తీక్, ఎడిటింగ్ : కోటగిరి, ఫైట్స్ : రవి, కెమెరా : బుజ్జి, నిర్మాతలు : వి.వి.ఎస్.ఎన్.వి ప్రసాద్ దాసరి, వి.వి. దుర్గాప్రసాద్ అనగాని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : కారణం బాబ్జి