హరికృష్ణ... సిల్వర్ స్క్రీన్ సీతయ్య

Wednesday,August 29,2018 - 11:24 by Z_CLU

చెప్పినమాట వినని వ్యక్తిని సీతయ్యతో పోల్చడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సీతయ్య.. ఎవరి మాట వినను అనేది చాలా పాపులర్ డైలాగ్. అలా ‘సిల్వర్ స్క్రీన్ సీతయ్య’గా అందరి హృదయాల్లో నిలిచిపోయారు నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ నటవారసుడిగా చిత్రపరిశ్రమకొచ్చిన హరికృష్ణ, బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.

‘శ్రీకృష్ణావతారం’ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు హరికృష్ణ. కమలాకర కామేశ్వర రావ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం1964లో విడుదలైంది. ఈ చిత్రంలో హరికృష్ణ చిన్ని కృష్ణుని పాత్రలో కనిపించారు. తరువాత వచ్చిన ‘తల్లా పెళ్లమా’ చిత్రంలో కూడా బాలనటుడిగా మెప్పించారు.

పెద్దయిన తర్వాత రామ్ రహీమ్, తాతమ్మ కల లాంటి చిత్రాల్లో బాలకృష్ణతో కలిసి నటించారు హరికృష్ణ. తర్వాత 1977లో వచ్చిన దానవీరశూరకర్ణలో అర్జునుడిగా కనిపించారు. 1980లో తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడంతో పూర్తిగా రాజకీయాలకే అంకితమైపోయారు హరికృష్ణ.

1998లో, అంటే దాదాపు రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. మోహన్ బాబు నటించిన శ్రీరాములయ్యలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, శివరామరాజు లాంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించారు. లాహిరి లాహిరి లాహిరి చిత్రానికి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది పురస్కారం కూడా అందుకున్నారు.

ఇవన్నీ ఒకెత్తు, హరికృష్ణ కెరీర్ లో సీతయ్య సినిమా మరో ఎత్తు. ఈ సినిమాలో హరికృష్ణ చెప్పిన “సీతయ్య.. ఎవరి మాట వినను” అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా హరికృష్ణకు స్టార్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. అదే ఇమేజ్ తో ఎన్నో సినిమాల్లో సోలో హీరోగా నటించి మెప్పించారాయన.

ఇలా ‘వెండితెర సీతయ్య’గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న హరికృష్ణ మనమధ్య లేరు. ఆయన మనల్ని వీడి వెళ్లినా, ఆయన పోషించిన పాత్రలు, సినిమాలు కలకాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి.