పుట్టినరోజు శుభాకాంక్షలు

Thursday,May 04,2017 - 11:20 by Z_CLU

తెలుగు సినిమాకు ఓ రూపు తీసుకొచ్చి, దారి చూపించిన దర్శకులు ఎందరో. వాళ్లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ పేరు దాసరి నారాయణరావు. వందకు పైగా సినిమాలతో, చరిత్ర తిరగరాసిన సూపర్ హిట్స్ తో పరిశ్రమలో అందరి చేత దర్శకరత్న అనిపించుకున్నారు డా.దాసరి నారాయణరావు.

హీరోయిజం అనే పదం కొందరికే పరిమితమైన రోజులవి. అలాంటి టైమ్ లో సాధారణ నటుల్ని కూడా వెండితెరపై స్టార్లను చేసిన ఘనత దాసరికి దక్కుతుంది. మొదటి సినిమా తాత-మనవడుతోనే తన పంథా ఏంటో చెప్పకనే చెప్పారు దాసరి. సినిమాకు కావాల్సింది స్టార్ హీరో కాదు.. నమ్ముకున్న కథను నమ్మినట్టు తీస్తే ఆ కథే హీరోల్ని తయారుచేస్తుందని నిరూపించారు డాక్టర్ దాసరి నారాాయణరావు.

తన 40 ఏళ్ల కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు తీశారు దాసరి. మొదటి సినిమా తాత-మనవడు సంచలనంతో మొదలుపెడితే.. బలిపీఠం, శివరంజని, ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి, మేఘసందేశం.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సినిమాలొస్తాయి.

కేవలం మెగాఫోన్ కే ఫిక్స్ అయిపోలేదు దాసరి. కథారచయిత, నిర్మాత, కొరియోగ్రాఫర్, లిరిసిస్ట్.. ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. వెండితెరపై కూడా నటుడిగా తనదైన ముద్రవేశారు దాసరి. ఇప్పటికీ కొన్ని పాత్రలు దాసరి చేస్తే బాగుంటుందనే చర్చ టాలీవుడ్ లో వినిపిస్తుంది.

తన కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు అందుకున్నారు దాసరి. 2 జాతీయ అవార్డులతో పాటు 4 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇక నంది అవార్డులకైతే లెక్కలేదు. 9 నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా ఈ దర్శకరత్నను వరించింది. తెలుగు సినీరంగానికి ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా.. ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.